Begin typing your search above and press return to search.

మరీ ఇంత ఓవర్ యాక్షన్ పనికిరాదేమో ?

By:  Tupaki Desk   |   2 May 2021 1:30 PM GMT
మరీ ఇంత ఓవర్ యాక్షన్ పనికిరాదేమో ?
X
మాజీమంత్రి దేవినేని ఉమ మహేశ్వరరావుది కచ్చితంగా ఓవర్ యాక్షన్ అనే అనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి పై మార్ఫింగ్ వీడియో కేసులో సీఐడీ విచారణను ఎదుర్కొంటున్నారు. విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన దేవినేని మాట్లాడిన మాటలు చాలా విచిత్రంగా ఉంది. సీఐడీ అధికారులు తనను 8 గంటలపాటు విచారించే బదులు విజయసాయిరెడ్డిని విచారిస్తే వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్యచేశారో తెలుస్తుందన్నారు.

అసలు దేవినేనిని సీఐడీ పోలీసులు ఎందుకు విచారించారు. వివేకా హత్యకేసులో అయితే కచ్చితంగా కాదు. వీడియో మార్ఫింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న దేవినేని మీడియాతో ఆ విషయం మాట్లాడాల్సిందిపోయి వివేకానందరెడ్డి హత్యకేసు గురించి మాట్లాడటం కచ్చితంగా ఓవర్ యాక్షన్. ఎందుకంటే వీడియో మార్ఫింగ్ కేసుకు, వివేకా హత్యకేసుకు ఏమీ సంబంధంలేదు.

ఇక తమపై తప్పుడు కేసులు నమోదుచేసి విచారణ పేరుతో వేధిస్తున్న పోలీసు అధికారులందరినీ గుర్తుంచుకుంటామని హెచ్చరించటమే ఆశ్చర్యంగా ఉంది. తాము అధికారంలోకి రాగానే గుర్తుపెట్టుకున్న వాళ్ళందరినీ ఒడిస్సా, చత్తీస్ ఘర్ రాష్ట్రాల సరిహద్దుల్లోకి బదిలీ చేస్తారట. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుచేస్తున్న అధికారులందరికీ ఇదే తరహా సమాధానం ఇస్తామని హెచ్చరించటమే విచిత్రంగా ఉంది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎవరు అధికారంలో ఉన్నా పోలీసులను కరివేపాకులాగ వాడుకుంటున్నారన్నది వాస్తవం. టీడీపీ అధికారంలో ఉన్నపుడు వైసీపీ ఎంఎల్ఏలు, నేతలపై పెట్టిన తప్పుడు కేసుల మాటేమిటి ? తాము అధికారంలో ఉన్నపుడు వైసీపీ నేతలను జైళ్ళకు పంపించిన విషయాలను దేవినేని మరచిపోయారా ? యాక్షన్ కు రియాక్షన్ తప్పదన్న చిన్న విషయం మాజీమంత్రి మరచిపోయి ఓవర్ యాక్షన్ చేస్తే ఎలా ?

దేవినేని మార్ఫుడు వీడియోను ప్రదర్శిచింది వాస్తవమే అని టీడీపీ నేతలే ఆఫ్ ది రికార్డుగా అంగీకరిస్తున్నారు. ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుండి జగన్ పై నోటికొచ్చినట్లు ఆరోపణలు, విమర్శలు చేస్తునే ఉన్నారు. సరే ఇవన్నీ రాజకీయంగా జరిగే విషయాలే కాబట్టి ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఎప్పుడైతే జగన్ చేయని వ్యాఖ్యలను కూడా చేసినట్లు దేవినేని ఓ మార్ఫుడు వీడియోను ప్రదర్శించటంతో కేసు నమోదైంది. తాను ప్రదర్శించింది మార్ఫుడు వీడియోనా కాదా ? అన్నది దేవినేని చెప్పాలి కానీ అనవసరమైన మాటలు మాట్లాడినందు వల్ల ఉపయోగం ఉండదని గ్రహించాలి.