Begin typing your search above and press return to search.

వ‌ర‌ల్డ్ క‌ప్‌ కు ఐసిస్ ముప్పు త‌ప్పేలా లేదు

By:  Tupaki Desk   |   27 Oct 2017 1:59 PM GMT
వ‌ర‌ల్డ్ క‌ప్‌ కు ఐసిస్ ముప్పు త‌ప్పేలా లేదు
X
అంత‌ర్జాతీయ ఉగ్ర‌మూక ఐసిస్ అరాచ‌కాలు పెరిగిపోతున్నాయి. ఇన్నాళ్లు ఆయా దేశాల‌కు, కొంద‌రు పాల‌కుల‌కు ప‌రిమిత‌మైన ఈ బెదిరింపులు తాజాగా శృతిమించాయి. వచ్చే ఏడాది రష్యాలో జరిగే ఫిఫా వరల్డ్‌ కప్‌ కు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది ఇస్లామిక్ స్టేట్. ఐఎస్‌ కు చెందిన వఫా మీడియా ఫౌండేషన్ ట్విట్టర్‌ లో ఈ బెదిరింపు సందేశాన్ని ఉంచింది. దీనికోసం అర్జెంటీనా - బార్సిలోనా సూపర్‌ స్టార్ లియోనెల్ మెస్సీ ఫొటోను వాడుకుంది. మెస్సీ రక్త కన్నీరు కారుస్తున్నట్లుగా ఫొటోను సృష్టించి.. మీరు పోరాడుతున్న రాజ్యం ఓటమెరుగనిది అని కామెంట్ పెట్టింది.

ఓ ఇంటెలిజెన్స్ గ్రూప్ మంగళవారం ఈ ట్వీట్‌ ను గుర్తించింది. అంతేకాదు నైకీ ఫేమస్‌ ట్యాగ్‌ లైన్ అయిన జస్ట్ డూ ఇట్‌ను కాస్త మార్చి.. జస్ట్ టెర్రరిజం అన్న క్యాప్షన్‌ ను కూడా ఈ ఫొటోకు పెట్టడం గమనార్హం. వచ్చే ఏడాది జరిగే ఈ వరల్డ్‌కప్‌కు ఇప్పటికే ఇస్లామిక్ స్టేట్ నుంచి ఎన్నో బెదిరింపులు వచ్చాయి. ఈ మధ్యే ఫ్రాన్స్ - జర్మనీ మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ సందర్భంలోనూ ఐఎస్.. పారిస్‌ లో పేలుళ్లకు పాల్పడిన విషయం తెలిసిందే. 2016 యురోపియన్ చాంపియన్‌ షిప్‌ కు కూడా ఈ ఉగ్ర సంస్థ ఇలాగే హెచ్చరికలు జారీ చేసినా.. ఆ టోర్నీ ఎలాంటి అవాంచనీయ ఘటనలు లేకుండా సాఫీగా పూర్తయింది.

దక్షిణ ఫిలిప్పీన్స్‌ లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో తమ పోరు ముగిసిందని, ఉగ్రవాదులందరినీ మట్టుబెట్టామని అధికార వర్గాలు వెల్లడించాయి. మరావి నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని ఉగ్రవాదులు హింసకు చెలరేగారని, దాదాపు ఐదు నెలలపాటు వారితో పోరాడి ఆ ప్రాంతానికి విముక్తి కలిగించామని తెలిపాయి. ఓ భవనంలో తలదాచుకున్న 42 మంది ఉగ్రవాదులను హతమార్చడంతో తమ పోరు ముగిసిందని, దీంతో తమ పోరాటాన్ని నిలిపివేసినట్లు పేర్కొన్నాయి. ఉగ్రవాదుల చెర నుంచి మరావి నగరానికి విముక్తి కలిగించడం ఆనందంగా ఉన్నదని ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టి తెలిపారు. ఉగ్రవాదులపై ఫిలిప్పీన్స్ విజయం సాధించడం గొప్ప విషయమని అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్ పేర్కొన్నారు.