Begin typing your search above and press return to search.

హిందూ ఆలయానికి రూ.2.5 కోట్ల భూమి ఇచ్చిన మస్లిం ఫ్యామిలీ

By:  Tupaki Desk   |   23 March 2022 5:14 AM GMT
హిందూ ఆలయానికి రూ.2.5 కోట్ల భూమి ఇచ్చిన మస్లిం ఫ్యామిలీ
X
మిగిలిన దేశాలకు భిన్నం భారతదేశం. అనూహ్యమైన మత సామరస్యం మనకు మాత్రమే సొంతం. ఏళ్లకు ఏళ్లుగా సాగుతున్న అనుబంధానికి తూట్లు పొడిచే కొన్ని ఉదంతాలు దేశంలో అక్కడక్కడా చోటు చేసుకోవటం.. వాటిని చిలువలు వలువలు చేసి ప్రచారం చేయటం.. మనసులో ద్వేష భావాన్ని పెంచే ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్న వైనం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. అయితే.. మత విద్వేషాన్ని మనసులో పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేసే వారు.. ఇప్పుడు చెప్పే ఉదంతాన్ని చదవాల్సిన అవసరం ఉంది.

ప్రపంచంలోనే అతి పెద్దదైన హిందూ దేవాలయాన్ని నిర్మిస్తున్న చోట.. భారీ విరాళాన్ని ప్రకటించింది ఒక ముస్లిం కుటుంబం. మత సామరస్యం అంటే ఏమిటన్న విషయానికి నిలువెత్తు నిదర్శనంగా మారిన ఈ ఉదంతం.. మత మౌఢ్యాన్ని మనసులో పెట్టుకునే వారికి చెంపదెబ్బగా దీన్ని చెప్పాలి. ఇంతకీ ఈ భారీ దేవాలయాన్ని ఎక్కడ నిర్మిస్తున్నారు? భారీ విరాళాన్ని ఇచ్చిన ముస్లిం కుటుంబం ఏం ఇచ్చింది? అన్న విషయాల్లోకి వెళితే..

బిహార్ లోని తూర్పు చంపారన్ జిల్లా కైథ్ వలియాలో 'విరాట్ రామాయణ్ మందిర్' పేరుతో భారీ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన హిందూ దేవాలయంగా దీనికి పేరుంది.

ఈ మందిరం కోసం ఏదైనా చేయాలని భావించిన ఇష్తియాక్ అహ్మద్ ఖాన్ కుటుంబం.. తాజాగా తమ కుటుంబానికి చెందిన 0.71 ఎకరాల భూమిని ఈ దేవాలయానికి ఇచ్చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ భూమి విలువ ఎంతో తెలుసా? అక్షరాల రూ.2.5 కోట్లు. అవును.. ఇంత ఖరీదైన భూమిని తాజాగా దేవాలయ నిర్మాణం కోసం అందజేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

వ్యాపారవేత్తగా స్థానికంగా సుపరిచితుడైన ఆయన్ను చూసిన పలువురు.. దీన్నో స్ఫూర్తిగా తీసుకొని విరాళం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నట్లు చెబుతున్నారు. ఈ హిందూ దేవాలయాన్ని 125 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు 100 ఎకరాలు సేకరించారు.

ఆలయం ఎత్తు 270 అడుగుల ఎత్తు ఉంటుందని ట్రస్టు సభ్యులు చెబుతున్నారు. ఏమైనా.. మాటలకు అందని మతసామరస్యం మనకు మాత్రమే సొంతమని చెప్పక తప్పదు. ఇప్పటికైనా మనసులో విషాన్ని పెట్టుకొని సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా రాతలు రాసే వారు కాస్త ఆలోచించాల్సిన అవసరం ఉంది.