Begin typing your search above and press return to search.

ఏందమ్మా స్మృతి ఆ విషయం చెప్పరే? ఆ లైసెన్సు భర్తగారిదేనట కదా?

By:  Tupaki Desk   |   10 Sep 2022 12:30 PM GMT
ఏందమ్మా స్మృతి ఆ విషయం చెప్పరే? ఆ లైసెన్సు భర్తగారిదేనట కదా?
X
అబద్ధం చెప్పలేదు.. అద సమయంలో నిజం కూడా చెప్పని తెలివితేటల్ని చూపిస్తుంటారు. అలాంటి తెలివినే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రదర్శించారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. గోవాలోని వివాదాస్పద సిల్లీ సోల్స్ రెస్టారెంట్ అండ్ బార్ కు ఆహార లైసెన్సుకు సంబంధించిన వివాదం కొంతకాలంగా నడుస్తున్న సంగతి తెలిసిందే.

అయితే.. ఈ రెస్టారెంట్ స్మృతి ఇరానీ కుమార్తె పేరు మీద ఉన్నట్లుగా వార్తలువచ్చాయి. ఆ సందర్భంగా ఆ సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారే కానీ.. అది తన భర్తదన్న విషయాన్ని వెల్లడించలేదు.

అది కాస్తా తాజాగా ఒక లాయర్ పుణ్యమా అని బయటకు వచ్చేసింది. గోవాకు చెందిన న్యాయవాది ఎయిర్స్ రోడ్రిగ్స్ ఆర్టీఐ దరఖాస్తు చేగా.. దానికి గోవా ప్రభుత్వం బదులిచ్చింది. అందులో.. సిల్లీ సోల్స్ కు ఫుడ్ లైసెన్సు ను ఎయిటాల్ ఫుడ్ అండ్ బేవరేజెస్ లిమిటెడ్ కంపెనీకి ఇచ్చినట్లు వెల్లడించారు. ఇంతకూ ఆ కంపెనీ మరెవరిదో కాదు స్మృతి ఇరానీ భర్త.. కుటుంబసభ్యులవేనన్న విషయాన్ని తాజాగా వెల్లడైంది.

ఆ కంపెనీలో 75 శాతం వాటాలు వారి కుటుంబానికే ఉన్టన్లుగా పేర్కొన్నారు. ఎయిటాల్ ఫుడ్ అండ్ బేవరేజెస్ కంపెనీకి ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్సు జారీ చేస్తే.. అదే లైసెన్సును సిల్లీ సోల్స్ కు వాడుతున్న విషయం బయటకు వచ్చింది. అసలీ వివాదంలోకి వెళితే..

గోవాలోని సిల్లీ సోల్స్ కు మద్యం లైసెన్సును అక్రమంగా రెన్యువల్ చేయించారంటూ గోవా ఎక్సైజ్ కమిషనర్ గత జులైలో నోటీసులు ఇవ్వటం తెలిసిందే. ఈ ఎపిసోడ్ లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో గతంలో బార్ కు ఎక్సైజ్ లైసెన్సు అక్రమంగా రెన్యువల్ చేయించుకున్నారన్న సమాచారాన్ని తెలుసుకునేందుకు ఆర్టీఐ అప్లికేషన్ పెట్టగా.. అసలు విషయం బయటకు వచ్చింది. మొదట్లో ఈ సంస్థ స్మృతి ఇరానీ కుమార్తెదిగా ప్రచారం జరిగింది.కాంగ్రెస్ నేతలు కూడా ఇదే ఆరోపణలు చేశారు. ఇప్పుడేమో కుమార్తెది కాదు.. భర్తదన్న విషయం వెలుగు చూసింది, మరిప్పుడు ఆమె ఏం చెబుతారో?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.