Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ డ‌బుల్ గేమ్ చూశారా..!

By:  Tupaki Desk   |   15 Aug 2019 9:50 AM GMT
టీఆర్ ఎస్ డ‌బుల్ గేమ్ చూశారా..!
X
తెలంగాణ‌లో దూకుడు పెంచుతున్న క‌మ‌ల‌ద‌ళాన్ని ఎదుర్కొన‌డంలో అధికార టీఆర్ ఎస్ త‌డ‌బ‌డుతోంది. ఆ పార్టీ నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. మొత్తంగా టీఆర్ ఎస్ డ‌బుల్‌ గేమ్ ఆడుతుందా..? అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎందుకంటే.. తెలంగాణ టీడీపీ నేత‌లంద‌రూ దాదాపుగా బీజేపీ వైపు చూస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు కీల‌క నేత‌లు ఆ పార్టీలోకి వెళ్లారు. అయితే.. అక్క‌డ‌క్క‌డ మిగిలిన కీల‌క నేత‌లు కూడా రేపోమాపో క‌మ‌లంగూటికి చేర‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. అయితే.. టీఆర్ ఎస్ నేత‌ల మాట‌ల్లోనే ఏదో తేడా కొడుతోంది. టీటీడీపీ నేత‌లంద‌రిని చంద్ర‌బాబు కావాల‌నే బీజేపీలోకి పంపిస్తున్నార‌ని ఏకంగా మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస‌యాద‌వ్ ఆరోపిస్తున్నారు.

నిజానికి.. తెలంగాణ టీడీపీని ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు ప‌ట్టించుకునే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. ఆయ‌న కేవ‌లం ఏపీకే ప‌రిమితం అవుతున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో దారుణంగా ఓడిపోయి.. అధికారాన్ని కోల్పోయారు. ఈ నేప‌థ్యంలో ఏపీ నేత‌లు కూడా క‌మ‌లం పార్టీలోకి క్యూ క‌డుతున్నారు. ఏకంగా న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు బీజేపీలో చేరిన విష‌యం తెలిసిందే. ఇక ఇదే స‌మ‌యంలో తెలంగాణ‌లోనూ బీజేపీ మ‌రింత దూకుడు పెంచేసింది. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో నాలుగు స్థానాల్లో విజ‌యం సాధించిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఆ పార్టీ మ‌రింత బ‌లోపేతం అయింది.

రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం చూస్తున్న‌వారంద‌రూ కూడా క‌మ‌లం గూటికి చేరుతున్నారు. ఈ నేప‌థ్యంలో అధికార టీఆర్ ఎస్‌ లో కొంత టెన్ష‌న్ మొద‌లైంద‌న్న‌ది మాత్రం వాస్తవం. ఇక్క‌డే అధికార టీఆర్ ఎస్ నేత‌లు అయోమ‌యంలో ప‌డిపోతున్నారు. ప్ర‌జ‌ల్లో కాలం చెల్లిన నేత‌లు చేరినా.. బీజేపీకి ఒరిగేదేమీ లేద‌ని మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస‌యాద‌వ్ అంటున్నారు. ఇన్నాళ్లూ.. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ఉనికే క‌రువైంద‌ని, ఆ పార్టీ ఎక్క‌డ ఉందంటూ అన్న గులాబీ నేత‌లే.. ఈ రోజు మాట‌మారుస్తున్నారు.

తెలంగాణ‌లో బీజేపీ కంటే.. కాంగ్రెస్ పార్టీనే బ‌లంగా ఉంటుంద‌ని చెబుతున్నారు. ఇదే స‌మ‌యంలో మ‌ళ్లీ చంద్ర‌బాబును అడ్డం పెట్టుకుని త‌మ ప్రాంతీయ‌వాద‌న‌తో బీజేపీని ఎదుర్కోవాల‌ని చూస్తున్నార‌న్న చ‌ర్చ‌లు కూడా స్టార్ట్ అయ్యాయి. నిజానికి.. బీజేపీని ఎదుర్కొనే విష‌యంలో గులాబీ నేత‌ల‌కు క్లారిటీ లేద‌నే టాక్ ఆ పార్టీ శ్రేణుల్లోనే వినిపిస్తోంది. అందుకే ఇలా మ‌ళ్లీ చంద్ర‌బాబును ముందుకు తెస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. తెలంగాణ‌లో బీజేపీ బ‌ల‌ప‌డేందుకు కావాల‌నే టీడీపీ నేత‌ల‌ను బాబు ఆ పార్టీలోకి పంపుతున్నార‌ని టీఆర్ ఎస్ నేత‌లు రోపిస్తున్నారు.

కానీ వాస్త‌వంగా అక్క‌డ బీజేపీ దూకుడుతో టీఆర్ ఎస్ నేత‌లు మ‌ళ్లీ బాబు పేరు వాడుకుంటూ... అక్క‌డ కాంగ్రెస్ బ‌లంగా ఉంద‌ని వాళ్లకు వాళ్లే చెప్పుకుంటున్నారు. నిన్న‌టి వ‌ర‌కు అక్క‌డ కాంగ్రెస్ అడ్ర‌స్ గ‌ల్లంతైంద‌ని చెప్పిన టీఆర్ఎస్ నేత‌లే ఇప్పుడు బీజేపీ కంటే అక్క‌డ కాంగ్రెస్ బ‌లంగా ఉంద‌ని చెప్పుకోవ‌డం విచిత్రం.