Begin typing your search above and press return to search.

ఆ ‘‘రాక్షసుడు’’ తల్లిని ఎందుకు చంపాడంటే?

By:  Tupaki Desk   |   9 Jan 2016 4:42 AM GMT
ఆ ‘‘రాక్షసుడు’’ తల్లిని ఎందుకు చంపాడంటే?
X
ఈ భూమ్మీద ఉన్న నరరూప రాక్షసులు తామేనని ఇప్పటికే తమ చర్యలతో పలుమార్లు స్పష్టం చేసిన ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు తాజాగా తమ దారుణ చర్యను ప్రదర్శించారు. పురాణాల్లో కనిపించే రాక్షసులు దేవతల్ని హింసించినా.. కన్నతల్లిని మాత్రం ద్వేషించిన.. చంపిన దాఖలాలు కనిపించవు. దానికి భిన్నంగా ఇస్లామిక్ స్టేట్ కి చెందిన ఒక రాక్షసుడు మాత్రం ప్రాణం పోసిన కన్నతల్లిని సైతం కిరాతకంగా చంపేశాడు.

ఎందుకిలా చేశాడంటే.. మానవత్వం అన్నది లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ను వదిలేయాలని సదరు తల్లి కోరటమే ఆమె ప్రాణాల్ని తీసేలా చేసింది. సిరియాలోని రక్కా పట్టణంలో చోటు చేసుకున్న ఈ ఘటన గురించి విన్న వారంతా షాక్ తింటున్నారు. ఐఎస్ తీవ్రవాదుల రాజధాని నగరిగా చెప్పుకునే రక్కాకు చెందిన ఒక మాతృమూర్తి.. తన కొడుకు ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులతో కలిసి పని చేయటాన్ని జీర్ణించుకోలేకపోయింది. తీవ్రవాద కార్యక్రమాలు వద్దని అభ్యర్థించింది.

ఆమె గురించి వివరాలు తెలుసుకున్న ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు.. ఆమెను చంపేయాల్సిందిగా కొడుక్కి ఆదేశాలు జారీ చేశారు. ఈ కసాయి కొడుకు వెనుకా ముందు ఆలోచించకుండా.. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు ఇచ్చిన ఆదేశాల్ని అమలు చేశాడు. వందలాది మంది చూస్తుండగా.. కన్న తల్లిని ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద నాయకుల ఆదేశాలతో కాల్చి చంపేశాడు.