Begin typing your search above and press return to search.

ఐసిస్‌, మావోయిస్టుల మిలాఖ‌త్‌

By:  Tupaki Desk   |   20 July 2016 6:46 AM GMT
ఐసిస్‌, మావోయిస్టుల మిలాఖ‌త్‌
X
దేశంలో మావోయిస్టు స‌మ‌స్య చాలావ‌ర‌కు త‌గ్గింద‌ని రాష్ట్రాలు - భ‌ద్ర‌త ద‌ళాలు ఊపిరి పీల్చుకుంటున్న త‌రుణంలో షాకింగ్ న్యూస్ ఒక‌టి వారికి నిద్ర ప‌ట్ట‌నివ్వ‌కుండా చేస్తోంది. ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న ఐసిస్ ఉగ్ర‌వాదులు మావోయిస్టుల‌తో చేతులు క‌లప‌డానికి ప్లాన్ చేశార‌న్న స‌మాచారం తెలియ‌డంతో భ‌ద్ర‌త బ‌ల‌గాలు అప్ర‌మ‌త్త‌మ‌వుతున్నాయి. తీవ్ర‌వాదంతోనే తంటాలు ప‌డుతున్న త‌రుణంలో ఉగ్ర‌వాదం మ‌రింత ఇబ్బందిక‌రంగా మారుతోంది. ఇక ఈ రెండూ క‌లిస్తే అది మ‌రింత ప్ర‌మాద‌క‌ర‌మ‌ని భావిస్తున్నారు.

భారత్‌ లోని ఐసిస్‌ సభ్యులు నక్సలైట్‌ గ్రూపులను సంప్రదించారని జాతీయ దర్యాప్తు ఏజెన్సీ (ఎన్‌ ఐఏ) నిర్ధారించింది. హింసాత్మక కార్యకలాపాలు చేపట్టడంలో న‌క్స‌లైట్లు వేసే ఎత్తుగ‌డ‌లు - అనుస‌రించే వ్యూహాల‌ను కూడా ఈ ఐసిస్ స‌భ్యులు నేర్చుకున్నార‌ని వెల్ల‌డించింది. మావోయిస్టుల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసేందుకు కూడా ప్లాన్ చేశార‌ని... అయితే - అది వ‌ర్క‌వుట్ కాలేద‌ని చెబుతోంది. దేశవ్యాప్తంగా అరెస్టయిన 16 మంది అనుమానిత ఐసిస్‌ సానుభూతిపరులపై జాతీయ దర్యాప్తు ఏజెన్సీ(ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో సప్లమెంటరీ ఛార్జ్‌ షీట్‌) ఫైల్ చేసింది. అందులో ఈ వివ‌రాల‌న్నీ వెల్ల‌డించింది.

కాగా దేశంలో ఒక‌ప్పుడు తీవ్రంగా ఉన్న మావోయిస్టుల స‌మ‌స్య నుంచి చాలా రాష్ట్రాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ముఖ్యంగా బెంగాల్‌ - ఏపీ - ఒడిశా - తెలంగాణ వంటి రాష్ట్రాలు గ‌తంలో మావోయిస్టుల‌కు కంచుకోట‌లు కాగా ఇప్పుడు దాదాపుగా క‌నుమ‌రుగ‌య్యారు. కేవ‌లం ఛ‌త్తీస్ గ‌ఢ్ లో మాత్ర‌మే స‌మ‌స్య తీవ్రంగా ఉంది. జార్ఖండ్ లోనూ చెప్పుకోద‌గ్గ స్థాయిలో ఉంది. మ‌హారాష్ట్ర‌లో అడ‌పాద‌డ‌పా ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి. దీంతో మావోయిస్టుల స‌మ‌స్య నుంచి దేశం దాదాపుగా బ‌య‌ట‌ప‌డిన త‌రుణంలో ఐసిస్ వారితో చేతులు క‌లిపే ప్ర‌య‌త్నం చేస్తుండ‌డంతో ఇది ఎక్క‌డ‌కు దారితీస్తుందో అన్న ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.