Begin typing your search above and press return to search.

గౌతం రెడ్డి లేని లోటు వైసీపీ బాగా ఫీల్ అవుతోందా... ?

By:  Tupaki Desk   |   8 March 2022 7:58 AM GMT
గౌతం రెడ్డి లేని లోటు వైసీపీ బాగా ఫీల్ అవుతోందా... ?
X
ఆయన వివాద రహితుడు. చిత్త శుద్ధి కలిగిన నాయకుడు. తనకు అప్పచెప్పిన బాధ్యతలను పూర్తిగా నెరవేర్చేందుకు అహరహం కష్టించే తత్వం కలిగిన వారు. ఆయనే దివంగత వైసీపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి. ఆయన ఈ లోకం నుంచి వెళ్ళిపోయి పక్షం రోజులు పైగా గడచిపోయాయి. ఇక వర్తమాన రాజకీయాల్లో గౌతం లాంటి వారిని చూడలేమని చాలా మంది ఇప్పటికే చెప్పుకున్నారు. అయితే వైసీపీ నేతలు అసెంబ్లీ వేదికగా గౌతం రెడ్డి సంతాప తీర్మానం సందర్భంగా చెప్పిన విషయాలు చూసినపుడు వైసీపీకి ఒక నాయకునిగా, ప్రభుత్వానికి ఒక మినిస్టర్ గా ఆయన లేని లోటు ఎంతలా ఉందో అర్ధమవుతోంది.

గౌతం రెడ్డి చిన్నతనం నుంచి తనకు స్నేహితుడు అని ముఖ్యామంత్రి జగన్ చెప్పుకున్నారు. ఆయన పార్టీ కోసం పరితపించిన తీరుని కూడా సభ దృష్టికి తెచ్చారు. ఇక తనకు ఏది నచ్చుతుందో. తనకు ఎలా పని జరగాలో పూర్తిగా అవగాహన ఉన్న నాయకుడు గౌతం అంటూ జగన్ చెప్పడం బట్టి చూస్తూంటే జగన్ మనసెరిగి పనిచేసిన మంత్రిగా మేకపాటిని చూడాల్సి ఉంటుంది.

అదే విధంగా మరో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గౌతం రెడ్డి విదేశాలలో చదువుకున్నారని, మంచి పారిశ్రామికవేత్త అని,ఆయన అనుభవానికి తగినట్లుగా ముఖ్యమంత్రి జగన్ విశేష ప్రాధాన్యత కలిగిన శాఖలను ఇచ్చారని, వాటిని ఆయన కూడా సమర్ధంగా పనిచేస్తూ వన్నె తెచ్చారని చెప్పుకొచ్చారు.

ఇక్కడ బాలినేని అన్న మరో మాటను కూడా చూడాలి. మొత్తం 150 మంది ఎమ్మెల్యేలలలో గౌతం రెడ్డి శాఖలను నిర్వహించగల ఘనాపాటి ఎవరైనా ఉన్నారా అని వెతికి చూడాల్సి ఉంటుందని చెప్పడమే విశేషం. ఆ విధంగా ఎవరైనా ఉంటే కనుక ఆయనకు ఆయా శాఖలను అప్పగించాలి అని బాలినేని సూచించారు.

అంటే గౌతం రెడ్డి విజన్ కానీ,ఆయన డైనమిజం కానీ పారిశ్రామికవేత్తగా ఆయన చొరవ, ఆయనలోని చురుకుదనం కానీ బేరీజు వేసుకుంటే ఆయన మంత్రిత్వ శాఖలను రీప్లేస్ చేసే వారు వైసీపీలో ఎవరూ లేరు అనే బాలినేని చెప్పకనే చెప్పేశారు అనుకోవాలి. నిజానికి జనాంతికంగా కొన్ని మాటలు చెబుతూ ఉంటారు. ఫలనా వారు లేని లోటు తీరనిది అని. కానీ గౌతం రెడ్డి విషయంలో మాత్రం అది నిజమని వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు సభలో మాట్లాడిన తీరుని బట్టి అర్ధమవుతోంది.

ముఖ్యమంత్రి జగన్ సైతం తన భావాలను ఎక్కడా దాచుకోకుండా గౌతం రెడ్డి లాంటి వారు అరుదు అనడం బట్టి చూస్తే వైసీపీకి ఆ మంత్రి లేని లోటు చాలా ఎక్కువగానే ఉంది అనుకోవాలి. ఎవరో ఒకరిని తెచ్చి ఆ శాఖలను అప్పగించినా గౌతం రెడ్డి నెలకొల్పిన బెంచ్ మార్క్ ని అందుకోవడం కష్టమే అన్నది వైసీపీ ఇన్నర్ టాక్. మొత్తానికి ఒక ప్రభుత్వానికే అతి పెద్ద లోటుని మిగిల్చిన మంత్రిగా గౌతం రెడ్డి నిలిచిపోయారు అనే చెప్పాలి.