Begin typing your search above and press return to search.

మళ్ళీ కేశినేని చిన్ని....నానితో డైరెక్ట్ ఫైటింగేనా...?

By:  Tupaki Desk   |   26 Oct 2022 3:55 AM GMT
మళ్ళీ కేశినేని చిన్ని....నానితో డైరెక్ట్ ఫైటింగేనా...?
X
విజయవాడ తెలుగుదేశం రాజకీయాలే చాలా చిత్రంగా ఉంటాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్యర్ధి పార్టీ మీద పోరాడాల్సిన తమ్ముళ్ళు తమలో తామే కలహించుకుంటూ వర్గపోరుకు తెర తీస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. ఇపుడు అక్కడ అన్నదమ్ముల సమరమే సాగుతోంది అని అంటున్నారు. విజయవాడ ఎంపీగా వరసగా రెండవసారి గెలిచిన కేశినేని నాని అధినాయకత్వం మీద గుర్రుగా ఉంటూ వస్తున్నారు. ఆయన ఏకంగా చంద్రబాబు నాయుడు ఎదుటనే తన అసతృప్తిని వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.

రెండేళ్ల కరోనా తరువాత ఒంగోలులో ఘనంగా జరిగిన మహానాడుకు ఎంపీ అయిన కేశినేని నాని డుమ్మా కొడితే ఆయన తమ్ముడు కేశినేని శివనాధ్ అలియాస్ చిన్ని హాజరై రక్తి కట్టించారు. అంతే కాదు విజయవాడ ఎంపీ పరిధిలో కూడా కలియతిరుగుతూ చిన్ని తన దూకుడు తాను చేస్తున్నారు. ఇదంతా అధినాయకత్వం ప్రోత్సాహంతోనే జరుగుతోంది అని అనుమానించిన నాని హై కమాండ్ మీదనే ఇండైరెక్ట్ గా ఫైర్ అయి దూరం పాటిస్తున్నారు.

ఇక ఆ మధ్య ఎంపీ స్టిక్కర్ తో కార్లు వాడుతూ దుర్వినియోగం చేస్తున్నారు అంటూ నాని పోలీసులకు ఫిర్యాదు చేసేంతగా అన్నదమ్ముల ఇష్యూ వెళ్ళింది. ఇక ఢిల్లీ ఎయిర్ పోర్టులో చంద్రబాబుకు ఫ్లవర్ బోకే ఇవ్వడానికి కూడా నాని నాట్ ఓకే అన్నట్లుగా వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ మధ్యన ఆగస్ట్ 15న గవర్నర్ ఇచ్చిన ఎట్ హోం కి చంద్రబాబుతో పాటు నాని వెళ్ళి కూర్చుని వచ్చారు. అలా హై కమాండ్ తో తన వివాదాలను ఆయన సర్దుబాటు చేసుకుంటున్న వేళ చిన్ని కూడా సైలెంట్ అయినట్లుగా కనిపించారు.

అయితే ఇపుడు చిన్ని సడెన్ గా మళ్లీ విజయవాడలో కనిపిస్తున్నారు. ఆయన కొన్ని నియోజకవర్గాలలో హల్ చల్ చేస్తున్నారు. అంటే ఎంపీ సీటు నుంచి తగ్గి ఎమ్మెల్యే సీటు కోసం చిన్ని ట్రై చేస్తున్నారా అన్న చర్చ సాగుతోందిట. ఆయన గతంలో చెప్పిన మాట చూస్తే తనకు విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంపై తనకు ఎలాంటి ఆసక్తి లేదని, ఎలాంటి పదవులు లేకుండా కేవలం టీడీపీ కార్యకర్తనని పేర్కొన్నారు. అలాగే తన అన్నయ్య నానితో తనకు ఎలాంటి విభేదాలు లేవని కూడా చెప్పరు. కానీ ఇపుడు ఆయన మళ్లీ ఫీల్డ్ లోకి వచ్చేసారు.

పైగా విజయవాడ నగరంలో చిన్ని చాలా యాక్టివ్‌గా పాలిటిక్స్ లో పాలుపంచుకుంటున్నారు అని చెబుతున్నారు. పార్లమెంటు ఎన్నికలపై తనకు ఆసక్తి లేదని చెబుతూనే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నగరంలోని అసెంబ్లీ సెగ్మెంట్లపై దృష్టి సారించినట్లు సమాచారం అయితే అందుతోంది మరి. ప్రస్తుతం చూస్తే చిన్ని విజయవాడ సెంట్రల్, తూర్పు, పశ్చిమ అసెంబ్లీ సెగ్మెంట్లలోని కొన్ని ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తూ పార్టీ కార్యకర్తలతో మమేకమవుతున్నారు.

అలాగే లోకల్ గా ఉన్న ప్రజలతో ఆయన కలసి తిరుగుతున్నారు. వీలైన చోట్ల అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు కేవలం గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాలకే పరిమితమైన చిన్ని రాజకీయం కాస్తా ఇప్పుడు విజయవాడ పట్టణ ప్రాంతాలకు పాకింది అంటున్నారు. టీడీపీ కార్యక్రమాల్లో ఎక్కడ చూసినా ఇపుడు చిన్ని ఒక్కరే కనిపిస్తున్నారు.

పైగా ఆయన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో చాలా దూకుడు చేస్తున్నారు. నిజానికి ఇక్కడ నాని పార్టీ ఇంచారిగా ఉన్నారు. అయితే నానికి తెలియకుండా పార్టీ కార్యక్రమాలలో సొంతంగానే చిన్ని పాల్గొంటున్నారు. అంతే కాదు, తన అన్న నానితో నిత్యం హోరాహోరీగా పోటీ పడుతున్న టీడీపీ నేతలైన నాగుల్‌మీరా, బోండా ఉమా వంటి వారితోనూ చిన్ని సన్నిహితంగా మెలుగుతున్నారు.

దీంతో చిన్ని మళ్లీ ఎందుకు సీన్ లోకి వచ్చారు అన్న చర్చ అయితే టీడీపీలో మొదలైంది. అయితే పార్టీ అధిష్టానంతో పెద్దగా సఖ్యతగా లేని నాని కంటే చిన్ని వీర విధేయుడుగా ఉంటూ మంచి మార్కులు సాధిస్తున్నారని, అందుకే ఆయన్ని టీడీపీ అధిష్టానం ఉద్దేశ్యపూర్వకంగా ప్రోత్సహిస్తోందనే టాక్ నడుస్తోంది మరి.

ఒకవేళ టీడీపీ మీద చివరి నిముషంలో అయినా నాని తిరుగుబాటు చేసి ఇతర అభ్యర్థుల ప్రయోజనాలను దెబ్బతీసే పక్షంలో విజయవాడలో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని రూపొందించాలని టీడీపీ అధినేత నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే కేశినేని నానికి ఆల్టర్నేషన్ గా చిన్నిని వారే రంగంలోకి దించుతున్నారు అని అంటున్నారు.

అంటే ఎమ్మెల్యే లేకపోతే ఎంపీ సీటుకు చిన్నిని దింపడం ద్వారా నానికి పక్కలో బల్లెంగా తయారు చేయడానికి హై కమాండ్ రెడీగా ఉంది అన్న మాట. మరి అసలే గుస్సా మీదున్న నాని తమ్ముడు వీర దూకుడు దాని వెనక అధినాయకత్వం అండ చూసి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలని అంటున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.