Begin typing your search above and press return to search.

కేసీఆర్ మాట వినని హైద‌రాబాదీల‌కు న‌ర‌క‌మే

By:  Tupaki Desk   |   3 Oct 2017 11:39 AM GMT
కేసీఆర్ మాట వినని హైద‌రాబాదీల‌కు న‌ర‌క‌మే
X
భారీగా కురిసిన వ‌ర్షాల‌తో హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం అత‌లాకుత‌ల‌మైంది. ఆకాశానికి చిల్లుప‌డిన‌ట్లుగా సోమ‌వారం సాయంత్రం రెండు గంట‌ల వ్య‌వ‌ధిలో 10 సెంటీమీట‌ర్ల‌కు పైగా భారీ వ‌ర్ష‌పాతం న‌మోదు కావ‌టంతో హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం వర్ష‌పు నీటితో త‌డిచి ముద్ద‌గా మారిపోయింది.

ఎప్పుడూ లేని విధంగా కురిసిన వ‌ర్షాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ నోట ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న ఒక‌టి వ‌చ్చింది. మ‌రీ.. అత్య‌వ‌స‌రం అనిపిస్తే త‌ప్పించి ఇళ్ల‌ల్లో నుంచి న‌గ‌ర ప్ర‌జ‌లు బ‌య‌ట‌క రావొద్ద‌న్న మాట ఆయ‌న చెప్పారు. అయితే.. కేసీఆర్ మాట‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోకుండా ఈ రోజు ఉద‌యం (మంగ‌ళ‌వారం) బ‌య‌ట‌కు వ‌చ్చిన న‌గ‌ర‌జీవికి చుక్క‌లంటే చుక్క‌లు క‌నిపించాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

మ‌రీ.. ముఖ్యంగా ఐటీ జీవుల క‌ష్టాలైతే అంతాఇంతా కాదు. పండ‌గ సెల‌వులు.. అక్టోబ‌రు 2 గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా సెల‌వు నేప‌థ్యంలో ఈ రోజు త‌ప్ప‌నిస‌రిగా ఆఫీసుల‌కు వెళ్లాల‌న్న ఉద్దేశంతో కేసీఆర్ మాట‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోకుండా రోడ్డు మీద‌కు వ‌చ్చిన వారికి ప్ర‌త్య‌క్ష న‌ర‌కం అంటే ఏమిటో క‌నిపించింది.

భారీగా కురిసిన నీరు నిలిచిపోవ‌టంతో ఐటీ కారిడార్‌.. ఆ దిశ‌గా వెళ్లే రూట్లు మొత్తం పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగుల‌తో నిండిపోయింది. రోడ్ల మీద నిలిచిన భారీ వ‌ర్షంతో వాహ‌నాలు ముందుకు నెమ్మ‌దిగా సాగ‌టంతో ట్రాఫిక్ అంత‌కంత‌కూ పెరిగిపోయింది. దీంతో.. గ‌చ్చిబౌలి.. జూబ్లీహిల్స్‌.. మాదాపూర్ త‌దిత‌ర ప్రాంతాల‌న్నీ వాహ‌నాల‌తో నిండిపోయాయి. ఆ వైపుగా వెళ్లే రోడ్లు మొత్తం ట్రాఫిక్ జాం నెల‌కొంది. ఐటీ కారిడార్‌ తో పాటు.. పంజాగుట్ట‌.. అమీర్ పేట‌.. దిల్‌ సుఖ్ న‌గ‌ర్‌.. ఉప్ప‌ల్‌.. ఇలా ఒక‌టి కాదు రెండు కాదు న‌గ‌రం మొత్తమ్మీదా దాదాపు 50కు పైగా ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జాం నెల‌కొంది.

ఇలాంటి ఇబ్బందిని గుర్తించే ఏమో కేసీఆర్ నోటి నుంచి అత్య‌వ‌స‌రం అయితే త‌ప్పించి ఇంటి నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌న్న మాట వ‌చ్చిందేమో?

కేసీఆర్ మాట‌ను ప‌ట్టించుకోకుండా రోడ్ల మీద‌కు వ‌చ్చిన ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్య‌క్ష న‌ర‌కం అంటే ఏమిటో క‌నిపించింద‌ని చెప్పాలి. సాక్ష్యాత్తు సీఎం నోటి నుంచి మాట వ‌స్తే.. దాన్ని ప‌ట్టించుకోక‌పోతే ఆ మాత్రం శాస్తి జ‌ర‌గాల్సిందేనంటారా?