Begin typing your search above and press return to search.
ఐఎస్ ఉగ్రవాది పట్టుబడితే ఏం చేస్తాడంటే..?
By: Tupaki Desk | 29 Nov 2015 4:19 AM GMTనాగరిక ప్రపంచంలో అనాగరికంగా వ్యవహరిస్తూ.. రాక్షసత్వానికి ప్రతీకగా నిలిచే ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల దురాగతాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో శాంతి అన్నది లేకుండా.. రక్తపాతం సృష్టించాలని.. నరమేధాన్ని జరపాలన్న దుర్మార్గ ఆలోచనలతో ఉన్న ఐఎస్ తీవ్రవాదులు.. తమ చేతికి చిక్కిన బంధీలను ఎంత దారుణంగా హింసిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
తాము బంధించిన బంధీలకు బతికి ఉండగానే నరకం అంటే ఏమిటో చూపించే వారి అనాగరిక చర్యలకు అంతా హడలిపోతుంటారు. మరి..ఈ రాక్షసులు కానీ భద్రతా దళాలకు చిక్కితే ఏం చేస్తారు? ఎలా వ్యవహరిస్తారు? అన్న ప్రశ్నలు వస్తుంటాయి. దీనికి సమాధానం తాజాగా దొరికింది. ఇరాక్ లో తమ పట్టును రోజురోజుకు పెంచుకుంటున్న ఐఎస్ తీవ్రవాదుల్ని ఏరేయటానికి కుర్దు బలగాలు అవిశ్రాంతంగా పోరాడుతున్న సంగతి తెలిసిందే.
ఐఎస్ తీవ్రవాదుల్ని ఏరేసే క్రమంలో ఈ మధ్యనే ఒక రాక్షసుడ్ని బంధించారు. సివిల్ డ్రెస్ లో ఉన్న ఇతగాడ్ని పట్టుకున్న వెంటనే చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడంట. తాను అమాయకుడ్ని అని.. తనకే పాపం తెలీదంటూ భోరుమన్నాడట. తనకు ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థకు సంబంధం లేదని చెప్పుకున్న ఇతగాడు.. మాయ మాటలతో తప్పించుకునే ప్రయత్నం చేశాడట.
పక్కా సమాచారంతో బంధించిన ఇతగాడి నాటకాల్ని చూసిన కుర్దు దళాలు అలెర్ట్ అయి.. అతగాడి కళ్లకు గంతలు కట్టేసి.. చేతులు వెనక్కి కట్టేసి విచారణ కోసం తరలించారు. భద్రతా దళాలకు పట్టుబడిన వెంటనే.. ఇతగాడి ‘యాక్షన్’ చూసిన కుర్దు దళాలు కాసేపు కన్ ఫ్యూజ్ అయ్యాయంట. ఆ రేంజ్ లో అతగాడి ‘నటన’ ఉందట.