Begin typing your search above and press return to search.

నెల్లూరు జిల్లాలో ఆ ఎమ్మెల్యేకి ఇంటి పోరు త‌ప్ప‌డం లేదా?

By:  Tupaki Desk   |   22 Aug 2022 4:13 AM GMT
నెల్లూరు జిల్లాలో ఆ ఎమ్మెల్యేకి ఇంటి పోరు త‌ప్ప‌డం లేదా?
X
వైఎస్సార్సీపీ అత్యంత బ‌లంగా ఉన్న క‌డ‌ప జిల్లా త‌ర్వాత ఏదైనా ఉందంటే అది నెల్లూరు జిల్లానే. గ‌త ఎన్నిక‌ల్లో మొత్తం ప‌ది అసెంబ్లీ సీట్ల‌ను వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే నేత‌ల మ‌ధ్య ఉన్న విభేదాలు ఆ పార్టీకి త‌ల‌నొప్పి తెస్తున్నాయ‌ని అంటున్నారు. ముఖ్యంగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌కు ఇంటిపోరు మొద‌ల‌యింద‌ని చెబుతున్నారు.

వైఎస్ జ‌గ‌న్ మొద‌టి కేబినెట్ విస్త‌ర‌ణ‌లో కీల‌కమైన జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.. అనిల్. అయితే శాఖ‌పై ప‌ట్టు కంటే ప్ర‌త్య‌ర్థి పార్టీ నేత‌ల‌పై విమ‌ర్శ‌ల‌కే ప‌రిమిత‌మ‌య్యార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. రెండోసారి జ‌గ‌న్ కేబినెట్ విస్త‌ర‌ణ‌లో అనిల్ కుమార్ యాదవ్ ను మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించారు. సర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డి మంత్రి ప‌ద‌విని కొట్టేశారు. ఈ సంద‌ర్భంగా అనిల్ చేసిన వ్యాఖ్య‌లు కాక‌రేపాయి. తాను మంత్రిగా ఉన్న‌ప్పుడు కాకాణి త‌న‌పై ఎలాంటి ప్రేమ‌, అనురాగం, వాత్స్య‌ల్యం చూపారో అంత‌కు రెట్టింపు తాను కూడా చూపిస్తాన‌ని అనిల్ న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. దీంతో అనిల్‌ను, కాకాణిని పిలిపించి వైఎస్సార్సీపీ అధిష్టానం మాట్లాడాల్సి వ‌చ్చింది.

మ‌రోవైపు మంత్రిగా ఉన్న‌ప్పుడు అనిల్ వ్య‌వ‌హ‌రించిన తీరుతో ఎమ్మెల్యేలు ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధ‌ర‌రెడ్డి, త‌దిత‌రులు అనిల్ కుమార్‌కు దూర‌మ‌య్యార‌ని స‌మాచారం. ఇంత‌టితో ఆగ‌కుండా అనిల్‌కు సొంత ఇంటిలోనే అస‌మ్మ‌తి పోరు మొద‌ల‌య్యింద‌ని అంటున్నారు. నెల్లూరు కార్పొరేష‌న్ లో అనిల్ కుమార్ బాబాయ్ రూప్ కుమార్ డిప్యూటీ మేయ‌ర్‌గా ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో నెల్లూరు సిటీ నుంచి రూప్ కుమార్‌ను ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా దించుతార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న‌కు మంత్రి కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి, ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి త‌దిత‌రులు మ‌ద్ద‌తు ఇస్తున్నార‌ని చెప్పుకుంటున్నారు.

ఇటీవ‌ల జ‌రిగిన మునిసిప‌ల్ కార్పొరేష‌న్ స‌మావేశాల్లో అనిల్ కుమార్ వ‌ర్గానికి చెందిన కార్పొరేట‌ర్‌తో, డిప్యూటీ మేయ‌ర్ గా ఉన్న అనిల్ బాబాయ్ రూప్ కుమార్ త‌న్నులాట‌కు దిగ‌డం నెల్లూరు రాజ‌కీయాల‌ను హీటెక్కించింది. ఈ ప‌రిణామాల‌తో అనిల్, రూప్ కుమార్ మ‌ధ్య ఉన్న సంబంధాలు ఉప్పూనిప్పుగా మారాయని అంటున్నారు.

ఇప్ప‌టిదాకా ఒకే కుటుంబంగా ఉండి, ఒకే ఆఫీసు ద్వారా కార్య‌క‌లాపాలు సాగిస్తున్న మంత్రి అనిల్, ఆయ‌న బాబాయ్ రూప్ కుమార్ ప్ర‌స్తుతం వేర్వేరుగా త‌మ కార్య‌క‌లాపాల‌ను సాగిస్తున్నార‌ని అంటున్నారు. రూప్ కుమార్ యాద‌వ్ సొంతంగా ఆఫీసును పెట్టుకున్నార‌ని చెబుతున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి రూప్ కుమార్‌కు మ‌ద్ద‌తిస్తున్న 11 మంది కార్పొరేట‌ర్లు వ‌చ్చార‌ని టాక్. అయితే రూప్ కుమార్‌కు తెర వెనుక వైఎస్సార్సీపీ పెద్ద‌లెవ‌రో మ‌ద్ద‌తు ఇస్తున్నార‌ని.. లేదంటే ఆయ‌న ఇంత దూకుడుగా వెళ్ల‌ర‌ని అనిల్ కుమార్ వ‌ర్గం అనుమానిస్తోంది. నెల్లూరు సిటీలో అనిల్‌పై వ్య‌తిరేక‌త ఉంద‌ని.. వచ్చే ఎన్నికల్లో రూప్ కుమార్‌కే టిక్కెట్ ఇప్పించే ప్రయత్నాలు కూడా చేస్తున్నార‌ని అనిల్ వ‌ర్గం సందేహాలు వ్య‌క్తం చేస్తోంది.

వాస్త‌వానికి అనిల్ కుమార్ 2009లో అతి స్వ‌ల్ప మెజారిటీతో ప్ర‌జారాజ్యం పార్టీ అభ్య‌ర్థి శ్రీధ‌ర్ కృష్ణారెడ్డిపై ఓడిపోయారు. 2014, 2019 ఎన్నిక‌ల్లో నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. జ‌గ‌న్ రెండో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఆయ‌న‌ను ప‌ద‌వి నుంచి తొల‌గించాక ఆయ‌న‌ను తిరుప‌తి, వైఎస్సార్ జిల్లాల‌కు పార్టీ రీజన‌ల్ కోఆర్డినేట‌ర్‌గా నియ‌మించారు.