Begin typing your search above and press return to search.

సోనూసూద్ రూ.20 కోట్లు ఎగవేసాడని ఐటీశాఖ ప్రకటన

By:  Tupaki Desk   |   18 Sep 2021 8:58 AM GMT
సోనూసూద్ రూ.20 కోట్లు ఎగవేసాడని ఐటీశాఖ ప్రకటన
X
ప్రముఖ నటుడు సోనూసూద్ రూ.20 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు శనివారం ఆదాయపు పన్ను(ఐటీ ) విభాగం వెల్లడించింది. ఇటీవల ఐటీ విభాగం సోనూసూద్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. నిన్నటివరకు మూడు రోజుల పాటు ఈ సోదాలు చేపట్టింది.

పన్ను ఎగవేత ఆరోపణలతో అధికారులు ఆయన ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు. ఈ క్రమంలోనే ఐటీ విభాగం ఈ ప్రకటన విడుదల చేసింది. సోనూసూద్ ఫారిన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) యాక్ట్ ను ఉల్లంఘించారని ఐటీ అధికారులు పేర్కొన్నారు.దానికింద క్రౌండ్ ఫండింగ్ ద్వారా విదేశీ దాతల నుంచి రూ.2.1 కోట్లను సేకరించినట్లు తెలిపారు.

సోనూసూద్ తోపాటు ఆయన సహచరుల కార్యాలయాల్లో కూడా పన్ను ఎగవేతకు సంబంధించిన ఆధారాలను గుర్తించినట్లు వెల్లడించారు.

కాగా కరోనా కల్లోలం వేళ దేశంలోని అసహాయులకు ఆపన్నహస్తం అందించి సోనూసూద్ రియల్ హీరో అనిపించుకున్నాడు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలతో దేశ ప్రజల మనసులో నిలిచిపోయారు. కాగా.. మొదటి వేవ్ సమయంలో ఆయన ఏర్పాటు చేసిన దాతృత్వ సంస్థ రూ.18 కోట్లకు పైగా విరాళాలను సేకరించిందని అధికారులు వెల్లడించారు. అందులో రూ.1.9 కోట్లు మాత్రమే సహాయ కార్యక్రమాలకు వినియోగించారని.. మిగతా డబ్బు ఆ సంస్థ ఖాతాలోనే ఉండిపోయిందని పేర్కొన్నారు.

ఇక ఇటీవలే విద్యార్థులకు మార్గనిర్ధేశం చేసే ఉద్దేశంతో రూపొందించిన కార్యక్రమానికి ఢిల్లీ ప్రభుత్వ మెంటర్ గా సోనూసూద్ నియమించబడ్డారు. ఈ నేపథ్యంలోనే ఐటీశాఖ సోదాలు జరపడంపై ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే బీజేపీ మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేసింది.