Begin typing your search above and press return to search.

ఎక్కడో డౌట్ : కొత్త పధకాలకు వైసీపీ రెడీ ...?

By:  Tupaki Desk   |   8 July 2022 10:21 AM GMT
ఎక్కడో డౌట్ : కొత్త పధకాలకు వైసీపీ రెడీ ...?
X
ఏపీలో ఎన్నికల మూడ్ వచ్చేసింది. అధికార వైసీపీ కూడా దూకుడు చేయడంతోనే అది తెలిసిపోతోంది. ప్రతిపక్షం ఎపుడూ ఎన్నికల గురించి కలవరిస్తుంది. కానీ అధికారంలో ఉన్న వారు ఎన్నికలు అన్న మాట రానీయరు. ఇక ఎన్నికలు అంటూ వస్తే తామే గెలిచి తీరాలని కూడా పట్టుదలగా చెబుతారు. ఇదిలా ఉంటే దేశంలో ఏ రాష్ట్రంలో ఎవరూ చేయని విధంగా తాము సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని, ఇంత భారీ సంఖ్యలో సంక్షేమ పధకాలు ఏ రాష్ట్రంలోనూ లేవని వైసీపీ వారే పదే పదే చెబుతూ వస్తున్నారు.

మరి ఈ పధకాల అమలుకే ఖజానా మొత్తం ఖర్చు అయిపోతోంది. అప్పులు చేసి మరీ పధకాలు అమలు చేస్తున్నారు. రానున్న రెండేళ్ళూ ఎలాగరా బాబూ అనుకునే సీన్ ఉంది. ఇక ఉన్న పధకాలకు కోత పెడుతున్నారు. లబ్దిదారులను ఏదో ఒక కారణం చెప్పి తగ్గిస్తున్నారు అన్న ప్రచారమూ ఉంది. ఇక పధకాలు అమలు చేస్తే జనాలు ఓటు వేస్తారా అభివృద్ధి వారికి అక్కరలేదా అనన్ చర్చ కూడా ఉంది.

అసలు పధకాలకు ఓట్లు ఎంతవరకూ రాలుతాయి అన్నది కూడా ఇంకా తేలని విషయం. పధకాలు అమలు చేయడమే విజయం అనుకున్నా అదే పాలనకు గీటురాయి అనుకున్నా చాలా సులువుగా ఎవరైనా అప్పులు చేసో మరోటి చేసో చేస్తారు. జనాల మద్దతు దండీగా చూరగొంటారు. మరి అదొక్కటే గెలుపునకు సరిపోదు అన్న విశ్లేషణలు ఉన్న నేపధ్యంలో వైసీపీ అభివృద్ధి మీద దృష్టి పెట్టింది అని ఒక వైపు అంటున్నారు. కీలకమైన రెండేళ్ళ కాలంలో ఎంతో కొంత అభివృద్ధి చూపించి జనాల వద్దకు వెళ్ళాలని వైసీపీకి సూచనలు వస్తున్న వేళ ఇపుడు ప్లీనరీలో కొత్త మాట వినిపిస్తోంది

అదేంటి అంటే మరిన్ని కొత్త పధకాలను జగన్ ప్లీనరీ వేదికగా ప్రకటిస్తారు అని అంటున్నారు. మరి ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా పధకాలు అమలవుతున్న వేళ వీటికి తోడుగా కొత్త పధకాలు ఎందుకు అన్న చర్చ వస్తోంది. అలా కనుక అయితే ఉన్న పధకాలనే సవ్యంగా కొనసాగించవచ్చు కదా అన్న మాట కూడా వినిపిస్తోంది. అయితే ఇంకా కొన్ని సంక్షేమ పధకాలను అమలు చేయడానికే వైసీపీ మొగ్గు చూపుతోంది అని అర్ధమవుతోంది.

అంటే వచ్చే ఎన్నికలను పూర్తిగా సంక్షేమం మీదనే ఆధారపడి నమ్ముకుని వైసీపీ ముందుకు అడుగులు వేస్తోంది అని అంటున్నారు. అభివృద్ధి అంటే అది చాలా సుదీర్ఘమైన వ్యవహారం. పైగా దాని ఫలాలు వచ్చేసరికి వచ్చే ఎన్నికలు పూర్తి అవుతాయి. కాబట్టి ఇంకా కొన్ని వర్గాలను టార్గెట్ చేసి పధకాలను ప్రకటించడం ద్వారా వచ్చే ఎన్నికలను ఎదుర్కోవాలని వైసీపీ చూస్తోంది అని అంటున్నారు. అయితే మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అన్నట్లుగా కొత్త్త పధకాలకు ఎన్ని ప్రకటించినా జనాలు మొగ్గు చూపుతారా మళ్ళీ వైసీపీని ఎన్నుకుంటారా అన్న చర్చ అయితే సీరియస్ గానే ఇంటా బయటా సాగుతోంది.

అదే టైమ్ లో ప్రస్తుతం కొనసాగిస్తున్న పధకాలకు ఓట్లు పూర్తిగా రాలవు అన్న సందేహం ఏదైనా వైసీపీకి ఉందా అన్న చర్చ కూడా ఉంది. అదే నిజమైతే కొత్త పరుగులు ఎన్ని పెట్టినా జనాలు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోవడం ఖాయమే కదా అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.