Begin typing your search above and press return to search.

కేరళలోనడుస్తోంది థర్డ్ వేవ్ కాదా? కీలక విషయాల్ని చెప్పిన వైద్య ప్రముఖుడు

By:  Tupaki Desk   |   5 Sep 2021 3:37 AM GMT
కేరళలోనడుస్తోంది థర్డ్ వేవ్ కాదా? కీలక విషయాల్ని చెప్పిన వైద్య ప్రముఖుడు
X
కరోనా ప్రస్తావన వచ్చినంతనే కేరళ గురించిన మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. దేశంలో మరే రాష్ట్రంలో లేనంత బాగా ఏర్పాట్లు చేయటం.. కరోనా పాజిటివ్ కేసుల గుర్తింపు కోసం చేసే కసరత్తు గురించి పెద్ద ఎత్తున చెబుతుంటారు. ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జాగ్రత్తలు తీసుకున్నా.. ఇప్పుడు దేశంలో నమోదవుతున్న కేసుల్లో దాదాపు 60-70 శాతం కేసులు కేరళలోనే నమోదు కావటం తెలిసిందే. మరిన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా ఎందుకిన్ని కేసులు నమోదవుతున్నాయి? అన్న ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేని పరిస్థితి. అదే సమయంలో.. ప్రస్తుతం ఇప్పుడా రాష్ట్రంలో థర్డ్ వేవ్ సాగుతోందన్న మాట వినిపిస్తోంది.

కేరళలోని కరోనా పరిస్థితులు.. అక్కడ తీసుకుంటున్న జాగ్రత్తలు.. చేపడుతున్న చర్యల గురించి అధ్యయనం చేయటం కోసం ఏపీ నుంచి నిపుణుల టీం ఒకటి వెళ్లి అధ్యయనం చేసింది. ఆ బృందంలోని సభ్యుడు ఒకరు డాక్టర్ సాంబశివారెడ్డి. ప్రముఖ న్యూరో సర్జన్ గా.. ఆరోగ్య శ్రీ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న ఆయన తాము గుర్తించిన ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. కేరళ విషయంలో నెలకొన్న పలు సందేహాలకు ఆయన మాటల్లో సమాధానాలు దొరుకుతాయని చెప్పక తప్పదు.

కేరళలో ప్రస్తుతం నడుస్తున్నది థర్డ్ వేవ్ అని అనుకుంటున్నారని.. కానీ అది వాస్తవం కాదన్నారు. ప్రస్తుతం అక్కడ సెకండ్ వేవ్ నడుస్తోందని తెలిపారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. ఆ రాష్ట్రంలో ఎక్కువ లాక్ డౌన్ పెట్టారని.. దీంతో మొదటి వేవ్ లో కేసులు పెద్దగా నమోదు కాలేదన్నారు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ఓనమ్ తో పాటు పలు స్థానిక పండుగలు వచ్చాయని.. దీంతో సెకండ్ వేవ్ ఆలస్యంగా మొదలైందన్నారు. ప్రస్తుతం అక్కడ నడుస్తోంది సెకండ్ వేవ్ అని చెప్పారు. సెకండ్ వేవ్ నాటికి అక్కడ 42 శాతం సీరో సర్వెలెన్స్ ఉందని.. మన దగ్గర అప్పటికే 70 శాతం ఉన్నట్లు చెప్పారు.

కరోనా వేళలో ఏపీ ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రుల్లో ధరల్ని నియంత్రించగలిగిందని.. అదే సమయంలో కొవిడ్.. బ్లాక్ ఫంగస్ లను ఆరోగ్యశ్రీలో చేర్చటం వల్ల ఎక్కువ మంది ప్రజలు లబ్థి పొందారన్నారు. మిగిలిన రాష్ట్రాలు అలాంటివి చేయలేకపోయాయని.. కరోనా వేళలో ఏపీ తీసుకుంటున్న నిర్ణయాల్ని మరే రాష్ట్రం తీసుకోలేకపోయిందన్నారు. కేరళలో వైద్యులు చాలా బాగా కమిట్ మెంట్ తో పని చేస్తారని.. అక్కడ వైద్యుల కొరత లేదన్నారు. అదే సమయంలో మన దగ్గర వైద్యులకు ఇచ్చే వేతనాల కంటే కూడా అక్కడ తక్కువగా ఉన్నాయని చెప్పారు. అక్కడి ప్రభుత్వ వైద్యులు ఎవరూ కూడా ప్రైవేటు ప్రాక్టీస్ చేయరన్నారు.

ప్రభుత్వ పరిధిలో పని చేసే వారెవరూ అక్కడ ప్రైవేటుగా ప్రాక్టీస్ చేయరన్నారు. కొవిడ్ నిబంధనల్ని పాటించటంలో కేరళీయులకు చక్కటి అవగాహన ఉందన్న ఆయన.. కొవిడ్ నిబంధనల్ని పాటించటంలో వాళ్లు చాలా ముందున్నారన్నారు. ఇప్పటికి 50 శాతం మంది డబుల్ మాస్కులు వినియోగిస్తున్నారన్నారు. అక్కడి ప్రజలు ముందుగా టోకెన్ తీసుకొని మాత్రమే ఆసుపత్రికి వెళతారని.. తమకు కేటాయించిన సమయానికి మాత్రమే ఆసుపత్రుల వద్దకు వెళ్లటం వల్ల అక్కడి ఆసుపత్రుల వద్ద రద్దీ ఉండదన్నారు. ఈ విధానాన్ని మనం కూడా అమలు చేయాల్సి ఉంటుందన్నారు. డాక్టర్ సాంబశివరెడ్డి మాటల్ని విన్నప్పుడు మన పొరుగున ఉండే కేరళలో విలువల సిస్టం ఎంత బాగా ఉందన్న విషయం ఇట్టే అర్థంకాక మానదు.