Begin typing your search above and press return to search.

ఇస్రో ఖాతాలో మ‌రో విజ‌యం.. ముష్క‌రుల‌కు షాకే!

By:  Tupaki Desk   |   22 May 2019 5:02 AM GMT
ఇస్రో ఖాతాలో మ‌రో విజ‌యం.. ముష్క‌రుల‌కు షాకే!
X
స‌రిహ‌ద్దుల్లోని ఉగ్ర స్థావ‌రాల్ని క‌చ్ఛితంగా గుర్తించ‌టం క‌ష్ట‌సాధ్య‌మైన వేళ‌.. ఆ ఇబ్బందిని అధిగ‌మించేందుకు వీలుగా తాజా ప్ర‌యోగాన్ని నిర్వ‌హించింది ఇస్రో. అంత‌రిక్షం నుంచి శ‌త్రుదేశాల స‌రిహ‌ద్దుల్లో ఏం జ‌రుగుతుంద‌న్న విష‌యాన్ని మ‌రింత దృష్టి పెట్టేందుకు వీలుగా.. తాజాగా ఒక రాకెట్ ప్ర‌యోగాన్ని నిర్వ‌హించింది ఇస్రో. నెల్లూరు జిల్లా స‌తీశ్ ధ‌వ‌న్ స్పెస్ సెంట‌ర్ నుంచి ఈ రోజు ఉదయం 5.30 గంట‌ల‌కు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహిక‌ల్ సీ46ను ప్ర‌యోగించారు.

615 కేజీల బ‌రువున్న ఈ రీశాట్ 2బీఆర్1 శాటిలైట్ ను పీఎస్ ఎల్ వీ సీ46 వాహ‌క నౌక ద్వారా బూమికి 557 కిలోమీట‌ర్ల ఎత్తులో ఉన్న క‌క్ష‌లో ప్ర‌వేశ పెట్టారు. మంగ‌ళ‌వారం ఉద‌యం 4.30 గంట‌ల‌కు మొద‌లైన కౌంట్ డౌన్ 25 గంట‌లు గ‌డిచిన త‌ర్వాత‌.. బుధ‌వారం ఉద‌యం 5.30 గంట‌ల‌కు నింగిలోకి దూసుకెళ్లింది.

రాకెట్ ప్ర‌యోగం జ‌రిపిన 15.29 నిమిషాల‌కు ఉప‌గ్ర‌హం నుంచి వీడిపోయింది. అత్యంత ఆధునిక రాడార్ ఇమేజింగ్ భూ ప‌రిశీల‌న ఉప‌గ్ర‌హ‌మైన రీశాట్ 2 బీఆర్ 1 ఆయుష్షు ఐదేళ్లుగా చెబుతున్నారు. ఈ కాలంలో శ‌త్రుదేశాల స‌రిహ‌ద్దుల్లోని ఉగ్ర‌స్థావ‌రాల‌పై ఒక క‌న్నేసి.. ఆ స‌మాచారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు తెలియ‌జేస్తూ ఉంటుంది. మ‌రోవైపు అవీ రంగాల స‌మాచారంతో పాటు.. ప్ర‌కృతి విప‌త్తుల్లోనూ ఈ ఉప‌గ్ర‌హం సాయం చేయ‌నుంది.

తొలిసారి రీశాట్ ను 2009లో ప్ర‌యోగించ‌గా.. 2012లో మ‌రోసారి ప్ర‌యోగించారు. తాజాగా మ‌రోసారి ఈ ప్ర‌యోగాన్ని విజ‌య‌వంతంగా పూర్తి చేశారు. ఈ ప్ర‌యోగానికి ఉప‌యోగించిన పీఎస్ ఎల్వీని 48వ సారి వినియోగించారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే ఎలాంటి బూస్ట‌ర్లు లేకుండానే పీఎస్ ఎల్వీ కోర్ అలోన్ త‌ర‌హాలో రాకెట్ ను రూపొందించారు.