Begin typing your search above and press return to search.

విపక్షం ఇమేజ్ డబుల్... ఇదేంది జగన్ సారూ...

By:  Tupaki Desk   |   4 Nov 2022 10:30 AM GMT
విపక్షం ఇమేజ్ డబుల్... ఇదేంది జగన్ సారూ...
X
ఏ రాజకీయ పార్టీ అయినా తాను హీరో కావాలని చూస్తుంది. వీలైనంతవరకూ విపక్షాన్ని వీక్ చేయాలని తాపత్రయపడుతుంది. రాజకీయాలలో ఈ తరహా వ్యూహాలనే ఎవరైనా అనుసరిస్తారు. అయితే ఇక్కడ సహజ సూత్రాలు వర్తించవు. గట్టిగా బంతిని నేలకేసి కొడితే కింద పడదు, అది పైకి చాలా బలంగా లేస్తుంది. రాజకీయాల్లో కూడా విపక్షం విషయంలో అదే సూత్రం వరిస్తుంది. అణచివేతలు ఎంతగా గురి చేస్తే వారు దిగ్గున లేచి నిలబడతారు. జగన్ విషయమే తీసుకుంటే కాంగ్రెస్ ఆనాడు ఆయన మీద అనేక కేసులు పెట్టి ఏకంగా పదహారు నెలల పాటు జైలులో ఉంచడం వల్లనే జగన్ హీరో అయ్యారు. ఆ మీదట ఆయన జోరు ఆపడం ఎవరి తరం అయింది కాదు.

మరి ఆ విధంగా తాను సూపర్ హీరో కావడానికి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ అనుసరించిన అణచివేత విధానాలు అని గ్రహించి కూడా జగన్ అదే పని చేస్తున్నారు అంటే దానికి రెండు కారణాలు చెప్పుకోవాలి. ఒకటి ఆయనకి ఈ విషయం తెలిసినా తాను చేయాలనుకున్నది మొండిగా చేసి ఆత్మ సంతృప్తిని పొందడం. రెండవది అయితే తనకు జరిగినట్లే వారికి జరగాలని ఆశించడం. దీని కోసం ఎంతటి రాజకీయ మూల్యం అయినా చెల్లించేందుకు సిద్ధపడడం.

ఇపుడు జగన్ చేస్తోంది ఆలోచిస్తే అలాగే అనిపిస్తోంది. ఈ మధ్యనే రీసెంట్ గా జరిగిన రెండు ఉదంతాలు తీసుకుంటే జగన్ తో పాటు వైసీపీ ప్రభుత్వం ఇమేజ్ ఒక్క దెబ్బకు ఢమాల్ అయితే అదే స్థాయిలో విపక్షం ఫుల్ స్ట్రాంగ్ అయింది అనే చెప్పాలి. ఏడు పదుల వయసుకు చేరువలో ఉన్న సీనియర్ మోస్ట్ వృద్ధ నాయకుడు విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు అయ్యన్నపాత్రుడు ఇపుడు హీరో అయ్యారు. ఆయన వృద్ధుడే కాదు, పైగా సుగర్ పేషంట్. అలాంటి అయ్యన్న ఇంటి తలుపులను అర్ధరాత్రి తట్టి ఆయన మీద వందల మంది పోలీసులను పంపించి కనీసం బట్టలు అయినా మార్చుకోనీయకుండా తీసుకువచ్చి పోలీసు జీపులో కుదేయడాన్ని ఏమంటారు.

ఒక వేళా ఆయన తప్పు చేస్తే దానికి శిక్ష పడవచ్చు. ఆ విధంగా పోలీసులు కేసులు పెట్టవచ్చు. కానీ దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ముందస్తు నోటీసులు ఇవ్వాలి. వారికి తమను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలుసుకునే వీలు ఉండాలి. అవతల వ్యక్తి అయ్యన్న సామాన్య నేత కాదుగా. ఆయన అనేక సార్లు మంత్రిగా పనిచేసిన వారు. పైగా ప్రభుత్వాన్ని నడిపిన వారు. అలాంటి పెద్ద మనిషి మీద సీఐడీ పోలీసులు వ్యవహరించిన తీరు. అందునా ఒక సివిల్ కేసుని పట్టుకుని అంత మంది దాడి చేసినట్లుగా వచ్చి అరెస్ట్ చేయడం చూస్తే ఎక్కడ లేని సానుభూతి అయ్యన్న పరం అయింది. అదే సమయంలో ఆయన మీద ఇంత దారుణంగా దాడి చేస్తారా అన్నది జనాల్లోకి పోయి సర్కార్ పరువు బదనాం అయింది.

ఇలాగే మరో విషయం తీసుకుంటే విశాఖకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చారు. ఆయన జనవాణి పేరిట పార్టీ కార్యక్రమం నిర్వహించుకోవాలనుకున్నారు. అలాంటి ఆయనను హోటల్ గది గోడల మధ్య రెండు రోజుల పాటు ఉంచాలనుకోవడం వల్ల సర్కార్ కి సాధించినది ఏమీ లేదు, పైగా పవన్ కి పొలిటికల్ గా ఎంతో ఇమేజ్ వచ్చేసింది. అసలే పవన్ నెలకు ఒకటి రెండు సార్లు కానీ ఏపీ టూర్లకు రారు, ఆయన సీజండ్ పొలిటీషియన్ అని విమర్శలు చేస్తారు. అలాంటి పవన్ కళ్యాణ్ కి రానున ఏణ్నర్ధం ముందు ఎన్నికలకు సరిపడా మైలేజ్ ని ఊరకే ఇచ్చేసిన పుణ్యం ఎవరిది అంటే కచ్చితంగా వైసీపీదే అని చెప్పకతప్పదు.

దీనికి ముందు తమ సొంత పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తన ఇంట్లో పుట్టిన రోజు జరుపుకుంటూంటే ఆయన్ని హైదరాబాద్ నుంచి గుంటూరు తీసుకువచ్చి ఒక రోజంతా రిమాండ్ లో పెట్టి పోలీసులు హింసించారు అన్న వార్త ఉంది. అందులో నిజానిజాలు పక్కన పెడితే రఘురామకు ఈ దెబ్బకు జాతీయ స్థాయిలో ఫుల్ అటెన్షన్ వచ్చేసింది. ఆయన ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. అలా ఒక సాధారణ ఎంపీగా ఉన్న రఘురామ రాజుకు హీరోను చేసినది ఎవరు అంటే మళ్లీ అన్ని వేళ్ళూ వైసీపీ వైపే చూపిస్తాయి.

ఇదే కాదు, టీడీపీలో ఒక మామూలు నేతగా ఉన్న పట్టాభి విషయంలో కూడా ఇదే తీరున పోలీసులతో అతి ఉత్సహాం చూపించారు. చివరికి ఆయన కూడా పాపులర్ అయితే సర్కార్ కి అది పెద్ద డ్యామేజి గా మిగిలింది. ఇలా చాలా ఉందంతాలు మూడున్నరేళ్ల వైసీపీ సర్కార్ ఏలుబడిలో కనిపిస్తాయి. దీంతో విపక్ష నేతలు కూడా తమ ప్రిపరేషన్ లో తాము ఉన్నారు ముందు అంతా రచ్చ చేసి ఆ మీదట వారి న్యాయ సహాయం పొందుతున్నారు. సర్కార్ ఆవేశం దూకుడు చివరికి అభాసుపాలు అవుతోంది. పైగా కోర్టు నుంచి మొట్టికాయలు తప్పడంలేదు. చూడబోతే వైసీపీ అధినేత జగన్ విపక్ష నేతలను హీరోలుగా చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారా అంటే నిజమేనేమో అనిపించకమానదు కదా.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.