Begin typing your search above and press return to search.

కీల‌క‌మైన ఆ జిల్లాలో వైఎస్సార్సీపీ అభ్య‌ర్థుల‌ను మారుస్తోందా?

By:  Tupaki Desk   |   26 Aug 2022 1:30 AM GMT
కీల‌క‌మైన ఆ జిల్లాలో వైఎస్సార్సీపీ అభ్య‌ర్థుల‌ను మారుస్తోందా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అన్ని పార్టీల‌కు కీల‌క‌మైన జిల్లా.. గుంటూరు. ఈ జిల్లాలో ఏకంగా 17 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. తూర్పుగోదావ‌రి (19) త‌ర్వాత అత్య‌ధిక అసెంబ్లీ సీట్లు గుంటూరు జిల్లాలోనే ఉన్నాయి. అలాగే రాష్ట్రంలోనే అత్య‌ధికంగా తూర్పుగోదావ‌రితో స‌మానంగా మూడు పార్ల‌మెంట్ సీట్లు కూడా గుంటూరులోనే ఉన్నాయి.

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గుంటూరు జిల్లాలో రేప‌ల్లె, గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాలు మిన‌హాయించి మిగిలిన 15 చోట్ల వైఎస్సార్సీపీ విజ‌య ఢంకా మోగించింది. టీడీపీ కంచుకోట‌ల్లాంటి స్థానాల్లోనూ పాగా వేసింది. మూడు పార్లమెంటు సీట్ల‌లో న‌ర‌స‌రావుపేట‌, బాప‌ట్ల‌ను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. గుంటూరు పార్ల‌మెంటు సీటును త‌క్కువ మెజారిటీతో పోగొట్టుకుంది.

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఈ మ్యాజిక్‌ను రిపీట్ చేయాల‌ని వైఎస్సార్సీపీ కృత‌నిశ్చ‌యంతో ఉంది. ఈ క్ర‌మంలో కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను మార్చ‌డం, మ‌రికొన్నిచోట్ల గ‌ట్టి అభ్య‌ర్థుల‌ను పోటీలో నిల‌ప‌డం వంటివాటిపై దృష్టిసారించిందని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ క్ర‌మంలో ఇప్పటికే రాజ‌ధాని అమ‌రావ‌తి నెల‌కొని ఉన్న తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గానికి మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను అద‌న‌పు ఇంచార్జిగా నియమించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీదేవికి 2024లో పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవచ్చని చెబుతున్నారు. డొక్కా నియామ‌కం దీనికి స్పష్టమైన సూచనగా భావిస్తున్నారు. డొక్కా మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద్ ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్నారు. గ‌తంలో 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా తాడికొండ నుంచి ఆయ‌న గెలుపొందారు. ఈ నేప‌థ్యంలో తాడికొండ నుంచి డొక్కా మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద్ ను పోటీ చేయిస్తారని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇక వైఎస్సార్సీపీ మౌత్ పీస్‌గా ఉన్న నేత‌ల్లో మంత్రి అంబ‌టి రాంబాబు ఒక‌రు. జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రిగా ఉన్న అంబ‌టి రాంబాబు ప్ర‌స్తుతం గుంటూరు జిల్లా (ప్ర‌స్తుతం ప‌ల్నాడు జిల్లా) స‌త్తెన‌ప‌ల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి ఆయ‌న‌ను కృష్ణా జిల్లా అవ‌నిగ‌డ్డ నుంచి పోటీ చేయిస్తార‌ని స‌మాచారం. ఈ విష‌యంలో అంబ‌టి అసంతృప్తిగా ఉన్న‌ప్ప‌టికీ అవ‌నిగ‌డ్డ‌కు వెళ్ల‌క త‌ప్ప‌ద‌ని అంటున్నారు. గ‌తంలో అంటే 1989లో అంబ‌టి రాంబాబు గుంటూరు జిల్లా రేప‌ల్లె నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఇక‌ అదే విధంగా వైఎస్ జగన్ వీర‌ విధేయుడు, మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)ని సత్తెన‌ప‌ల్లి నుంచి పోటీ చేయిస్తార‌ని చెబుతున్నారు. ఆర్కే స్థానంలో మంగళగిరి నియోజకవర్గం నుంచి బీసీ అభ్య‌ర్థిని బ‌రిలోకి దించుతార‌ని అంటున్నారు. అందులోనూ చేనేత సామాజిక‌వ‌ర్గానికి చెందిన అభ్య‌ర్థే వ‌చ్చే ఎన్నిక‌ల్లో మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేస్తార‌ని టాక్ న‌డుస్తోంది.

ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌గిరి నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగ‌డానికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఆప్కో చైర్మ‌న్‌ చిల్లపల్లి మోహన్‌రావు, మాజీ మున్సిప‌ల్ చైర్మ‌న్‌ కాండ్రు కమల రేసులో ఉన్నారు. అలాగే ఇటీవలే టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి గంజి చిరంజీవి మంగళగిరి నుంచి పోటీ చేసేందుకు ఆ పార్టీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. పార్టీ టిక్కెట్ ఎవరికి దక్కుతుందనేది ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయంపై ఆధారపడి ఉంది.

స‌త్తెన‌ప‌ల్లి, మంగ‌ళ‌గిరి, తాడికొండ వంటి చోట్లే కాకుండా మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ రెండు మూడు చోట్ల మార్పులు చేర్పులు ఉంటాయ‌ని గాసిప్స్ వినిపిస్తున్నాయి.