Begin typing your search above and press return to search.

ఇషాన్ ఇరగదీశాడు.. ముంబై చేతిలో ఢిల్లీ చిత్తు!

By:  Tupaki Desk   |   1 Nov 2020 6:30 AM GMT
ఇషాన్ ఇరగదీశాడు.. ముంబై చేతిలో ఢిల్లీ చిత్తు!
X
ముంబై మరోసారి మురిసింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ కి చేరిన తొలి జట్టుగా రికార్డ్ సృష్టించిన ముంబై మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని అగ్ర స్థానాన్ని పదిలం చేసుకుంది. మరో వైపు ఢిల్లీ మొదట్లో వరుస విజయాలతో ముందంతా ఆకట్టుకున్న జట్టు వరుసగా నాలుగు ఓటములతో ప్లే ఆఫ్స్ సంక్లిష్టం చేసుకుంది. ఐపీఎల్ 2020లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్​పై ముంబై ఇండియన్స్​ ఘన విజయం సాధించింది. మ్యాచ్​ ఆసాంతం ఏకపక్షంగా సాగింది. ముంబై ఇండియన్స్​ బౌలింగ్​ ధాటికి ఢిల్లీ క్యాపిటల్స్​ ఓపెనర్లు, మిడిల్​ ఆర్డర్​ కుప్పకూలిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ లో ముంబై మరోసారి తిరుగులేని ఆధిపత్యాన్ని చూపించింది. 9 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించి తిరుగులేని నంబర్ వన్ గా నిలిచింది.

ముంబై ఇండియన్స్ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా (3/17), ట్రెంట్ బౌల్ట్ (3/21) చెలరేగడంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు నష్టపోయి కేవలం 110 పరుగులు మాత్రమే చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్​లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(25), రిషభ్ పంత్ (21)‌ టాప్ స్కోరర్లుగా నిలిచారు. మిగతా బ్యాట్స్ మెన్ అంతా విఫలం అయ్యారు. సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. ధావన్ వరుసగా రెండో మ్యాచ్ లోనూ డకౌట్ అయ్యాడు.ఛేదనలో ముంబై బ్యాట్స్ మెన్ ఇషాన్ కిషన్(47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 72 నాటౌట్) ఇస్మార్ట్ ఇన్నింగ్స్‌తో ముంబై అలవోక విజయాన్నందుకుంది.అనంతరం ముంబై ఇండియన్స్ 14.2 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 111 పరుగులు చేసి సునాయంగా గెలుపొందింది. ఇషాన్‌కు తోడుగా డికాక్(26), సూర్యకుమార్ యాదవ్ (12 నాటౌట్) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో నోర్జ్‌కు ఒక వికెట్ దక్కింది.

ఢిల్లీ ప్లే ఆఫ్స్ సంక్లిష్టం

పేలవ ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్‌ మరింత పాయింట్ల పట్టికలో మరింత దిగజారింది. బ్యాటింగ్‌ వైఫల్యంతో వరుసగా నాలుగో మ్యాచ్‌లో ఓడిన ఆ టీమ్‌ రన్‌రేట్‌ కూడా మైనస్‌లోకి పడిపోయింది. ముందంజ వేసే అవకాశాలు ఇంకా ఉన్నా... పరిస్థితిని మాత్రం క్లిష్టంగా మార్చుకుంది. తదుపరి మ్యాచ్ లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి తెచ్చుకుంది.

ముంబై అత్యధిక మ్యాచ్ ల రికార్డు

ముంబై ఇండియన్స్ జట్టు అరుదైన ఘనతను సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడ్డ మ్యాచ్ ద్వారా అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. అత్యధిక టీ20లు ఆడిన ప్రపంచ రికార్డును తన పేరిట ముంబై జట్టు లిఖించుకుంది. ఇంగ్లీష్ కౌంటీ జట్టు సోమర్‌సెట్ 221 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా ముంబై జట్టు 222వ మ్యాచ్‌ను ఆడి సోమర్‌సెట్ రికార్డ్ ను అధిగమించింది. ఢిల్లీ జట్టుపై విజయం సాధించి ఐపీఎల్ పాయింట్ల పట్టికలో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.