Begin typing your search above and press return to search.

ఉద్రిక్తంగా కుప్పం.. పోలీసుల అప్ర‌క‌టిత క‌ర్ఫ్యూ!

By:  Tupaki Desk   |   25 Aug 2022 7:54 AM GMT
ఉద్రిక్తంగా కుప్పం.. పోలీసుల అప్ర‌క‌టిత క‌ర్ఫ్యూ!
X
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో ప‌రిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. చంద్ర‌బాబు మూడు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా మొద‌టి రోజు ఆయ‌న ప‌ర్య‌ట‌న‌లో వైఎస్సార్సీపీ కార్య‌క‌ర్త‌లు జై జ‌గ‌న్ నినాదాలు చేసిన సంగ‌తి తెలిసిందే. రామ‌కుప్పం మండ‌లంలోని కొల్లుప‌ల్లిలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌కు ముందు రోజు రాత్రే వైఎస్సార్సీపీ తోర‌ణాలు, జెండాలు ఏర్పాటు చేశారు. ఇక చంద్ర‌బాబు కొల్లుప‌ల్లిలో ప‌ర్య‌ట‌న ప్రారంభించ‌గానే వైఎస్సార్సీపీ కార్య‌క‌ర్త‌లు ఆ పార్టీ జెండాలతో నినాదాలు చేశారు. దీంతో టీడీపీ, వైఎస్సార్సీపీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ చెల‌రేగి త‌న్నుకున్నారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వ‌చ్చింది.

ఇక రెండో రోజు ఆగ‌స్టు 25న వైఎస్సార్సీపీ కుప్పం బంద్‌కు పిలుపునిచ్చింది. ప్ర‌తి పంచాయ‌తీ నుంచి ఐదు వంద‌ల మంది కార్య‌క‌ర్త‌లు కుప్పం త‌ర‌లిరావాల్సిందిగా పిలుపునిచ్చింది. ఆగ‌స్టు 25న ఉదయం కుప్పంలో అన్న క్యాంటీన్‌ను చంద్రబాబు ప్రారంభించాల్సి ఉండగా.. వైఎస్సార్సీపీ కార్య‌క‌ర్త‌లు దాన్ని ధ్వంసం చేశారు. అంతేకాకుండా టీడీపీ నేతల బ్యానర్లను చించేశారు. దీంతో చంద్ర‌బాబు అన్న క్యాంటీన్‌ను ప్రారంభించి.. దాని ఎదుట ధ‌ర్నాకు దిగారు.

ఉద్రిక్త పరిస్థితులు నెల‌కొన‌డంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోలీసులు కుప్పంలో అప్రకటిత కర్ఫ్యూ విధించారు. ఆర్టీసీ బస్సులు బస్ డిపోలకే పరిమితం కాగా, అన్ని దుకాణాలు, పాఠశాలలు మూత‌ప‌డ్డాయి. టీడీపీ, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను కుప్పంలోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.

అయితే వైఎస్సార్సీపీ నేత‌లు హింసాత్మక చర్యల‌కు దిగ‌డంతో స్థానిక టీడీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేయడంతో ఘర్షణ జరిగింద‌ని చెబుతున్నారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. కొత్త అన్న క్యాంటీన్‌పై అధికార పార్టీ నేత‌లు దాడి చేసి ధ్వంసం చేయ‌డంతో చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి ఆయ‌న‌ నిరసనకు దిగారు.

ఈ సందర్భంగా చంద్రబాబు.. సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. తాను చాలా ప్రభుత్వాలను, రాజకీయ నాయకులను చూశాను కానీ జగన్‌లా ఎవరూ లేరని మండిప‌డ్డారు. ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ నేతలు గూండాల్లా ప్రవర్తిస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు. అధికార పార్టీ ఆదేశాల మేరకు పోలీసులు నడుచుకోవడం విచారకర‌మ‌న్నారు. త‌మ‌కు 60 లక్షల మంది కార్యక‌ర్త‌లు ఉన్నా హింసాత్మక చర్యలకు దిగడం లేద‌ని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‎ లో వైఎస్సార్సీపీ అరాచకాలు పేట్రేగిపోతున్నాయని చంద్ర‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ సర్కార్ రాష్ట్రంలో వీధికో రౌడీని తయారు చేసిందని మండిపడ్డారు. అన్నం పెట్టే అన్న క్యాంటీన్నే ధ్వంసం చేస్తారా? అంటూ నిప్పులు చెరిగారు. ఈరోజు కుప్పం చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోతుందన్నారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్ర‌శ్నించారు. రాష్ట్రాన్నివైఎస్సార్సీపీ అతలాకుతలం చేయాలని చూస్తోందన్నారు. కుప్పం నుంచే ధర్మపోరాటం మొదలుపెట్టానని.. తనపైనే దాడి చేయాలని ప్రయత్నించారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.