Begin typing your search above and press return to search.

వైసీపీ గ‌డ‌పలో గండం?

By:  Tupaki Desk   |   24 Aug 2022 4:30 PM GMT
వైసీపీ గ‌డ‌పలో గండం?
X
ఇప్ప‌టికే రెండు విడ‌త‌ల గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ పూర్తి కావొస్తుంది. ఇప్పుడు గ‌డ‌ప గ‌డ‌ప‌కూ క‌లెక్ట‌ర్ అనే ప్రొగ్రాం కూడా డిజైన్ చేస్తున్నారు. ఇక‌పై గ‌డ‌ప గ‌డ‌ప‌కూ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్లు పాల్గొంటారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వీరితో పాటు క‌లెక్ట‌ర్లు. ఈ విధంగా పాల‌న‌కు మ‌రింత పార‌ద‌ర్శ‌క‌త జోడించాల‌ని సీఎం అనుకుంటున్నారు. వాస్త‌వానికి ఇప్ప‌టికే చాలా చోట్ల ప్ర‌జా వ్య‌తిరేక‌త కనిపిస్తోంది. గతిలేక ఎమ్మెల్యేలు ఏదో ఒక విధంగా నెట్టుకువ‌స్తున్నార‌ని ఓ అభిప్రాయం వినిపిస్తోంది సోష‌ల్ మీడియాలో ! అందుకే ఈ కొత్త ఆలోచన.

తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని మ‌రింత విస్తృతం చేయాల‌ని భావిస్తున్నారు. క‌లెక్ట‌ర్లు., ఇత‌ర ముఖ్య యంత్రాంగం కూడా ఇటుగా రావాల‌ని, క్షేత్ర స్థాయి స‌మ‌స్య‌లు తెలుసుకుని తీరాల‌ని భావిస్తున్నారు. ఇదంతా బాగుంది. నెల‌లో ఆయ‌న చెప్పిన విధంగా క‌నీసం ఆరు స‌చివాల‌యాలు సంద‌ర్శించాలి.

ఇప్ప‌టికే సోమ‌వారం నాడు నిర్వ‌హించే గ్రీవెన్స్ ( స్పంద‌న కార్య‌క్ర‌మం) కు కూడా జనం బాగానే వ‌స్తున్నారు. ఇవే స‌మ‌స్య‌ల‌తో జిల్లా కేంద్రాల‌కు వ‌చ్చి క‌లెక్ట‌ర్ కో, జేసీ కో తమ బాధలు చెప్పుకుని వెళ్తున్నారు. అవి కూడా సాల్వ్ కావ‌డం లేదు. మ‌రి ! ఇప్పుడు క‌లెక్ట‌ర్లు గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వ‌చ్చి ఏం మార్పు తీసుకువ‌స్తారో అన్న‌ది పెద్ద సందేహంగానే ఉంది అన్న వాద‌న ఒక‌టి విప‌క్షం నుంచి వ‌స్తుంది.

పాల‌న‌లో వేగవంతం అయిన నిర్ణ‌యాల అమ‌లుకు ముఖ్యంగా కొన్ని కీల‌క ప‌నులు చేప‌ట్టేందుకు ఒక్కో స‌చివాల‌యానికి ఇర‌వై ల‌క్ష‌లు కేటాయింపులు చేశామ‌ని, అంటే మొత్తం మూడు వేల కోట్ల రూపాయ‌లు ఇచ్చామ‌ని, వీటితో సంబంధిత ప్ర‌క్రియ ప్రారంభించాల‌ని సీఎం ఆదేశించారు. అయినా కూడా క్షేత్ర స్థాయిలో ఎస్టిమేష‌న్స్ అన్న‌వే రూపుదిద్దుకోలేదు.

అంటే ఎమ్మెల్యేలు చెప్పినా కొంద‌రు వినని దాఖ‌లాలు ఉన్నాయి. ఎలా చూసుకున్నా పాల‌న‌లో క‌లెక్ట‌ర్ల చొర‌వ కూడా త‌క్కువ‌గానే ఉంద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కొన్నింట రాజ‌కీయ నాయ‌కుల‌తో క‌లెక్ట‌ర్లు ప‌నిచేస్తూ, వారి ఆదేశాల మేర‌కే ప‌నులు చేప‌ట్టాల‌ని భావిస్తున్నారు.

ఆ విధంగా చూసినా ఆ రాజ‌కీయవేత్త చెప్పిన కొన్ని ప‌నులు అయినా ప్రారంభం కావాలి క‌దా ! ఆ విధంగా కూడా కావ‌డం లేదు. వచ్చేసారి గెలుపు ఖాయం అని అనుకున్న‌వారే నియోజ‌క‌వ‌ర్గాల్లో తిరుగుతున్నారు. మిగ‌తా వాళ్లూ సీఎం ఏం చెప్పినా వినీ వినిపించుకోకుండా వెళ్తున్నారు. దాంతో క‌లెక్ట‌ర్ వ‌చ్చినా, మినిస్ట‌ర్ తిరిగినా స‌మ‌స్య మాత్రం ఏ విధంగానూ ప‌రిష్కారం కావ‌డం లేదు.