Begin typing your search above and press return to search.

లైఫ్ స్టైల్ భవన ఓనర్ కు ఐటీ షాక్

By:  Tupaki Desk   |   17 Jun 2016 5:54 PM GMT
లైఫ్ స్టైల్ భవన ఓనర్ కు ఐటీ షాక్
X
ఎక్కడో మొదలైన వ్యవహారం ఎక్కడికో వెళ్లటమే కాదు.. ఇప్పుడు అదో కొత్త మలుపు తీసుకోవటం ఆసక్తికరంగా మారింది. డబ్బుల్ని డబుల్ చేసుకోవాలన్న పేరాశతో దొంగబాబా మాటల బుట్టలో పడిపోయిన లైఫ్ స్టైల్ భవన యజమానికి ఊహించని మరో షాక్ తగిలిందని చెప్పాలి. ఇప్పటికే ఈ వ్యవహారంలో అందరి నోట్లో నానుతున్న ఆయనకు సంబంధించిన మరో అంశాన్ని ఐటీ అధికారులు బయటపెట్టారు. సంపన్నుడైన ఆయన దగ్గర రూ.1.30కోట్లను నొక్కేసిన దొంగబాబా దగ్గర రూ.1.10కోట్లను రికవరీ చేసిన పోలీసుల్ని ఆదాయపన్ను అధికారులు అప్రోచ్ అయ్యారు.

రికవరీ చేసిన మొత్తాన్ని మధుసూదన్ రెడ్డికి ఇవ్వొద్దని.. ఎందుకంటే మధుసూదన్ రెడ్డి ఐటీ శాఖకు రూ.22.33కోట్ల మొత్తం బకాయి ఉన్నట్లుగా వెల్లడించారు. దీంతో.. పోలీసులు రికవరీ చేసిన మొత్తంలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తాన్ని ఐటీ శాఖకు ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఇప్పటికే దొంగబాబా దెబ్బకు డబ్బు.. ఆరోగ్యం.. పరువు లాంటివి చాలానే పోగొట్టుకున్న ఆయనకు తాజాగా ఐటీ బకాయిల ఉందతం మరో తలనొప్పిగా మారినట్లు చెబుతున్నారు. బకాయిల మొత్తం లెక్క ఓకే అయ్యాక.. పూజలో పెట్టిన రూ.1.30కోట్లకు సంబంధించి ఐటీ శాఖ లెక్క అడిగే అవకాశం ఉందన్న మాట అధికార వర్గాల్లో వినిపిస్తోంది. చూస్తుంటే.. పూజతో డబ్బులు డబుల్ కావటమేమో కానీ.. ఇప్పటికే ఆయనకున్న సమస్యలు డబుల్ అయినట్లుగా కనిపిస్తుందని చెప్పక తప్పదు.