Begin typing your search above and press return to search.

ఉమ కోరిక తీరిపోయిందా ?

By:  Tupaki Desk   |   29 July 2021 4:42 AM GMT
ఉమ కోరిక తీరిపోయిందా ?
X
మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు కోరిక తీరిపోయినట్లే కనిపిస్తోంది. గదచిన రెండేళ్ళుగా కొన్ని వందలసార్లు దేవినేని ప్రభుత్వాన్ని చాలెంజ్ చేశారు. దమ్ముంటే తనను అరెస్టు చేసుకోమంటు పదే పదే రెచ్చగొట్టారు. మైలవరం నియోజకవర్గంలోని జీ కొండూరు మండలంలో మంగళవారం రాత్రి జరిగిన గొడవలకు సంబంధించి ఉమతో పాటు మరో 18 మందిపై పోలీసులు కేసులు నమోదుచేసి అరెస్టుచేశారు.

బుధవారం వర్చువల్ విధానంలో జరిగిన విచారణలో దేవినేనికి కోర్టు ఆగష్టు 10వ తేదీవరకు రిమాండ్ విధించింది. దాంతో దేవినేనితో పాటు మరో 18 మందిని రాజమండ్రి జైలుకు తరలించారు. పోలీసులు అరెస్టుచేసి కోర్టు ద్వారా రాజమండ్రి జైలుకు రిమాండ్ కు పంపటం వల్ల దేవినేని కోరిక తీరినట్లే అనిపిస్తోంది. గడచిన రెండేళ్ళుగా దేవినేని ప్రభుత్వంపై ప్రతిచిన్న విషయానికి పెద్ద నోరేసుకుని విరుచుకుపడిపోతున్నారు.

మైలవరం నియోజకవర్గంలో తన హయాంలో జరిగిన అవినీతి, అవకతవకలను కూడా ప్రభుత్వం హయాంలో జరుగుతోందని, ఎంఎల్ఏ వసంత కృష్ణప్రసాద్ వందల కోట్ల రూపాయలు దోచేసుకుంటున్నారని పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. వసంతపై దేవినేని చేసిన ఆరోపణలు, విమర్శలు కొన్నిసార్లు సృతిమించిపోయి స్ధానికులే దేవినేనిపై తిరగబడిన విషయం అందరికీ తెలిసిందే.

తమకు మద్దతుగా నిలిచే మీడియా ద్వారా ప్రభుత్వం+ఎంఎల్ఏపై దేవినేని బురద చల్లేస్తున్నారనే ఆరోపణలు బాగా వినబడుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. పార్టీతో పాటు దేవినేని కూడా ఓడిపోయారు. దాంతో జగన్మోహన్ రెడ్డిపైన, తనను ఓడించిన వసంతపైన దేవినేనికి బాగా మంటగా ఉంది. దాంతో ఎంఎల్ఏను ఎలాగైనా గబ్బుపట్టించాలన్న టార్గెట్ పెట్టుకుని వ్యక్తిగతంగా పదే పదే ఆరోపణలతో టార్గెట్ చేస్తున్నారు.

దేవినేని చేసిన ఆరోపణలను పార్టీ స్ధానిక నేతలు ఖండించిన సందర్భాలు కూడా ఉన్నాయి. పంటకాల్వల తవ్వకం, టిడ్కో ఇళ్ళ నిర్మాణాల్లాంటి అనేక విషయాలపై దేవినేని ఆరోపణలను సొంతపార్టీ నేతలే విభేదించారు. అయినా తన పద్దతి మార్చుకోకుండా జీ కొండూరు మండలంలో అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారంటూ రాత్రి అక్కడికి వెళ్ళారు. విషయం తెలియగానే వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా అక్కడికి వెళ్ళటంతో పెద్ద గొడవైంది. ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. దాంతో ఇరువైపులా పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ ఫిర్యాదుల ఆధారంగానే దేవినేని అరెస్టయ్యారు.