Begin typing your search above and press return to search.

ఆడోళ్లు ఐసిస్ రాక్షసుల పాలిట పడితే..

By:  Tupaki Desk   |   13 Oct 2016 5:20 AM GMT
ఆడోళ్లు ఐసిస్ రాక్షసుల పాలిట పడితే..
X
నరరూప రాక్షసులకు నిలువెత్తు రూపంగా కనిపిస్తారు ఐసిస్ ఉగ్రవాదులు. కనికరం అన్నది లేకుండా వ్యవహరించే ఈ దుర్మార్గులు.. ఆడోళ్ల పట్ల ఎంత ఆరాచకంగా వ్యవహరిస్తారో తెలిసిందే. అయితే.. వారి బారిన పడి అదృష్టవశాత్తు బయట పడిన వారు చెప్పే మాటలు వింటే గగుర్పాటుకు గురి కావాల్సిందే. ఇలాంటి వారిని ముక్కలు.. ముక్కలు చేయాలనిపించక మానదు. తాజాగా ఇద్దరు మహిళలు ఐసిస్ ఉగ్రవాదుల చెర నుంచి బయటపడ్డారు. ఐసిస్ రాక్షసుల దురాగతాలు ఎంత దారుణంగా ఉంటాయో వారు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం స్వచ్ఛంద సంస్థల నీడన కొత్త జీవితాన్ని మొదలెట్టిన వారు.. తాము చూసిన నరకాన్ని చెబుతుంటే..వారి మాటలకు ప్రపంచం కదిలిపోతోంది.

‘‘నా పేరు ఫరీదా. మాది ఇరాక్ లోని సింజర్. ఇక్కడ యాజిదీలు ఎక్కువగా ఉంటారు. 2014లో ఉగ్రవాదుల కన్ను మా ప్రాంతం మీద పడింది. వేలాది మంది అమ్మాయిల్ని.. మహిళల్ని బలవంతంగా ఎత్తుకెళ్లారు. నా జీవితంలో జరగకూడని దురదృష్టకర సంఘటన ఒకటి చోటు చేసుకుంది. నా పెళ్లి నిశ్చయమైంది. కొత్త జీవితం మీద బోలెడన్నిఆశలు. ఇంట్లో వాళ్లంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దాదాపు రెండువేల మంది అతిధులు హాజరయ్యారు. ఇంతలో పెళ్లి వేడుక మీద ఉగ్రవాదులు దాడి చేశారు. కళ్ల ముందే నా ఐదుగురు అన్నదమ్ముల్ని చంపేశారు. నాతో పాటు చాలామంది అమ్మాయిల్ని ఎత్తుకెళ్లారు. నా భర్తను మాత్రం వదిలేశారు’’

‘‘నాతో పాటు నా చెల్లెల్ని ఉగ్రవాదులు ఎత్తుకొచ్చారు. తనకు 16 ఏళ్లు. ఆమెను ఏడుగురు ఉగ్రవాదులు పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికీ ఆమె సిరియాలోనే ఉంది. ఒక్కడు నలుగురు మహిళల్ని వరుసగా అత్యాచారం చేయటం చూశాను. తల్లి దగ్గర పాలు తాగుతున్న పిల్లాడ్ని పక్కకు లాగేసి మరీ దుర్మార్గంగా వ్యవహరించటం చూశాను. ఉగ్రవాదుల్లో ఒకడు నన్ను చూసి ఇష్టపడ్డాడు. మరొకడు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అలా నన్ను ఒకడు పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఐదుగురికి అమ్మేశాడు. నరకం అంటే ఏమిటో చూపించారు. అదృష్టవశాత్తు ఆ రాక్షసుల బారి నుంచి తప్పించుకున్నా’’ అంటూ తాను పడిన కష్టాల్ని ఏకరువు పెట్టింది.

ఫరీదా మాదిరే లీయిలా అనే మహిళా దురదృష్టవంతురాలే. ఐసిస్ ఉగ్రవాదుల చేతికి చిక్కిన ఆమెను ఎంతగానో హింసిందారు. చిత్రహింసలకు గురి చేశారు. ఆమె పడిన బాధల్ని ఆమె మాటల్లోనే వింటే.. ‘‘ఐసిస్ రాక్షసులు నన్ను బలవంతంగా ఎత్తుకెళ్లారు. తర్వాత మత మార్పిడి కోసం బలవంతం చేశారు. ఒప్పుకోనందుకు చిత్రహింసలకు గురి చేశారు. నా మనసు నన్ను యాజిదీగా ఉండమని చెబుతోంది. కాదన్నందుకు దారుణంగా హింసించటమే కాదు.. పలుమార్లు అత్యాచారాలు చేశారు. కానీ.. నా మనసు మాత్రం మారలేదు. కష్టాలు పడినా.. హింసకు గురైనా నేను మతం మారేందుకు ఇష్టపడలేదు.అదృష్టం బాగుండి వారి చెర నుంచి బయటపడ్డాను’’ అని చెప్పుకొచ్చింది. ఈ మాటలన్నీ విన్నప్పుడు ఐసిస్ రాక్షసత్వం కళ్లకు కట్టినట్లుగా కనిపించక మానదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/