Begin typing your search above and press return to search.

ఇస్రో ఘనత: పీఎస్ఎల్వీ సక్సెస్.. నింగిలోకి 10 ఉపగ్రహాలు

By:  Tupaki Desk   |   7 Nov 2020 4:00 PM GMT
ఇస్రో ఘనత: పీఎస్ఎల్వీ సక్సెస్.. నింగిలోకి 10 ఉపగ్రహాలు
X
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో చారిత్రాత్మక ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. శ్రీహరికోట లోని షార్ కేంద్రం నుంచి ఒక స్వదేశీ ఉపగ్రహం.. 9 విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. లాక్ డౌన్ తో తర్వాత జరిగిన ఈ తొలి చారిత్రాక ప్రయోగాన్ని ఇస్రో విజయవంతం చేయడం విశేషం.

శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శనివారం పీఎస్‌ఎల్‌వీ సీ- 49 రాకెట్‌ను ప్రయోగించారు. శుక్రవారం మధ్యాహ్నం 1.02 గంటలకు మొదలైన కౌంట్‌డౌన్ 26 గంటల నిరంతరాయంగా కొనసాగింది. అనంతరం పీఎస్‌ఎల్వీసీ 49 నిప్పుల చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలో భారీ వర్షం కారణంగా నిర్ణీత సమయం కంటే ప్రయోగం 10 నిమిషాలు ఆలస్యంగా ప్రయోగం చేపట్టారు.

పీఎస్‌ఎల్‌వీ సీ- 49 రాకెట్‌ ద్వారా మధ్యాహ్నం 3.12 నిమిషాలకు నింగిలోకి 10 ఉపగ్రహాలను పంపింది. ప్రయోగ కేంద్రం నుంచి బయలుదేరిన 13 నిమిషాల తర్వాత రాకెట్ నుంచి ఒక్కొక్కటిగా విడిపోయిన ఉపగ్రహాలు నిర్దేశిత కక్ష్యలోకి చేరాయి. తొలి దశలో ఈఓఎస్‌-01 అనే స్వదేశీ ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌‌ను కక్ష్యలో, మరో 9 విదేశీ ఉపగ్రహాలు ఉన్నాయి. కరోనా నేపథ్యంలో శాస్త్రవేత్తలు మినహా ఇతరులను షార్‌లోనికి అనుమతించలేదు. పీఎస్‌ఎల్వీ సిరీస్‌లో ఇది 51వ ప్రయోగం కాగా, షార్‌ నుంచి 76వ ప్రయోగం కావడం గమనార్హం.

అంతకుముందు ఆనవాయితీ ప్రకారం నమూనా రాకెట్‌కు తిరుమల శ్రీవారి ఆలయంలో ఇస్త్రో శాస్త్రవేత్తల బృందం శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రయోగం ద్వారా ద్వారా భారత్‌కు చెందిన ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ (ఈఓఎస్‌–01) అందుబాటులోకి రానుంది. వ్యవసాయం, అటవీ, ప్రకృతి వైపరీత్యాల అధ్యయనం కోసం సరికొత్తగా ఈ ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ను రూపొందించినట్లు ఇస్రో వెల్లడించింది. వాస్తవానికి ఈ ప్రయోగాన్ని మార్చి 12న నిర్వహించాలని భావించినా కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. దాదాపు పది నెలల అనంతరం ప్రయోగం నిర్వహించారు.