Begin typing your search above and press return to search.

ఐసిస్ సంచ‌ల‌నం!..భార‌త్ లో ఉగ్ర ప్రావిన్స్ అంట‌!

By:  Tupaki Desk   |   11 May 2019 5:27 PM GMT
ఐసిస్ సంచ‌ల‌నం!..భార‌త్ లో ఉగ్ర ప్రావిన్స్ అంట‌!
X
ఐసిస్‌... ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియాగా నామ‌క‌ర‌ణం చేసుకున్న ఉగ్ర మూక‌. ఓ నాలుగైదేళ్ల క్రితం దాకా ఈ మూక సాగించిన దారుణ మార‌ణ కాండ‌తో యావ‌త్తు ప్ర‌పంచం వ‌ణికిపోయింది. అయితే ఇరాక్ కేంద్రంగా అమెరికా బ‌ల‌గాల సాయంతో ఇరాక్ సేన‌లు సాగించిన భీక‌ర పోరులో ఆ సంస్థ నామ‌రూపాల్లేకుండానే పోయింది. అయితే మొన్న శ్రీ‌లంక‌లో జ‌రిగిన ఉగ్ర‌వాద దాడి త‌మ ప‌నేన‌ని ప్ర‌క‌టించుకున్న ఐసిస్‌... త‌మ మూలాలు పూర్తిగా క‌నుమ‌రుగు కాలేద‌నే చెప్పింది.

ఈ వార్త‌ల్లో వాస్త‌వ‌మెంత అన్న విష‌యాన్ని తేల్చుకునే ప‌నిలో ప్ర‌పంచ దేశాలు నిమ‌గ్న‌మై ఉండ‌గా... ఐసిస్ మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌ను చేసింది. ఉగ్ర‌వాదం పై రాజీ లేని పోరు సాగిస్తున్న భార‌త్ గ‌డ్డ మీద తాము ఏకంగా ఓ రాష్ట్రాన్నే త‌యారు చేశామ‌ని ఆ సంస్థ చేసిన ప్ర‌క‌ట‌న ఇప్పుడు పెను సంచ‌ల‌నంగా మారిపోయింది. ఆ రాష్ట్రానికి ‘హిందూ విలయం’గా నామకరణం చేసినట్టు కూడా ఐసిస్‌ పేర్కొంది. ఈ మేరకు ఆ ఉగ్రవాద సంస్థకు చెందిన అమాఖ్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. కశ్మీర్‌ లో ఉగ్రవాదులతో శుక్రవారం జరిగిన ఎన్‌ కౌంటర్‌ లో ఇష్ఫాక్ అహ్మద్ సోఫి ఉగ్రవాది హతమైన తర్వాత ఐసిస్ ఈ ప్రకటన చేసింది. షోపియాన్ జిల్లాలోని అమిషిపొరాలో తాము జరిపిన దాడిలో భారత ఆర్మీకి బాగానే ప్రాణ నష్టం జరిగిందని కూడా త‌న ఉనికిని చాటుకునే య‌త్నం చేసింది.

ఎన్‌ కౌంటర్‌ లో మృతి చెందిన సోఫి విష‌యానికి వ‌స్తే... కశ్మీర్‌ లోని పలు ఉగ్రవాద గ్రూపుల్లో దశాబ్దకాలంగా అత‌డు యాక్టివ్‌గా ఉన్నాడు. శ్రీనగర్‌ కేంద్రంగా నడిచే ఓ మేగజైన్‌ కు సోఫి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఐసిస్ సానుభూతిపరుడినని పేర్కొన్నట్టు మిలిటరీ అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రాంతంలో భద్రతా దళాలపై జరిగిన పలు గ్రనేడ్ దాడుల్లో అత‌డు పాల్గొన్నట్టు మిలిట‌రీ ఆఫీస‌ర్‌ పేర్కొన్నారు. శుక్రవారం నాటి ఎన్‌ కౌంటర్‌ లో తమవైపు నుంచి ఎటువంటి నష్టం జరగలేదని స్పష్టం చేశారు. కశ్మీర్‌ లో మిగిలి ఉన్న ఐసిస్ సానుభూతి పరుడు అతడొక్కడేనని - తాజా ఎన్‌ కౌంటర్‌ లో అతడు కూడా హతమయ్యాడని తెలిపారు. వాస్త‌వం ఇలా ఉంటే... తాము జ‌రిపిన దాడుల్లో భ‌ద్ర‌తా ద‌ళాల‌కూ భారీ న‌ష్ట‌మే జ‌రిగిందంటూ ఐసిస్ చేసిన ప్ర‌క‌ట‌న‌పై అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఐసిస్ ప్రావిన్స్ ఏర్పాటు ప్రకటనను ఎస్ఐ‌టీఈ ఇంటెలిజెన్స్ గ్రూప్ డైరెక్టర్ రీటా కొట్టిపారేశారు. అసలు దాని ఉనికే లేని ప్రాంతంలో ఓ ‘ప్రావిన్స్‌’ను ఏర్పాటు చేసినట్టు చెప్పడం పూర్తిగా అసంబద్ధమని రీటా పేర్కొన్నారు.