Begin typing your search above and press return to search.

నరరూప రాక్షసుడి నోటి నుంచి ఓటమి మాట

By:  Tupaki Desk   |   2 March 2017 7:09 AM GMT
నరరూప రాక్షసుడి నోటి నుంచి ఓటమి మాట
X
ప్రపంచమంతా ఇస్లామిక్ రాజ్యం స్థాపించాలన్న కసితో నరరూప రాక్షసుడిలా వ్యవహరించిన ఐఎస్ ఐఎస్ చీఫ్ అబూ బకర్ అల్ బగ్దాదీ చివరకు ఓటమి అంగీకరించాడు. ఇరాక్ లో ఐఎస్ ఐఎస్ ఓడిపోయిందని ఆయన ఒప్పుకొన్నాడు. అరబ్బులు కాని పోరాట యోధులంతా తమ తమ దేశాలకు వెళ్లిపోవాలని కోరాడు. అలా చేయడం ఇష్టం లేకుంటే ఆత్మాహుతి దాడి చేసి తమను తాము పేల్చుకోవాలంటూ ఒక వీడియో ప్రసంగాన్ని రిలీజ్ చేశాడు.

'వీడ్కోలు ప్రసంగం' పేరిట ఈ ప్రకటన విడుదల చేశారు. కాగా, ఐఎస్ కు ప్రధాన కేంద్రమైన మోసుల్ నగరాన్ని ఇరాక్ సైన్యం పూర్తిగా ఆక్రమించడంతో ఉగ్రవాదులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తోంది. ఈ వీడియో సందేశంలో ఐఎస్ఐఎస్ స్టేట్ కార్యాలయాన్ని మూసేయాలని ఆయన తెలిపారు. ఆత్మాహుతి దాడి చేసుకున్నవారు స్వర్గానికి వెళతారని, అక్కడ వారి కోసం 72 మంది యువతులు ఎదురు చూస్తుంటారని కూడా చెప్పాడు.

మరోవైపు అల్ బగ్దాదీని పట్టుకుంటే రూ. 66 కోట్ల నగదు బహుమతిని పలు దేశాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. 2014 ఆరంభంలో తూర్పు సిరియా, ఉత్తర ఇరాక్ పరిధిలోని చాలా ప్రాంతాలను ఉగ్రవాదులు ఆక్రమించగా, ఆ తరువాత ఇరాక్ సైన్యం ఒక్కో ప్రాంతాన్నీ తిరిగి తన అధీనంలోకి తెచ్చుకుంది. మోసుల్ నగరం ఐఎస్ చేతి నుంచి జారిపోవడంతో ఆ ఉగ్రవాద సంస్థ పూర్తిగా పట్టు కోల్పోయినట్లే చెప్పాలి. అయితే.. భావజాలం తీవ్రమైనది కావడం.. అల్ బగ్దాదీ సహా పలువురు నేతలు ఇంకా సజీవంగా ఉండడంతో ఐఎస్ మళ్లీ ఏదో ఒకరూపంలో తిరిగి లేవడం ఖాయమంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/