Begin typing your search above and press return to search.

బాబు చేసిన త‌ప్పే.. వైసీపీ చేస్తోందా?

By:  Tupaki Desk   |   12 Sep 2021 6:31 AM GMT
బాబు చేసిన త‌ప్పే.. వైసీపీ చేస్తోందా?
X
అధికారంలో ఉన్న నాయ‌కులు ఎంతో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. ఏ విష‌యంలోనైనా స‌రే ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. త‌మ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు అవ‌స‌ర‌మైన అన్ని ప్ర‌య‌త్నాలు చేయాలి. ప‌ద‌వి చేజారే ప‌రిస్థితుల‌కు.. అధికారాన్ని ప్ర‌మాదంలో ప‌డేసే విష‌యాల‌కు దూరంగా ఉండాలి. కోరి కోరి స‌మ‌స్య‌ను నెత్తిమీద‌కు తెచ్చుకోకూడ‌దు. కానీ ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో లోకేశ్ వ్య‌వ‌హారంలో సీఎం జ‌గ‌న్ అనుస‌రిస్తున్న తీరు చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. గ‌తంలో అధికారంలో ఉన్న‌పుడు బాబు చేసిన త‌ప్పే.. ఇప్పుడు జ‌గ‌న్ చేస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అభ‌ద్ర‌తా భావం అనేది రాజ‌కీయ నాయ‌కుల‌కు ఎక్కువ‌గా ఉంటుంద‌నేది తెలిసిన విష‌య‌మే. అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌త్య‌ర్థికి మ‌రీ ఎక్కువ‌గా భ‌య‌ప‌డిపోయి లేనిపోని చ‌ర్య‌ల‌తో త‌ల‌మీద‌కు తెచ్చుకుంటార‌నే విష‌యం ఇప్ప‌టికే చాలా సార్లు రుజువైంది. 2014లో అధికారం ద‌క్కించుకుని సీఎం సీటుపై కూర్చున్న బాబు కూడా జ‌గ‌న్ విష‌యంలో అతిగా వ్య‌వ‌హ‌రించి చివ‌ర‌కు త‌న సీటుకే ఎస‌రు పెట్టేలా చేసుకున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి. అధికారం ఉంది క‌దా అనీ.. జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ల‌ను అడ్డుకున్న బాబు అరెస్టులు చేయించారు. ఎక్క‌డిక‌క్క‌డా జ‌గ‌న్‌ను క‌ట్ట‌డి చేయాల‌ని ప్ర‌య‌త్నించారు. అరెస్ట్ అయిన నాయ‌కులు హీరోలు అవుతార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెప్పిన‌ట్లు ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ సానుభూతి పొందిన జ‌గ‌న్ 2019 ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించారు. ముఖ్య‌మంత్రి ప‌ద‌విని అందుకున్నారు.

ఇప్పుడు మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేశ్ విష‌యంలోనూ జ‌గ‌న్ ఇదే వైఖ‌రి అనుస‌రిస్తున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతున్న దాఖ‌లాలు క‌నిపిస్తున్నాయి. తాజాగా న‌ర్సారావుపేట వెళ్ల‌కుండా లోకేశ్‌ను అడ్డుకుని జ‌గ‌న్ త‌ప్పు చేశార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 151 సీట్ల‌తో గెలిచి సీఎం పీఠంపై కూర్చున్న జ‌గ‌న్ ఎక్క‌డ‌.. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఏ ఎదురుదెబ్బలు తినని లోకేశ్ ఎక్క‌డ‌? రాజ‌కీయంగా ఇప్ప‌టికీ తండ్రి చాటు బిడ్డ‌గానే లోకేశ్ చ‌లామ‌ణీ అవుతున్నారన‌డంలో సందేహం లేద‌ని నిపుణులు చెప్తున్నారు. అలాంటిది లోకేశ్ ప‌ర్య‌ట‌న అన‌గానే వైసీపీ ఎందుకు ఇంత‌లా భ‌య‌ప‌డుతుందో ఆ పార్టీ నేత‌ల‌కే అర్థం కావ‌ట్లేదు.

రాజ‌కీయ నాయ‌కులు ఎవ‌రైనా స‌రే ప్ర‌చారం కోరుకుంటారు. ప్ర‌జ‌ల నోళ్ల‌లో త‌మ పేర్లు నానాల‌ని ఆరాట‌ప‌డుతుంటారు. ఇప్పుడు లోకేశ్ విష‌యంలో వైసీపీనే ఆ ప‌ని చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. అరెస్టుల ద్వారా లోకేశ్‌ను పాపుల‌ర్ చేస్తుంది అధికార వైసీపీనే అని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఆయ‌న న‌ర్సరావుపేట వ‌చ్చి బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శంచి వెళ్తే ఏ గొడ‌వ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆయ‌న్ని విమానాశ్ర‌యం ద‌గ్గ‌రే పోలీసులు అదుపులోకి తీసుకోవ‌డంతో దొరికిందే అవ‌కాశం అన్న‌ట్లు టీడీపీ శ్రేణులు రెచ్చిపోతున్నాయి. నిర‌స‌న‌ల‌నంటూ నానా యాగీ చేస్తున్నాయి. అదే లోకేశ్‌ను ప‌ట్టించుకోన‌ట్లు వ‌దిలేస్తే ఇంత గొడవ ఉండేదే కాద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అన‌వ‌స‌రంగా లోకేశ్‌కు మైలేజీ ఇచ్చార‌ని వైసీపీ నేత‌లే గుస‌గుస‌లాడుతున్నారు. గ‌తంలో అంటే యువ నాయ‌కుడిగా ఎదుగుతున్న జ‌గ‌న్‌కు క‌ళ్లెం వేయాల‌ని బాబు అలా చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు లోకేశ్ విష‌యంలో జ‌గ‌న్ మ‌రీ ఎక్కువ‌గా ఊహించి ఇలా చేయడం ఆయ‌న‌కే చేటు చేసేద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. మ‌రి జ‌గ‌న్ ఇప్ప‌టికైనా లోకేశ్ వ్య‌వహారంలో త‌న తీరు మార్చుకుంటారా? అన్న‌ది చూడాలి.