Begin typing your search above and press return to search.

జాతీయ పార్టీ అన్నప్పుడు ఇలాంటివి డ్యామేజ్ కాదంటారా కేసీఆర్?

By:  Tupaki Desk   |   16 Dec 2022 6:30 AM GMT
జాతీయ పార్టీ అన్నప్పుడు ఇలాంటివి డ్యామేజ్ కాదంటారా కేసీఆర్?
X
కోపం వస్తే కౌగిలించుకుంటామా? బాధ కలిగితే నవ్వుతామా? అంటూ కొందరు చిత్ర విచిత్రమైన వాదనలు వినిపించొచ్చు. కానీ.. వ్యక్తులకు.. వారిని నడిపించే వ్యవస్థల తీరు ఒకేలా ఉండాలనుకోవటానికి మించిన అమాయకత్వం మరొకటి ఉండదు. వ్యవస్థ తల్లిదండ్రుల మాదిరి వ్యవహరిస్తుంటుంది. పిల్లలు తప్పు చేసినప్పుడు వారికి బుద్ధులు నేర్పటమే కాదు.. అవసరమైన నాలుగు తగిలించైనా సరే.. వారిని దారికి తేవాలనుకోవటం తప్పేం కాదు. ఎందుకంటే.. తమ పిల్లల్ని తాము తప్పించి ఎవరు మందలించినా తల్లి మనసుకు కష్టం కలుగుతుంది. అలానే.. నోటి నుంచి వచ్చే మాటలు.. ఆదర్శాలు జాతీయ స్థాయిలో ఉండి.. చేతలు మాత్రం గల్లీ స్థాయిని దాటకపోతే అభాసుపాలు కాక తప్పదు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదంటున్నారు.

గులాబీ బాస్ గా సుపరిచితుడైన కేసీఆర్ గురించిన ఒక విషయం అందరికి తెలిసిందే. ఆయనకు కోపం వచ్చినా.. చిరాకు కలిగినా.. వారి విషయంలో ఆయన ఎలా ఉంటారో తెలిసిందే. అదే సమయంలో అవసరానికి తగ్గట్లు అక్కరకు వచ్చే వారిని ఆయన ఎంతలా ఆదరిస్తారు? మరెంతలా అక్కున చేర్చుకుంటారన్న విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. ప్రస్తుతం ఆయన జాతీయ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు.. దేశ వ్యాప్తంగా తాను పెట్టిన బీఆర్ఎస్ గురించి మాట్లాడేందుకు పడుతున్న తపన అంతా ఇంతా కాదు.

ఇన్ని చేస్తూనే.. తన రాజకీయ ప్రత్యర్థుల విషయంలోనూ.. తనకు వ్యక్తిగతంగా నచ్చని వారివిషయంలో ఏ మాత్రం సానుకూల పరిణామాలకు ఆయన సిద్దంగా లేరన్న విషయం తాజాగా చోటు చేసుకునే సంఘటనల్ని చూసినప్పుడు ఇట్టే అర్థమవుతుంది. తాజాగా రాజ్ భవన్ లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా దీనికి రాష్ట్ర స్థాయిలో ఈ సంస్థ వ్యవహారాలకు కీలక భూమిక పోషించే గవర్నర్ తమిళ సై అవార్డుల ప్రధానం చేశారు.

ఈ సందర్భంగా అవార్డులు తీసుకోవటానికి తెలంగాణ ప్రభుత్వంలోని పలు శాఖలకు చెందిన అధికారులకు ఆహ్వానం పంపారు. కానీ.. వారు వాటిని తీసుకోవటానికి మాత్రంరాజ్ భవన్ కు రాలేదు. తెలంగాణ ప్రభుత్వానికి.. రాజ్ భవన్ కు మధ్య దూరం పెరుగుతుందన్న వార్తలు అంతకంతకూ ఎక్కువ అవుతున్న వేళ.. ఇలాంటి పరిణామం చోటు చేసుకోవటం గమనార్హం. ఒకవైపు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న కేసీఆర్.. తన ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం వ్యవస్థల మధ్య పోరు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. కానీ.. అందుకు భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.

మంత్రులు.. ఎమ్మెల్యేలకే కాదు 19 మంది కలెక్టర్లు.. ఒక పోలీసు కమిషనర్.. ఐదుగురు ఎస్పీలకు పురస్కారాలు లభించగా.. వారెవరూ వాటిని అందుకోవటానికి రాకపోవటం దేనికి నిదర్శనం? అన్నది ప్రశ్న. మారిన పరిస్థితులకు అనుగుణంగా.. ప్రభుత్వానికి.. గవర్నర్ కు మధ్య దూరం పెరిగిన నేపథ్యంలో గవర్నర్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా ప్రోటోకాల్ ప్రకారం హాజరు కావాల్సిన కలెక్టర్లు.. కమిషనర్లు.. ఎస్పీలు వాటిని పాటించటం లేదన్న సంగతి తెలిసిందే.

తాజాగా రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమానికి డుమ్మా కొట్టిన వైనం హాట్ టాపిక్ గా మారింది. కోపతాపాలు.. వ్యక్తిగత ద్వేషాలు ఉండొచ్చు. కానీ.. వ్యవస్థల్ని రిప్రజెంట్ చేసే స్థాయిలో ఉన్నప్పుడు వాటికి కాస్తంత అతీతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కానీ.. అలాంటిదేమీ ఉండదన్న విషయాన్ని తాజా పరిణామంతో కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారని చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.