Begin typing your search above and press return to search.

అమరావతినే కాదు విశాఖ బ్రాండ్ నాశనం అవుతోందా?

By:  Tupaki Desk   |   18 Oct 2022 5:25 AM GMT
అమరావతినే కాదు విశాఖ బ్రాండ్ నాశనం అవుతోందా?
X
జనసేన పార్టీ ప్రజావాణి అన్న ప్రోగ్రాం గురించి ప్రకటన చేసినంతనే.. అదే రోజున అధికార పార్టీ గర్జన పేరుతో ర్యాలీ ప్రోగ్రాంను అనౌన్స్ చేయటం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం చోటు చేసుకున్న పరిణామాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వారికే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా టీవీల్లోనూ.. వెబ్ ప్రపంచంలోనూ చూసేశారు. యూట్యూబ్ వీడియోలతో పాటు.. వాట్సాప్ గ్రూపుల్లో షేర్ అయిన వీడియోల్ని చూసి.. ఇదెక్కడి రాజ్యం? అన్నట్లుగా విస్మయానికి గురయ్యారు. ఏపీని ప్రేమించే ఆంధ్రాప్రాంతానికి చెందిన వారంతా తల పట్టుకుంటే.. తెలంగాణ మూలాలు ఉన్న వారు సైతం ఏపీలో జరుగుతున్న పరిణామాలకు ఒకింత వేదనకు గురి కావటం సరికొత్త పరిణామంగా చెప్పొచ్చు.

శనివారం నుంచి ఆదివారం వరకు విశాఖలో చోటు చేసుకున్న పరిణామాలు ఆ నగరానికి ఉండే ఇమేజ్ ను దెబ్బ తీసేలా మారిందన్న మాట వినిపిస్తోంది. విశాఖ అన్నంతనే రాజకీయాలకు దూరంగా ఉండటమే కాదు.. రాజకీయ రచ్చలకు అవకాశం లేకుండా అక్కడి నేతలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. జగన్ అండ్ కో పుణ్యమా అని ఇప్పుడు విశాఖలోనూ పరిస్థితులు మారిపోయాయి. తాజాగాచోటు చేసుకున్న పరిణామాలతో విశాఖ బ్రాండ్ కు ఎంత దెబ్బ తగిలిందన్న విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన కళ్లతో చూసిన దాన్ని.. తనకు ఎదురైన అనుభవాల్ని చెప్పుకొచ్చారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. పోలీసుల కారణంగా తాను ఇబ్బందులకు గురైనా.. వారి విషయంలో ఆయన పల్లెత్తు మాట అనలేదు సరికదా.. వారి విషయంలో తన స్టాండ్ ఏమిటన్న విషయాన్ని తనకు అవకాశం వచ్చిన ప్రతిసారీ స్పష్టం చేస్తుండటం గమనార్హం. ''నాకు పోలీసులంటే గౌరవం ఉంది. నేను ఆ కుటుంబం నుంచి వచ్చిన వాడినే. మేం పోలీసులతో యుద్ధం చేయడం లేదు. రాత్రి 12 నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకూ నోవాటెల్‌ హోటల్‌లో గందరగోళం సృష్టించారు'' అని చెప్పారు.

అంతేకాదు.. పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం కంటే కూడా ఆవేదన వ్యక్తం చేయటాన్ని మర్చిపోకూడదు. తనను సైతం ఒక ఐపీఎస్ అధికారి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని.. వారి ప్రయత్నం ఫలించకుండా ఉన్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో పోలీసుల తీరుతో.. తాజా రాజకీయ పరిణామాలతో విశాఖ బ్రాండ్ కు జరిగిన నష్టాన్ని పవన్ చెప్పారు. తాను బస చేసిన నొవాటెల్ హోటల్లో ఎంతోమంది విదేశీ పర్యాటకులు ఉన్నారని.. వారంతా భయాందోళనకు గురైనట్లు చెప్పారు.

'ఇలా అయితే పర్యాటక రంగం నాశనం కాదా?' అని ప్రశ్నించారు. తన సినిమా రిలీజ్ అయినప్పుడే టికెట్ల రేట్లు తగ్గుతాయని.. తాను పర్యటించే సమయంలోనే శాంతిభద్రతల సమస్య వస్తుందని.. తన పుట్టినరోజు వచ్చినప్పుడే పర్యావరణం మీద ప్రేమ పుట్టుకొస్తుందంటూ.. తనను జగన్ సర్కారు ఎంతలా టార్గెట్ చేస్తుందన్న విషయాన్ని చెప్పేశారు.

విశాఖ బ్రాండ్ కు జరిగే నష్టాన్ని పవన్ మాటల్లో విన్నప్పుడు.. నిజమే కదా? అనుకోకుండా ఉండలేని పరిస్థితి. రాజధాని ఏర్పాటు విషయంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఇప్పటికే అమరావతి బ్రాండ్ పూర్తిగా దెబ్బ తినగా.. మూడు రాజధానుల్లో భాగంగా పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖకు.. ఇటీవల కాలంలో రాజకీయ అధిక్యతను ప్రదర్శించేందుకు విశాఖను వేదికగా చేసుకుంటున్న తీరుతో.. ఆ నగరానికి ఉన్న బ్రాండ్ ఎంతలా డ్యామేజ్ అవుతుందన్న విషయం పవన్ మాటల్లో స్పష్టమైందన్న మాట వినిపిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.