Begin typing your search above and press return to search.

ఏకంగా 200 కోట్లు దాచేశారా? సినీ నిర్మాతలపై ఐటీ దాడుల కలకలం

By:  Tupaki Desk   |   7 Aug 2022 4:43 AM GMT
ఏకంగా 200 కోట్లు దాచేశారా? సినీ నిర్మాతలపై ఐటీ దాడుల కలకలం
X
కోట్లు పెట్టి సినిమా తీయడం.. అంతకుమించిన ఆదాయం సొమ్ము చేసుకోవడం.. లెక్కలు తక్కువ చూపి కోట్ల పన్ను ఎగ్గొట్టడం.. కలెక్షన్లకు కట్టే పన్నులకు భారీ తేడా ఉండడంతో సినీ ప్రముఖులపై కేంద్ర ఐటీ శాఖ దాడులుచేసింది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 200 కోట్ల అక్రమర్జానను గుర్తించింది. ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనమైంది.

తమిళ చిత్రపరిశ్రమకు చెందిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు జరిపిన దాడుల్లో లెక్కల్లో చూపని రూ.200 కోట్ల ఆదాయాన్ని గుర్తించారు. అలాగే రూ.26 కోట్ల నగదును, రూ.3 కోట్ల విలువైన బంగార ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

ఏకకాలంలో చెన్నై, మధురై, కోయంబత్తూరు, వేలూరులలోని మొత్తం 40 ప్రాంతాల్లో ఈనెల 2 నుంచి 5వ తేదీ వరకూ ఐటీ అధికారులు దాడులు చేశారు. దీనికి సంబంధించి శనివారం ఐటీ అధికారులు ప్రకటన విడుదల చేశారు.

ప్రధానంగా నిర్మాతలు, ఫైనాన్షియర్లు, డిస్ట్రిబ్యూటర్ల ఇళ్లు కార్యాలయాలపై దాడులు జరిపినట్టు పేర్కొన్నారు. కొందరి నుంచి సినీ ఫైనాన్స్ కు సంబంధించిన దస్తావేజులు, ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

మొత్తం 4 రోజుల పాటు జరిగిన సోదాల్లో లెక్కల్లో చూపని రూ.200 కోట్ల ఆదాయాన్ని గుర్తించారు. రూ.26 కోట్ల నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు వివరించారు. ఇక నిర్మాతలు దాచిపెట్టిన రహస్య నగదు బదిలీ వ్యవహారాలకు సంబంధించిన ఆధారాలను సేకరించినట్టు తెలిపారు. పలు పెట్టుబడులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు.

ఇక ఈ దాడుల్లో పలువురు నిర్మాతలు పన్నులు ఎగ్గొట్టినట్టు గుర్తించామని.. సినిమా నిర్మాణానికి సంబంధించిన వాస్తవ ఖర్చును తొక్కిపెట్టిన విషయాన్ని గుర్తించారు. థియేటర్ల నుంచి డిస్ట్రిబ్యూటర్లు తీసుకున్న సొమ్ముకు లెక్కలు చూపలేదు. ఆ ఆధారాలు సేకరించినట్టు తెలిపారు. డిస్ట్రిబ్యూటర్లు సిండికేట్ గా ఏర్పడి పన్నులు ఎగ్గొడుతున్నారని ఐటీ దాడుల్లో తేలింది.

సినిమాలకు భారీ ఎత్తున కలెక్షన్లు వచ్చినప్పుడు సినీ నిర్మాతలు ప్రకటించుకుంటారు. కానీ వాటిని ఐటీ రూపంలో కట్టరని పేరుంది. అందుకే ఇలాంటి దాడులు జరుగుతుంటాయి.

అయితే నిర్మాతల వెర్షన్ వేరేగా ఉంది. ప్రేక్షకులను ఆకర్షించడానికి, సినిమాపై పాజిటివ్ ప్రచారానికే ఇలాంటి ప్రకటనలు చేస్తూ ఉంటామని.. ఐటీ అధికారులకు కొందరు నిర్మాతలు చెప్పారట.. హైప్ కోసమే చెప్తామని.. అంత కలెక్షన్లు రావని ఐటీ అధికారులకు వివరించారట.. దీంతో ఐటీ అధికారులకు ఈ పరిణామం మింగుడుపడలేదు.