Begin typing your search above and press return to search.

అఫ్గానిస్థాన్‌ లో ఐసిస్ దుశ్చర్య.. 100 మంది మృతి

By:  Tupaki Desk   |   9 Oct 2021 8:16 AM GMT
అఫ్గానిస్థాన్‌ లో ఐసిస్ దుశ్చర్య.. 100 మంది మృతి
X
తాలిబన్ల పాలనలో కునారిల్లుతున్న అఫ్గానిస్థాన్‌ లో ఉగ్రవాదులు శుక్రవారం మరో దారుణానికి తెగబడ్డారు. కుందుజ్‌లోని గొజరే సయ్యద్‌ అబద్‌ మసీదు వద్ద షియాలే లక్ష్యంగా ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, మరో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు. శుక్రవారం మధ్యాహ్న సమయంలో మసీదులో అధిక సంఖ్యలో షియాలు ప్రార్థనలు జరుపుతున్న సమయంలో శక్తిమంతమైన పేలుడు సంభవించింది.

పేలుడు తీవ్రతకు పదుల సంఖ్యలో ప్రజలు గాల్లో ఎగురుతూ దూరంగా పడ్డారు. మసీదు ప్రాంగణంలో ఎటుచూసినా రక్తపు మరకలే కనిపిస్తున్నాయి. క్షతగాత్రుల హాహాకారాలతో ఆ ప్రాంతమంతా హృదయవిదారకంగా మారింది. అప్పటివరకు తమతో పాటు ప్రార్థనలు చేసిన చాలామంది విగతజీవులుగా పడి ఉండటాన్ని చూసి అక్కడివారు తట్టుకోలేకపోయారు. ఆత్మాహుతి ఘటన జరిగిన సమయంలో మసీదులో భారీ సంఖ్యలో ప్రజలు ఉన్నట్లు కుందుజ్‌ ప్రావిన్స్‌ పోలీసు అధికారి దోస్త్‌ మహమ్మద్‌ ఒబైదా తెలిపారు. షియాల భద్రతకు తాలిబన్లు చర్యలు తీసుకుంటున్నారని, ఇది కచ్చితంగా ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడేనని అధికారులు స్పష్టం చేశారు.

ఈ ఆత్మాహుది దాడి తమ పనేనని ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూప్‌ ప్రకటించింది. తాలిబన్లకు బద్ధశత్రువుగా మారిన ఈ ఉగ్రవాద సంస్థ అఫ్గాన్‌లో షియా ముస్లిం మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటూ ఇప్పటికే అనేకసార్లు దాడులు చేసింది. అఫ్గాన్‌లో మైనారిటీలుగా ఉంటూ నిత్యం వివక్షకు గురవుతున్న హజారాలు లక్ష్యంగానే తాజాగా దుశ్చర్యకు పాల్పడింది. కుందుజ్‌లో ఉగ్రదాడిని అఫ్గానిస్థాన్‌లోని ఐక్యరాజ్య సమితి మిషన్‌ తీవ్రంగా ఖండించింది. కుందుజ్‌ ప్రావిన్స్‌ జనాభాలో హజారాలు 6% వరకు ఉన్నారు. ఉగ్రవాదులుగా మార్చేందుకు ఇస్లామిక్‌ స్టేట్‌ ముఠా వీరినే ఎంచుకుంటోంది. ఐఎస్ మతపరమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడటం వారంలో ఇది మూడోసారి కావడం గమనార్హం.