Begin typing your search above and press return to search.

రేవంత్ సక్సెస్ అయినట్లేనా ?

By:  Tupaki Desk   |   8 May 2022 1:39 AM GMT
రేవంత్ సక్సెస్ అయినట్లేనా ?
X
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సక్సెస్ అయినట్లేనా ? కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఉత్సాహం చూస్తుంటే అలాగే ఉంది. రేవంత్ పీసీసీ చీఫ్ అయిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తెలంగాణాకు రావటం ఇదే మొదటిసారి. కాబట్టి రాహుల్ రాక సందర్భంగా రేవంత్ తన కెపాసిటి ఏమిటో నిరూపించుకోవాలని గట్టి పట్టుదలతో పనిచేశారు. రాహుల్ టూర్ విజయవంతం అయ్యేందుకు దాదాపు నెల రోజుల నుండి కష్టపడ్డారు.

అనుకున్నట్లుగా హన్మకొండలో జరిగిన రైతు సభకు భారీగానే హాజరయ్యారు. వరంగల్లో బహిరంగ సభ సక్సెస్ అయితే తర్వాత జరగబోయే ఎన్నికల్లో కూడా పార్టీ విజయం సాధిస్తుందనే సెంటిమెంటు బలంగా ఉంది. ఆ సెంటిమెంటును దృష్టిలో పెట్టుకునే రేవంత్ చాలా కష్టపడ్డారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పీతల బుట్ట లాంటిది. బుట్టలో నుండి బయటపడేందుకు ఒక పీత ప్రయత్నం చేస్తుంటే దాన్ని కిందకు లాగేసేందుకు మరికొన్ని పీతలు శక్తికొద్దీ ప్రయత్నం చేస్తుంటాయి.

రేవంత్ ఎక్కడ సక్సెస్ కొడతాడో అధిష్టానం దగ్గర ఎక్కడ మంచి మార్కులు కొట్టేస్తారో అనే దుర్బుద్ధితో కొందరు వెనక్కు లాగే ప్రయత్నం చేశారు. అయితే రేవంత్ ఎక్కడా ఆవేశపడకుండా జాగ్రత్తగా డీల్ చేశారు.

వీలైనంతమంది నేతలను దారిలోకి తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి లాంటి వాళ్ళతో జాగ్రత్తగా మసులుకున్నారు. ఇలాంటి అనేక కారణాలతో వరంగల్ బహిరంగ సభ సక్సెస్ అయ్యిందనే అనుకోవాలి.

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులతో రాహుల్ ముఖాముఖి జరిగుంటే నూరుశాతం కాంగ్రెస్ నేతలు హ్యాపీగా అయ్యేవారేమో. మొదటినుండి ఆ ప్రోగ్రామ్ వివాదాలతో మొదలై చివరకు వివాదంతోనే ముగిసింది.

ఎప్పుడైతే విద్యార్ధులతో ముఖాముఖి సాధ్యం కాదని తేలిపోయిందో వెంటనే రేవంత్ వరంగల్ బహిరంగసభ విజయవంతంపైనే మరింత దృష్టిపెట్టారు. మొత్తానికి రాహుల్ దగ్గర రేవంత్ కు మంచి మార్కులే పడినట్లున్నాయి. మిగిలిన ఏడాది కాలాన్ని కూడా రేవంత్ జాగ్రత్తగా నెట్టుకొస్తే ఎన్నికల్లో మంచి ఫలితం అందుకనే అవకాశముంది.