Begin typing your search above and press return to search.

ఏడో తరగతి చదివే పిల్లాడికి ఐటీ సంస్థ జాబ్ ఇచ్చింది

By:  Tupaki Desk   |   30 Oct 2019 4:55 AM GMT
ఏడో తరగతి చదివే పిల్లాడికి ఐటీ సంస్థ జాబ్ ఇచ్చింది
X
ఆ పిల్లాడు ఏడో తరగతి చదువుతున్నాడు. స్కూల్ కు వెళ్లాల్సిన వయసులో ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్న సిత్రమైన పరిస్థితి. వారంలో మూడు రోజులు స్కూల్ కు.. మరో మూడు రోజులు ఆఫీసుకు వెళ్లే ఈ కుర్రాడి వైనం వింటే ఆసక్తికరంగానే కాదు.. ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తుంది. ఇంతకీ ఆ పిల్లాడు ఎక్కడి వాడు? ఏం చేస్తుంటాడు? ఐటీ కంపెనీలో ఉద్యోగం ఎలా వచ్చింది? లాంటి వివరాల్లోకి వెళితే..

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన రాజ్ కుమార్.. ప్రియలు క్యాప్ జెమినీలో జాబ్ చేస్తుంటారు. వారి నివాసం మణికొండ. వాళ్లబ్బాయ్ శరత్ శ్రీచైతన్య స్కూల్ లో ఏడో క్లాస్ చదువుతున్నాడు. ఐటీ ఉద్యోగులైన పేరెంట్స్ రోజూ ల్యాప్ టాప్ లతో పని చేయటం.. వారి పని విషయంలో ఆసక్తిగా గమనించేవాడు. వారిని వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉండేవాడు.

అలా మొదలైన అతని ఆసక్తి ఇప్పుడు అతడ్ని జావాలో నైపుణ్యం సాధించటమే కాదు.. కోడింగ్ నేర్చుకున్నాడు. శరత్ ఆసక్తిని గుర్తించిన వారి తల్లిదండ్రులు ఐటీ ఉద్యోగిగా పనికొస్తాడని పలు ఐటీ సంస్థల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసి ఇంటర్వ్యూలకు వెళ్లాడు.

ఇతడిలోని ప్రతిభను గుర్తించిన మోంటైగ్నే సంస్థ నెలకు రూ.25వేల గౌరవ వేతనంతో డేటా సైంటిస్ట్ గా జాబ్ ఇచ్చారు. అదే సమయంలో అతగాడికున్న ప్రత్యేక పరిస్థితుల్ని గుర్తించి.. వారంలోకొన్ని రోజులు స్కూలుకు వెళ్లేలా.. మరికొన్ని రోజులు ఆఫీసుకు వచ్చేలా వెసులుబాటు కల్పించారు. స్కూల్ సైతం శరత్ విషయంలో ప్రత్యేక మినహాయింపు ఇవ్వటం గమనార్హం.