Begin typing your search above and press return to search.

టీటీడీని రాజకీయాలకు వాడేస్తున్నారా?

By:  Tupaki Desk   |   15 April 2022 3:30 PM GMT
టీటీడీని రాజకీయాలకు వాడేస్తున్నారా?
X
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు.. దేశవ్యాప్తంగా భక్తులు పోటెత్తుతారు. ఆ దేవదేవుడిని కరోనా టైంలో జనాలు దర్శించుకోలేకపోయారు. ఇప్పుడు నిబంధనలు సడలించడం.. ఆంక్షలు లేకపోవడంతో సహజంగానే భక్తులు పోటెత్తుతున్నారు. ప్రతి హిందువు ఎప్పుడో ఒకప్పుడు తిరుమలేషుడిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

కరోనా కల్లోలం తగ్గడంతో సహజంగానే తిరుమలకు భక్తులు పోటెత్తారు. పైరవీలు.. ముందస్తు బుకింగ్ లతో చాలా మంది టైమ్ స్లాట్ ప్రకారం వెళుతుండగా.. అధికరద్దీతో చాలా మందికి దర్శన భాగ్యం కలగలేదు. దీంతో టోకెన్ల కోసం ఎగబడ్డారు. తొక్కిసలాట కూడా చోటుచేసుకుంది. అయితే టీటీడీ వెంటనే స్పందించి టోకెన్లు లేకున్నా భక్తులు అందరినీ దర్శనానికి అనుమతించింది.

ఈ వేసవియే కాదు.. ప్రతీ వేసవిలోనూ ఇదే పరిస్థితి. ప్రతి హిందువూ తిరుమలకు వెళ్లాలని కోరుకుంటారు. పిల్లలకు సెలవులు వస్తాయి.. పెద్దలకు సమ్మర్ హాలీడేస్ ఉంటాయి. అందుకే సమ్మర్ మొదలైందంటే చాలు అందరూ తిరుమలకు పోటెత్తుతారు. కిటకిటలాడేలా పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఒక్కోసారి భక్తులను అదుపు చేయడం కష్టమవుతుంది.

రెండు రోజుల క్రితం కూడా తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తోపులాట.. గాయాలు కావడంతో అందరూ టీటీడీపై విమర్శలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా దేవాదాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణ వెంటనే స్పందించారు. తిరుమల వెళ్లి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులతో నేరుగా మాట్లాడి వసతులు, దర్శన సౌకర్యాలపై ఆరాతీశారు.

గతంలో శ్రీవారిని దర్శించుకునేందుకు 20 నుంచి 36 గంటలు పట్టేదని.. ఇప్పుడు టైం స్లాట్ విధానం వల్ల భక్తులు రెండు , మూడు గంటల్లోనే దర్శనం చేసుకుంటున్నారని సత్యానారాయణ తెలిపారు. మీడియా, ప్రతిపక్షాలు వాస్తవాలు తెలుసుకోకుండా నానాయాగీ చేయవద్దని హితవు పలికారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా రద్దీని దృష్టిలోపెట్టుకొని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఒకవర్గం మీడియా, ప్రతిపక్షాలు ఇప్పటికైనా వాస్తవాలు, రద్దీని తెలుసుకొని మాట్లాడాలని హితవు పలుకుతున్నారు. తిరుమల వేంకటేశ్వరుడిని, భక్తులను రాజకీయాలకు వాడుకోవద్దని సూచిస్తున్నారు.