Begin typing your search above and press return to search.

ఆ వ‌రుస‌లో ముందు విప్రో.. త‌ర్వాత ఇన్ఫోసిస్‌.. ఇప్పుడు ఐబీఎం!

By:  Tupaki Desk   |   15 Sep 2022 4:31 AM GMT
ఆ వ‌రుస‌లో ముందు విప్రో.. త‌ర్వాత ఇన్ఫోసిస్‌.. ఇప్పుడు ఐబీఎం!
X
ఉద్యోగి ఏక‌కాలంలో రెండు ఉద్యోగాలు చేయ‌డం (మూన్‌లైటింగ్‌) పై దిగ్గ‌జ ఐటీ కంపెనీలు మండిప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఇండియ‌న్ ఐటీ దిగ్గ‌జం విప్రో మూన్‌లైటింగ్‌కు తాము వ్య‌తిరేక‌మ‌ని స్ప‌ష్టం చేసింది. కొద్ది రోజుల క్రితం ఈ కోవ‌లో మ‌రో ఐటీ దిగ్గ‌జం.. ఇన్ఫోసిస్ చేరింది. ఇప్పుడు తాజాగా విప్రో, ఇన్ఫోసిస్‌ల కోవ‌లో ప్ర‌పంచ టెక్ కంపెనీ.. ఐబీఎం చేరింది.

మూన్‌లైటింగ్‌ను తాము అంగీక‌రించ‌బోమ‌ని ఐబీఎం తాజాగా వెల్ల‌డించింది. మూన్‌లైటింగ్ అనైతిక‌మ‌ని ఆ కంపెనీ అంటోంది. ఒక ఉద్యోగి ఒక కంపెనీలో ప‌నిచేస్తూ పార్ట్‌టైమ్ లేదా వేరే ప‌ద్ధ‌తుల్లో మ‌రో కంపెనీలో ఉద్యోగం ఎలా చేస్తాడ‌ని ప్ర‌శ్నిస్తోంది. ఇలా మూన్‌లైటింగ్ చేయ‌డం ఉద్యోగులు కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించ‌డ‌మే అవుతుంద‌ని చెబుతోంది. ఈ మేర‌కు కంపెనీకి చెందిన ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ ఐబీఎం ఇండియా, దక్షిణాసియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సందీప్‌ పటేల్ తాజా వ్యాఖ్య‌లు చేశారు.

''కంపెనీలో చేరేటప్పుడు 'ఐబీఎంకే పనిచేస్తా'నని ఉద్యోగులు ఒప్పంద పత్రంలో సంతకం చేస్తారు. అలాంటిది.. మిగిలిన సమయంలో వారు వేరే కంపెనీకి పనిచేస్తున్నారు. ఇది అనైతికం అని'' సందీప్ పటేల్ త‌న అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ విషయంలో విప్రో చైర్మ‌న్‌ రిషద్‌ ప్రేమ్‌జీ కొద్ది రోజుల క్రితం వ్య‌క్తం చేసిన అభిప్రాయాల‌తో తాను ఏకీభవిస్తానని సందీప్‌ పటేల్ తెలిపారు. ఒక్కసారే రెండు ఉద్యోగాలు చేయడం మోసంతో సమానమని విప్రో చైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ ఇటీవల తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి విదిత‌మే.

ఒక వ్యక్తి సాధారణ ఉద్యోగ సమయం తర్వాత మిగిలిన వేళలో రెండో ఉద్యోగం చేయడాన్ని కార్పొరేట్ ప‌రిభాష‌లో మూన్‌లైటింగ్ అంటున్నారు. ఉదాహరణకు.. ఓ ఉద్యోగి ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంట‌ల‌ వరకు ఒక కంపెనీలో పనిచేస్తాడు అనుకుందాం. ఆ త‌ర్వాత అత‌డు అదనంగా సంపాదించ‌డం కోసం అతడు రాత్రివేళల్లో మరో ఉద్యోగం చేయడాన్ని మూన్‌లైటింగ్ అని అంటున్నారు. చాలా మంది వర్క్‌ఫ్రమ్‌ హోం వదిలి తిరిగి ఆఫీస్‌లకు రాకపోవడం వెనుక మూన్‌లైటింగ్‌ కూడా ఓ కారణమనే అంచనాలు ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలోనే ఆయా కంపెనీలు మూన్‌లైటింగ్‌పై త‌మ అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఇన్ఫోసిస్ త‌న ఉద్యోగుల‌కు గ‌ట్టి హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. త‌మ ఉద్యోగులు ఎవ‌రైనా మూన్‌లైటింగ్ చేసిన‌ట్టు తేలితే వారిని నిర్దాక్షిణ్యంగా ఉద్యోగం నుంచి తొల‌గిస్తామ‌ని వార్నింగ్ ఇచ్చింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.