Begin typing your search above and press return to search.

టీ కాంగ్రెస్‌ లో రేవంత్‌ కు పొగ పెడుతోందెవ‌రు...!

By:  Tupaki Desk   |   1 Jun 2022 11:30 AM GMT
టీ కాంగ్రెస్‌ లో రేవంత్‌ కు పొగ పెడుతోందెవ‌రు...!
X
టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డికి సొంత పార్టీలోనే పొగ పెడుతున్నారా..? కొంద‌రి నేత‌ల అడుగులు అటువైపే వెళుతున్నాయా..? ప‌రోక్షంగా మ‌రో నాయ‌కుడికి మ‌ద్ద‌తు తెలుపుతున్నారా..? అధిష్ఠానంలోని ఒక వ‌ర్గం కూడా ఇందుకు సుముఖంగా ఉందా..? అంటే పార్టీ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. టీపీసీసీ నిర్వ‌హిస్తున్న చింత‌న్ శిబిర్ వేదిక‌గా ఈ అనుమానాలు బ‌ల‌ప‌డుతున్నాయి.

ఇటీవ‌ల రాజ‌స్థాన్ లో ఏఐసీసీ చింత‌న్ శిబిర్ కార్య‌క్ర‌మాన్ని మూడు రోజుల పాటు నిర్వ‌హించింది. దీనికి మ‌ద్ద‌తు తెలుపుతూ అన్ని రాష్ట్రాల నుంచి తీర్మానాల‌ను ఢిల్లీకి పంపించాల్సి ఉంది. దీని కోసం తెలంగాణ కాంగ్రెస్ శాఖ జూన్ 1, 2 తేదీల్లో హైద‌రాబాద్ శివార్ల‌లో చింత‌న్ శిబిర్ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. అయితే ఇక్క‌డే అస‌లైన ట్విస్టు నెల‌కొంది. టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ లేకుండానే ఈ కార్యక్ర‌మానికి ప్లాన్ చేశారు.

అమెరికాలో ఆటా ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ‌నున్న తెలంగాణ ఆవిర్భావ వేడుక‌ల‌కు రేవంత్ రెడ్డి వెళ్లారు. జూన్ 1, 2 తేదీల్లో ఆయ‌న అక్క‌డే ఉండ‌నున్నారు. ఆయ‌న లేని స‌మ‌యంలో ఇక్క‌డ మిగ‌తా సీనియ‌ర్లంద‌రూ భేటీ అవుతుండ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. రేవంత్ వ‌చ్చాక ఈ కార్య‌క్ర‌మం పెట్టుకుందామ‌ని పార్టీలోని ఒక వ‌ర్గం సూచించినా.. సీనియ‌ర్లంద‌రూ ఆయ‌న లేని సమ‌యంలోనే జ‌ర‌పాల‌ని ప‌ట్టుబ‌ట్టార‌ట‌.

సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క ఆధ్వ‌ర్యంలో ఈ కార్య‌క్ర‌మం జరుగుతోంది. దీనికి సంబంధించి ఆరు క‌మిటీల‌ను వేశారు. అయితే రేవంత్ అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచీ దూరంగా ఉన్న‌సీనియ‌ర్లంద‌రూ ఈ స‌మావేశానికి హాజ‌ర‌వుతుండ‌డం విశేషం. అంటే ప‌రోక్షంగా భ‌ట్టి విక్ర‌మార్క నాయ‌క‌త్వానికి మ‌ద్ద‌తు ప‌లుకుతున్న‌ట్లు అయింది. ఈ కార్య‌క్ర‌మానికి ఢిల్లీ పెద్ద‌లు కూడా వ‌స్తున్నార‌ట‌. దీని వెనుక ఏదో పెద్ద గూడుపుఠాణి ఉంద‌ని రేవంత్ స‌న్నిహితులు అనుమానిస్తున్నార‌ట‌.

భ‌ట్టి, కోమ‌టి రెడ్డి బ్ర‌ద‌ర్స్‌, జ‌గ్గారెడ్డి లాంటి కొంద‌రు నేత‌లు మొద‌టి నుంచీ రేవంత్ నాయ‌క‌త్వాన్ని వ్య‌తిరేకిస్తున్న విష‌యం తెలిసిందే. ఇపుడు వీరు భ‌ట్టిని ముందు పెట్టి గేమ్ న‌డిపిస్తున్నార‌ని పార్టీ వ‌ర్గాలు సందేహిస్తున్నాయి. ఇటీవ‌ల రేవంత్ చేసిన రెడ్డి రాజ‌కీయంపై కూడా ఈ స‌భ‌లో చ‌ర్చించ‌నున్నార‌ట‌. పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మాణికం ఠాగూర్ ఎదుటే ఈ విష‌యాన్ని తేల్చుకోవాల‌ని రేవంత్ వ్య‌తిరేక వ‌ర్గం ఫిక్స‌యింద‌ట‌.

కాంగ్రెస్ పార్టీ ఒకే వ్య‌క్తి ఆధీనంలో న‌డిచేది కాద‌ని.. రేవంత్ హీరో కాద‌ని.. ఆయ‌న లేకుండానే ఈ స‌భ‌ను స‌క్సెస్ చేసుకుంటామ‌నే సందేశాల‌ను సీనియ‌ర్లు పంపిస్తున్నారట‌. దీనిపై పార్టీలోని మ‌రో వ‌ర్గం మాత్రం ఆందోళ‌న‌గా ఉంద‌ట‌. ఈ కార్య‌క్ర‌మాన్ని అన్ని రాష్ట్రాల్లో పీసీసీ అధ్యక్షుల ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తుండ‌గా.. ఇక్క‌డ మాత్రం రేవంతు లేకుండానే జ‌రుపుతున్నార‌ని మ‌ధ‌న‌ప‌డుతున్నార‌ట‌. దీని వెనుక ఏదో అదృశ్య శ‌క్తుల హ‌స్తం ఉంద‌ని.. కావాల‌నే రేవంతుకు పొగ పెడుతున్నార‌ని సందేహిస్తున్నారు. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో..!