Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్‌లో ఐటీ దూసుకునిపోతోంది.. మ‌రి ఏపీలో మాటేంటి?

By:  Tupaki Desk   |   11 April 2022 3:30 AM GMT
హైద‌రాబాద్‌లో ఐటీ దూసుకునిపోతోంది.. మ‌రి ఏపీలో మాటేంటి?
X
రాష్ట్రాల అభివృద్ధిలో ఇటీవ‌ల కాలంలో కీల‌క పాత్ర పోషిస్తున్న ఐటీ సెక్టార్‌.. రాష్ట్రాల‌కు ఆదాయాన్ని స‌మ కూర్చ‌డ‌మే కాకుండా.. స్థానికంగా ఉపాధికి కూడా ఎంతో దోహ‌దం చేస్తోంది. విదేశీ కంపెనీలు పెద్ద ఎత్తున వ‌చ్చి పెట్టుబ‌డులు పెట్ట‌డం.. కంపెనీల‌ను ఏర్పాటు చేయ‌డం ద్వారా.. స్థానికంగా అనేక అభివృద్ధి కార్య‌క్ర మాలు కూడా జ‌రుగుతాయి. అదేస‌మ‌యంలో ఉద్యోగుల ద్వారా వృత్తి ప‌న్ను.. సంస్థ‌ల‌కు కేటాయించే భూ ముల ద్వారా స్థిరాస్తి ప‌న్నులు.. సంస్థల కార్య‌క్ర‌మాల ద్వారా.. ప‌న్నులు ఇలా ఎలా చూసుకున్నా.. రాష్ట్రాల కు ఇబ్బ‌డిముబ్బ‌డి ఆదాయం క‌నిపిస్తోంది.

అందుకే దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా ఐటీ కి ప్రాధాన్యం ఇస్తున్నాయి. అయితే.. ఎన్ని అవ‌కాశాలు క‌ల్పించినా.. ఎయిర్‌పోర్టు సౌక‌ర్యం.. ఉద్యోగుల ల‌భ్య‌త‌, మౌలిక సౌక‌ర్యాల క‌ల్ప‌న వంటివాటికి ప్రాధాన్యం ఇస్తున్న కంపెనీలు.. రాష్ట్రాల‌ను ఎంచుకుంటున్నాయి.ఈ క్ర‌మంలో క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరు ముందు వ‌రుస‌లో ఉంది. త‌ర్వాత‌.. స్తానంలో హైదరాబాద్ నిలిచింది. సైబ‌రాబాద్ ఐటీ ఇండ‌స్ట్రీకి ప‌ట్టుకొమ్మ‌గా మారింది. చంద్ర‌బాబు హ‌యాంలో ఈ న‌గ‌రాన్ని తీర్చిదిద్ద‌డం.. త‌ర్వాత‌.. వ‌చ్చిన కేసీఆర్ స‌ర్కారు కూడా ఐటీకి ప్రాధాన్యం ఇవ్వ‌డంతోపాటు పెట్టుబ‌డులను కూడా ఆహ్వానిస్తోంది.

ఐటీ ఉద్యోగుల‌కు భ‌ద్ర‌త‌, వారికి కావాల్సిన గృహ వ‌స‌తి విష‌యంలో రియ‌ల్ ఎస్టేట్ రంగాన్ని అన్ని విధాలా ప్రోత్స‌హించ‌డం..వంటివి హైద‌రాబాద్‌లోకీల‌కంగా మారాయి. ఫ‌లితంగా ఐటీ ట‌ర్నోవ‌ర్ ఏటికేడు పెరుగుతోంది. ఐటీ రంగంలో 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రంలో హైద‌రాబాద్ నుంచి 1.67 ల‌క్ష‌ల కోట్ల ఐటీ ఎగుమ‌తులు జ‌రిగాయ‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. అంత‌కు ముందు ఆర్థిక సంవ‌త్స‌రంలో 1.45 ల‌క్ష‌ల కోట్ల‌తో పోలిస్తే.. ఏకంగా 15 శాతం ఎగుమ‌తులు జ‌రిగి.. ఐటీ పుంజుకుంది. ఫ‌లితంగా ఐటీ ఎగుమ‌తుల్లో రెండంకెల వృద్ధిని న‌మోదు చేసింది.

ఇక‌, 2026 నాటికి.. ఏకంగా 3 ల‌క్ష‌ల కోట్ల ఐటీ ఎగుమతులు ల‌క్ష్యంగా పెట్టుకుంది. దీంతో పాటు 10 లక్ష‌ల మందికి ఉపాధి క‌ల్పించాల‌ని కూడా ప్ర‌భుత్వం నిర్దేశించుకుంది. మ‌రి దీంతో పోల్చుకుంటే.. ఏపీ ప‌రిస్థితి ఏంటి? అనేది ఇప్పుడు మేధావుల మ‌ధ్య చ‌ర్చ సాగుతోంది. చంద్ర‌బాబు హ‌యాంలో ఏటా పెట్టుబ‌డుల స‌ద‌స్సును నిర్వ‌హించి పెట్టుబ‌డులు ఆహ్వానించేవారు. అదేస‌మ‌యంలో విశాఖ‌ను ఐటీకి రాజ‌ధానిగా తీర్చిదిద్దాల‌నే సంకల్పం ఏర్పాటు చేసుకున్నారు. కానీ, జ‌గ‌న్ స‌ర్కారు హ‌యాంలో ఎక్క‌డా ఇలాంటి వ్యూహాలు క‌నిపించ‌డం లేదు.

అంతేకాదు.. క‌నీసం ఐటీకి పెట్టుబ‌డులు కూడా రావ‌డం లేదు. ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాలు న‌చ్చ‌క పోవ‌డం.. మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న లేక‌పోవ‌డం.. ర‌హ‌దారులు.. స‌రిగా లేక‌పోవ‌డం.. స‌బ్జిడీ విధానం.. విద్యుత్ కోత‌లు ..ఇలా క‌ర్ణుడి చావుకు కోటి కార‌ణాలు అన్న‌ట్టుగా.. ఏపీలో ఐటీ రంగం పుంజుకోక పోవ‌డానికి అనేక విష‌యాలు ప్ర‌ధానంగా మారాయ‌ని చెబుతున్నారు. దీంతో ఉపాధి పోగా.. ప‌న్నుల రూపంంలో ఆదాయాన్ని కూడా ప్ర‌భుత్వం కోల్పోతోంద‌ని..ఏపీకి గుర్తింపు కూడా లేకుండా పోయింద‌ని చెబుతున్నారు.