Begin typing your search above and press return to search.

ఒకే వేదిక‌పై జ‌గ‌న్‌, ప‌వ‌న్‌ ?

By:  Tupaki Desk   |   2 Jun 2017 6:08 PM GMT
ఒకే వేదిక‌పై జ‌గ‌న్‌, ప‌వ‌న్‌ ?
X
2019 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబును ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత జ‌గ‌న్‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ లు ఇద్ద‌రూ ఇంత‌వ‌ర‌కు ఒకే వేదిక‌పై ఎన్న‌డూ క‌నిపించ‌లేదు. కానీ... తొలిసారి ఆ ఇద్ద‌రూ ఒకే వేదిక‌పై క‌నిపించ‌బోతున్నారా... అది కూడా కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హిస్తున్న ఓ కార్య‌క్ర‌మంలో వారు ద‌ర్శ‌నమివ్వ‌బోతున్నారా.. అంటే అందుకు అవకాశం ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. అయితే.. దీనికి ముహూర్తం ఎంతో దూరంలో లేదు. మ‌రో రెండు రోజుల్లో జూన్ 4న ఈ ఇద్ద‌రూ క‌లిసే అవకాశం ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మెయిన్ ప్లేయ‌ర్లుగా భావిస్తున్న జగన్, పవన్ ల ఇంత‌వ‌ర‌కు క‌లిసి ప‌నిచేయలేదు స‌రికదా, క‌ల‌వ‌లేదు కూడా. ఈ నేప‌థ్యంలో ఒకే వేదిక పంచుకుంటే వీరు ఎలా వ్య‌వ‌హ‌రిస్తారు.. ఏమైనా రాజ‌కీయ చ‌ర్చ‌లుండొచ్చా అన్న‌ది స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌రంగా మారింది.

బీజేపీకి సాగిలప‌డిన ఏపీ సీఎం చంద్ర‌బాబు ప్ర‌త్యేక హోదాను మ‌ర్చిపోయిన సంగ‌తి తెలిసిందే. జ‌గ‌న్‌, ప‌వ‌న్ లు ఇద్ద‌రూ కూడా ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం ప‌ట్టుద‌ల‌గా ఉన్నారు. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ప్ర‌త్యేక హోదా కోసం నిత్యం ఏదో ఒక కార్య‌క్ర‌మం చేప‌డుతోంది. 4వ తేదీన కూడా ప్ర‌త్యేక హోదా భరోసా సభ పేరిట గుంటూరులో స‌భ నిర్వ‌హిస్తోంది. జ‌గ‌న్‌, ప‌వ‌న్ లిద్ద‌రూ కూడా ప్ర‌త్యేక హోదా కోసం కృషి చేస్తుండ‌డంతో వారినీ ఆహ్వానించింది. దీంతో ఆ రోజు ఈ ఇద్ద‌రూ క‌లిసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. వారిద్దరూ తప్పకుండా వస్తారని కాంగ్రెస్ చెప్తోంది.

అయితే... వీరిద్దరూ వస్తారా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. రాష్ర్టాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్... తనను కార్నర్ చేసిన కాంగ్రెస్ పిలిస్తే జగన్ వెళ్తారా అన్నదీ అనుమానమే. అదే సమయంలో పవన్ కూడా తన అన్న చిరంజీవి కొనసాగుతున్న పార్టీ అయిన కాంగ్రెస్ కు దూరంగానే ఉంటున్నారు. అలాంటప్పుడు ఆ పార్టీ నిర్వహిస్తున్న సభకు వెళ్లే అవకాశాలు తక్కువే అంటున్నారు. లేదంటే.... అన్ని వ‌ర్గాల్లో ఆద‌ర‌ణ ఉన్న జ‌గ‌న్‌, యూత్ లో ఆద‌ర‌ణ ఉన్న ప‌వ‌న్ క‌లిసి చంద్ర‌బాబును మ‌ట్టి కరిపించేందుకు ప్రత్యేక హోదా అంశానికే ప్రయారిటీ ఇచ్చి ఇక్కడకు వస్తారా అన్నదీ చూడాలి. నిజానికి ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వ‌స్తాన‌న్న ఆశ ప‌వ‌న్ కు కూడా లేదు. అలా అని టీడీపీతో క‌లిసే ప్ర‌శ్నే లేదు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ, బీజేపీల కోసం ప‌నిచేసిన ప‌వ‌న్ కొన్నాళ్లుగా ఆ పార్టీల‌కు దూరంగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ ఒంటరిగా పోటీ చేసి ఓట్ల‌ను చీల్చితే అది చంద్ర‌బాబుకు లాభించే ప్ర‌మాద‌మూ ఉంద‌న్న‌ది ఓ వాద‌న‌. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్‌, వ‌ప‌న్ లు క‌లిస్తే తిరుగుండ‌ద‌ర‌న్న ఫార్ములా ఒక‌టి వినిపిస్తోంది. మ‌రి దీనికి ఇద్ద‌రి వైపు నుంచి ఎలాంటి స్పంద‌న ఉంటుందో చూడాలి. ప్ర‌స్తుతానికైతే ఈ ఇద్ద‌రూ మాత్రం ఒకే వేదిక‌పై కలవడం ఖాయమని కాంగ్రెస్ చెప్తోంది.

ఇంకో విషయం ఏంటంటే ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న జగన్ షెడ్యూల్ ప్రకారం జూన్ 10న రాష్ర్టానికి రావాల్సిన ఉంది. మరి జూన్ 4న నిర్వహించే ఈ సభకు ఆయన వస్తారని కాంగ్రెస్ చెప్పడం ఎంతవరకు సాధ్యమో ఆలోచించుకోవాల్సిందే.