Begin typing your search above and press return to search.

తిరుమల కొండపై ఐఎస్ఐఎస్ జెండా?

By:  Tupaki Desk   |   16 May 2016 12:19 PM GMT
తిరుమల కొండపై ఐఎస్ఐఎస్ జెండా?
X
హిందువుల పుణ్య క్షేత్రంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమలలో కలకలం రేగింది. ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ జెండా తిరుమలలో కనిపించడం సంచలనంగా మారింది. తిరుమలలోని జాపాలీ తీర్థానికి వెళ్లే రహదారిలో ఓ వర్గం వారికి చెందిన జెండాలతో పాటు ఐఎస్ఐఎస్ జెండా కనిపించడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. విషయం తెలుసుకున్న టీటీడీ విజిలెన్సు సిబ్బంది ఆ జెండాలను తొలగించినట్టు తెలుస్తోంది. ఈ జెండాలు తిరుమలకు ఎలా వచ్చాయి... దీని వెనుక ఎవరున్నారన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.

పాపనాశనం వెళ్లే మార్గంలో ఉన్న జపాలి తీర్థంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ జెండాను వదిలి వెళ్లినట్టు తెలుస్తోంది. నెలవంక - నక్షత్రం గుర్తుతో తెలుపు రంగులో ఉన్న జెండాను సోమవారం ఉదయం జపాలి తీర్థం వద్ద భక్తులు గమనించి ఆ విషయాన్ని భక్తులు టీటీడీ విజిలెన్సు అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే.. ఇది ఐఎస్ ఐఎస్ జెండా కాదని.. పాకిస్థాన్ జెండా అని తెలుస్తోంది. అయినప్పటికీ కూడా శత్రు దేశ జెండా నిత్యం లక్షలాది మంది భక్తులు తిరిగే క్షేత్రంలో కనిపించడంతో ఆందోళన చెందుతున్నారు.

కాగా చిత్తూరు జిల్లాలో ఇంతకుముందు పలుమార్లు ఉగ్రవాదుల ఉనికి బయటపడడం.. తిరుమలకు ఉగ్ర ముప్పు ఉండడంతో మళ్లీ జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చిందన్న వాదన వినిపిస్తోంది. దాంతోపాటు గతంలో తిరుమల కొండపై అన్యమత ప్రచార సామగ్రి దొరికిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఏకంగా విదేశీ జెండాలు, ఉగ్రవాద జెండాలు కనిపించడంతో ఇందులో కుట్ర కోణం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిఘా వర్గాలు అప్రమత్తమై దర్యాప్తు మొదలుపెట్టారు.