Begin typing your search above and press return to search.

ఐఎస్ రాక్షస రాజు అంతమయ్యాడు

By:  Tupaki Desk   |   14 Jun 2016 11:31 AM GMT
ఐఎస్ రాక్షస రాజు అంతమయ్యాడు
X
కొద్ది సంవత్సరాలు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఇస్తామిక్ స్టేట్ ఆఫ్ సిరియా అండ్ ఇరాక్(ఐఎస్ ఐఎస్) అరాచకలు అన్నీ ఇన్నీ కావు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఉగ్రదాడులు జరుపుతూ అమాయకుల ప్రాణాలను తీస్తుండడమే కాకుండా తమ ఆధీనంలో ఉన్న ప్రాంతంలో మానవ జాతి భయభ్రాంతులకు గురయ్యేలా మారణహోమం సృష్టిస్తోంది. ఊచకోతలు.. తలలు నరికేసి ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేసి జనాలను భయపెట్టడమే కాదు. సెక్సు బానిసత్వానికి అంగీకరించని ఆడవాళ్లను కూడా కాల్చిపడేస్తున్న ఐఎస్ ఉగ్రవాదుల పేరు వింటేనే జనం జడుసుకుంటున్నారు. పారిస్ ఉగ్రవాద దాడితో ప్రపంచాన్ని వణికించిన ఐఎస్ రీసెంటుగా అమెరికాలో కాల్పుల్లో 50 మందిని హతమార్చినవాడు కూడా ఐఎస్ ఉగ్రవాదేనని ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాంటి రాక్షస మూకకు నాయకత్వం వహిస్తున్న నరరూప రాక్షసుడు అబూబకర్ అల్ బాగ్దాదీ.. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా అధినేతగా ప్రపంచ దేశాలకు సవాల్ విసిరాడు. తాజాగా అమెరికా నేతృత్వంలో జరిగిన వైమానిక దాడులలో బాగ్దాదీ హతమైనట్లు తెలుస్తోంది.

బాగ్దాదీ మృతి వార్తను ఐఎస్ ఐఎస్ అనుబంధ అరబిక్ వార్తా సంస్థ అల్ అమాక్ ప్రకటించింది. అమెరికా వైమానిక దాడులలో అల్ బాగ్దాదీ మరణించాడని ఈ వార్తా సంస్థ ప్రకటించింది. అయితే, అమెరికా గానీ, ఇతర అధికారిక వార్తా సంస్థలు గానీ ఏవీ దీన్ని ఇంకా నిర్ధారించలేదు. సిరియాలో జరిగిన వైమానిక దాడుల్లో బాగ్దాదీ హతమైనట్లు తెలుస్తోంది. ఐఎస్ ఐస్ ఆధీనంలో ఉన్న మోసుల్ నగరానికి 65 కిలోమీటర్ల దూరంలో ఈ దాడి జరిగిందని అంటున్నారు. ఆదివారం నాటి వైమానిక దాడుల్లో బాగ్దాదీ తీవ్రంగా గాయపడినట్టు ఇప్పటికే వార్తలొచ్చాయి. అయితే ఈ దాడుల్లో గాయపడిన ఆయన ఆ తరువాత మరణించాడని మంగళవారం అల్ అమాక్ ప్రకటించింది.

మరోవైపు అమెరికా రక్షణ శాఖ వర్గాలను ఉటంకిస్తూ అమెరికా టీవీ నెట్ వర్క్ ‘సీఎన్ ఎన్’ కూడా బాగ్దాదీ చనిపోయినట్లు కథనం ప్రసారం చేసింది. ఐఎస్ పై దాడులు చేస్తున్న అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు భారీ విజయం సాధించినట్లే చెప్పాలి. మరోవైపు బాగ్దాదీ మరణం నేపథ్యంలో ఐఎస్ మరింత రెచ్చిపోతుందని అనుమానిస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద ముప్పు ఉన్న దేశాలన్నీ అలర్టయ్యాయి. బాగ్దాదీ హతమైనందుకు ప్రతీకారంగా అమెరికా - ఐరోపా దేశాలు - భారత్ వంటి చోట్ల ఉగ్రవాద దాడులు జరిగే ప్రమాదముందని భావిస్తున్నారు. కాగా.. బాగ్దాది మృతితో ఐఎస్ అంతం కూడా మొదలైనట్లేనని అంటున్నారు.