Begin typing your search above and press return to search.

ఎమ‌ర్జెన్సీతో పాటు విభ‌జ‌న బిల్లు పాఠంగా పెట్టండి!

By:  Tupaki Desk   |   26 Jun 2017 6:50 AM GMT
ఎమ‌ర్జెన్సీతో పాటు విభ‌జ‌న బిల్లు పాఠంగా పెట్టండి!
X
అధికారంలో ఉన్న‌ప్పుడు ఉండే సౌల‌భ్యం అంతాఇంతా కాదు. అందులోకి పూర్తి స్థాయి మెజార్టీ ఉంటే ఆ లెక్కే వేరు. తాజాగా అలాంటి కంఫ‌ర్ట్‌ ను పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేస్తోంది మోడీ స‌ర్కారు. పాల‌న‌ మొత్తం త‌న చుట్టూ తిరిగేలా చేయ‌ట‌మే కాదు.. నిర్ణ‌యం ఏదైనా తాను మాత్ర‌మే తీసుకునే ప‌రిస్థితిని సృష్టించుకున్నారు మోడీ.

విప‌క్షాల బ‌లహీన‌త‌ల్ని త‌న బ‌లంగా మార్చుకునే విష‌యంలో మోడీకి మించిన నేత ఉండ‌ర‌నే చెప్పాలి. త‌ర త‌మ భేదాలు లేకుండా వ్య‌వ‌హ‌రిస్తార‌న్న ఇమేజ్‌ను సొంతం చేసుకున్న మోడీ.. విప‌క్ష పార్టీల‌కు ఎంత‌లా చుక్క‌లు చూపిస్తున్నారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఈ విష‌యంలో మోడీ మాత్ర‌మే కాదు.. మోడీ బ్యాచ్ లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించే నేత‌లంతా ఇలాంటి మైండ్ సెట్ లోనే ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ మింగ‌లేని, క‌క్క‌లేని కొన్ని అంశాల మీద దృష్టి సారిస్తున్నారు క‌మ‌ల‌నాథులు. దేశంలో అత్య‌యిక ప‌రిస్థితి విధించ‌టం ద్వారా ఇందిర‌మ్మ చేసిన దిద్దుకోలేని త‌ప్పును సంద‌ర్భానుసారంగా తెర మీద‌కు తీసుకురావ‌టంలో మోడీ అండ్ కో ఆర్టే వేరు.

వివిధ వేదిక‌ల మీద ఎమర్జెన్సీ దుర్మార్గాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌స్తావించే ప్ర‌ధాని మోడీ బాట‌లో ప‌య‌నిస్తున్నారు కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌. తాజాగా ఆయ‌న ఎమ‌ర్జెన్సీ రోజుల్ని త‌ర‌చూ ప్ర‌స్తావిస్తున్నారు. ఇటీవ‌ల‌ ఒక స‌భ‌లో మాట్లాడిన వెంక‌య్య‌.. అత్య‌యిక ప‌రిస్థితిని పాఠ్యాంశంగా పెట్టాల‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకునే వార‌న్న విష‌యాన్ని భ‌విష్య‌త్ త‌రాల‌కు అవ‌గాహ‌న క‌లిగించాలంటే పాఠ్యాంశంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. అదే జ‌రిగితే.. క‌మ‌ల‌నాథుల‌కు క‌లిగే రాజ‌కీయ ప్ర‌యోజ‌నం గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. అందుకే.. కాంగ్రెస్ మాట్లాడ‌లేని ఎమ‌ర్జెన్సీ మీద త‌ర‌చూ ఈ త‌ర‌హా వ్యాఖ్య‌ల్నే చేస్తుంటారు క‌మ‌ల‌నాథులు.

నిజ‌మే.. ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా నాటి ఇందిర‌మ్మ స‌ర్కారు తీసుకున్న ఎమ‌ర్జెన్సీ ప‌రిస్థితుల్ని పాఠ్యాంశంగా చేర్చ‌టం త‌ప్పేం కాదు. కానీ.. అదే స‌మ‌యంలో ఏపీని రెండుగా చేస్తూ విభ‌జ‌న బిల్లును పార్ల‌మెంటులో పెట్టిన వైనాన్ని కూడా పాఠ్యాంశంగా పెడ‌త‌రా అన్న‌ది ప్ర‌శ్న‌. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా రాజ‌కీయ ప‌క్షాలు నిర్ణ‌యం తీసుకోవ‌టం ఒక ఎత్తు అయితే.. విభ‌జ‌న బిల్లును లోక్ స‌భ‌లో ఆమోదించేందుకు ఎంచుకున్న మార్గాన్ని ఎవ‌రూ మ‌ర్చిపోలేరు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. రాజ్య‌స‌భ‌లో విభ‌జ‌న బిల్లు ఆమోద స‌మ‌యంలో ఇదే వెంక‌య్య ఎలాంటి మాట‌లు చెప్పారో.. ఏపీకి ఎంత అండ‌గా ఉంటామ‌న్నారో అంద‌రికి తెలిసిందే. ప‌వ‌ర్ లేన‌ప్పుడు వెంక‌య్య ఇచ్చిన హామీల‌కు.. ఇప్పుడు చెబుతున్న మాట‌ల‌కు మ‌ధ్య వ్య‌త్యాసం ఎంత‌న్న‌ది తెలుగు ప్ర‌జ‌లంద‌రికి తెలుసు. మ‌రి.. విభ‌జ‌న బిల్లు ఆమోదం ఎపిసోడ్ మొత్తాన్ని కూడా పాఠ్యాంశంగా పెడ‌తామ‌ని ఇదే వెంక‌య్య చెప్ప‌గ‌ల‌రా? త‌ప్పులెన్ను వారు త‌మ త‌ప్పుల‌ను ఎరుగ‌ర‌న్న‌ది ఉత్తినే కాదేమో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/