Begin typing your search above and press return to search.

పారిస్ లో ఉగ్రదాడి..ఐసిస్ షాకింగ్ స్టేట్‌ మెంట్‌

By:  Tupaki Desk   |   15 July 2016 10:17 AM GMT
పారిస్ లో ఉగ్రదాడి..ఐసిస్ షాకింగ్ స్టేట్‌ మెంట్‌
X
రాక్ష‌స చ‌ర్య‌ల‌తో ఫ్రాన్స్ మరోసారి భీతిల్లింది. నీస్ నగరంలో జరుగుతున్న బాస్టిల్ డే సంబరాలు విషాధంగా మారాయి. ఓ ట్రక్కు సృష్టించిన భీభత్సంలో 84 మంది మృతి చెందారు. వంద మందికి పైగా గాయపడ్డారు. సుమారు 50 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆనందంగా సంబరాల్లో మునిగి తేలుతున్న జనంపైకి ఒక్కసారిగా ట్రక్కు దూసుకొచ్చింది. కళ్లు మూసి తెరిచేలోపు పదుల సంఖ్యలో ట్రక్కు చక్రాల కింద నలిగి పోయారు. సంఘటనా స్థలం క్షణాల్లో భీతావహంగా మారింది. మృత్యు శకటంలా ట్రక్కు దూసుకు పోతుంటే జనం భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనను ఉగ్ర చర్యగా పోలీసులు అనుమానిస్తున్నారు.

ట్రక్కుతో బీభ‌త్సం సృష్టించిన డ్రైవ‌ర్‌ ను పోలీసులు కాల్చి చంపినట్లు సమాచారం. అతను ఎవరనేది ఇంకా పోలీసులు గుర్తించ‌లేదు. ఆ డ్రైవ‌ర్ ఐడెంటీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. జాతీయ దినోత్స‌వ వేడుక‌ల్లో తెలుపు రంగు ట్ర‌క్కుతో దాడి చేసిన డ్రైవ‌ర్‌ కు 31 ఏళ్లు ఉంటాయ‌ని స్థానిక పోలీసులు అంటున్నారు. అత‌ను టునీషియాకు చెంది ఉంటాడ‌ని భావిస్తున్నారు. గుర్తు తెలియ‌న డ్రైవ‌ర్ ట్ర‌క్కుతో దాడి చేసిన ఘ‌ట‌న‌లో 84 మంది మృతి చెందారు. మ‌రో వంద మందికిపైగా గాయ‌ప‌డ్డారు.

ఇదిలాఉండ‌గా దీని వెనుక ఐసిస్ ఉంద‌నే అనుమానాలు వ్య‌క్తం అవుతుండ‌గానే ఆ రాక్ష‌స మూక స్పందించింది. భ‌ద్ర‌తా చ‌ర్య‌ల్లో భాగంగా ఈపిల్ ట‌వ‌ర్ వ‌ద్ద ర‌క్ష‌ణ ఏర్పాట్లు చేసిన నేప‌థ్యంలో ''మా భ‌యంతో అలాగే కాపాలా ఉండటం అలవాటు చేసుకోండి. మేం ప్ర‌శాంతంగా ఉండే వ‌ర‌కు మీరు అభ‌ద్ర‌త‌లోనే ఉండాలి" అంటూ ఐసిస్ పేరుతో ప్రకటన వెలువడింది. దీంతో ఐసిస్ పాత్ర‌పై సందేహాలు నిజ‌మ‌య్యాయని అంటున్నారు.