Begin typing your search above and press return to search.

బందరు నుంచి పోటీ చేసేది పేర్ని నాని కాదా?

By:  Tupaki Desk   |   2 July 2022 4:25 AM GMT
బందరు నుంచి పోటీ చేసేది పేర్ని నాని కాదా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రం మ‌చిలీప‌ట్నం (బంద‌రు) నుంచి ప్ర‌స్తుతం ఎమ్మెల్యేగా ఉన్న పేర్ని నాని పోటీ చేయ‌డం లేదా? ఆయ‌న ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి విముఖంగా ఉన్నారా అంటే అవున‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం పేర్ని నాని కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ అధ్య‌క్షుడిగా ఉన్నారు. అంత‌కుముందు వైఎస్ జ‌గ‌న్ కేబినెట్ లో ర‌వాణా, సినిమాటోగ్ర‌ఫీ, స‌మాచార, ప్ర‌సార శాఖ‌ల మంత్రిగా ప‌నిచేశారు.

వైఎస్సార్సీపీ త‌ర‌ఫున ప్ర‌తిప‌క్షాలపై ముఖ్యంగా జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ పై పేర్ని నాని తీవ్ర విమ‌ర్శ‌లు చేసేవారు. త‌న సొంత కులం కాపుల గురించి ఆయ‌న మాట్లాడిన మాట‌లు తీవ్ర వివాదాస్ప‌ద‌మ‌య్యాయి.

మ‌రోవైపు బంద‌రు ఎంపీగా ఉన్న వ‌ల్ల‌భ‌నేని బాల‌శౌరితో పేర్ని నానికి ఏమాత్రం పొస‌గ‌డం లేదు. అటు పేర్నినాని, ఇటు వ‌ల్ల‌భ‌నేని బాల‌శౌరి ఇద్ద‌రూ కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారే. ఇటీవ‌ల ఎంపీ హోదాలో బాల‌శౌరి బంద‌రులో ప‌ర్య‌టించ‌గా పేర్ని నాని వ‌ర్గం అడ్డుకుంది. దీనిపై బాల‌శౌరి ఓ రేంజులో నిప్పులు చెరిగిన సంగ‌తి తెలిసిందే. పేర్ని నానిని టార్గెట్ చేస్తూ బాల‌శౌరి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

కాగా ప్ర‌స్తుతం బంద‌రు నియోజ‌క‌వ‌ర్గంలో పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు క్రియాశీల‌కంగా ఉంటున్నారు. క్రికెట్ టోర్న‌మెంట్ ల పేరుతో యూత్ లో క్రేజు సంపాదించారు. త‌న తాత పేర్ని కృష్ణ‌మూర్తి, త‌న తండ్రి పేర్ని నాని ఎమ్మెల్యేలుగా ప‌నిచేయ‌డంతో మూడో త‌రంలో తాను కూడా ఎమ్మెల్యే కావాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలోనూ పేర్ని కిట్టు బాగానే తిరుగుతున్నారు.

ఈ నేప‌థ్యంలో బంద‌రు నుంచి పేర్ని కిట్టు ఈసారి ఎన్నిక‌ల్లో పోటీ చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. కృష్ణా జిల్లా పార్టీ అధ్య‌క్షుడిగా పేర్ని నాని జిల్లా అంత‌టా తిర‌గాల్సి ఉంటుంది కాబ‌ట్టి త‌న‌కు బ‌దులుగా త‌న కుమారుడు పేర్ని కిట్టును రంగంలోకి దించుతున్నార‌ని చెబుతున్నారు.