Begin typing your search above and press return to search.

వైర‌ల్ న్యూస్!.. ఐటీ గ్రిడ్ అశోక్ ప్ర‌త్య‌క్షం!

By:  Tupaki Desk   |   8 March 2019 5:53 PM GMT
వైర‌ల్ న్యూస్!.. ఐటీ గ్రిడ్ అశోక్ ప్ర‌త్య‌క్షం!
X
తెలుగు రాష్ట్రాల్లో పెను క‌ల‌క‌లం రేపుతున్న డేటా చోరీ కేసుకు సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటుచేసుకుంది. ఏపీకి చెందిన ప్ర‌జ‌ల సమ‌గ్ర వివ‌రాల‌ను చోరీ చేస్తూ... ఓట్ల తొల‌గింపున‌కు పాల్ప‌డుతున్న టీడీపీ అందుకు ఐటీ గ్రిడ్ అనే సంస్థ స‌హ‌కారం తీసుకుంటోంద‌ని - ఈ వ్యవ‌హారంపై ద‌ర్యాప్తు చేసి నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని వైసీపీ నేత‌లు తెలంగాణ పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన టీ పోలీస్‌... హైద‌రాబాద్ లోని ఐటీ గ్రిడ్ సంస్థ‌లో సోదాలు జ‌రిపారు. ప‌లు కీల‌క డాక్యుమెంట్ల‌తో పాటు కీల‌క స‌మాచారం ఉంద‌ని భావిస్తున్న కంప్యూట‌ర్లు - హార్డ్ డిస్క్‌ ల‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే అప్ప‌టిదాకా ద‌ర్జాగా హైద‌రాబాద్ లోనే ఉన్న ఐటీ గ్రిడ్ సంస్థ సీఈఓ దాక‌వ‌ర‌పు అశోక్‌... త‌న సంస్థ‌పై కేసు న‌మోదైంద‌ని తెలియ‌గానే... అడ్రెస్ లేకుండా పోయారు.

డేటా చోరీకి సంబంధించిన కేసులో త‌మ ముందు హాజ‌రై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని తెలంగాణ పోలీసులు ఇచ్చిన నోటీసుల‌ను కూడా బేఖాత‌రు చేస్తూ అశోక్‌... తాను ఎక్క‌డున్నాన‌న్న విష‌యాన్ని చెప్ప‌లేదు. ఈ క్ర‌మంలో త‌మ కోసం ప‌నిచేస్తున్న సంస్థ అధినేత అయిన అశోక్‌ను ఏపీ ప్ర‌భుత్వ‌మే కాపాడుతోంద‌ని, ఏపీలోనే అశోక్ ఉన్నాడ‌ని తెలంగాణ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసు ద‌ర్యాప్తు కోసం తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం (సిట్) చీఫ్ స్టీఫెన్ ర‌వీంద్ర నిన్న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ కేసులో కీల‌క నిందితుడిగా భావిస్తున్న అశోక్‌... అమ‌రావ‌తిలో దాక్కున్నా... అమెరికాలో దాక్కున్నా... వ‌దిలే ప్ర‌సక్తే లేద‌ని కూడా వార్నింగిచ్చేశారు. ఈ నేప‌థ్యంలో మ‌రికొంత‌కాలం పాటు అశోక్ జాడ క‌నిపించ‌ద‌న్న కోణంలో విశ్లేష‌ణ‌లు సాగాయి.

అయితే అంద‌రికీ షాకిస్తూ... అశోక్ ప్ర‌త్య‌క్ష‌మైపోయారు. ఏకంగా హైద‌రాబాద్ లోని తెలంగాణ హైకోర్టులో ఆయ‌న ప్ర‌త్య‌క్ష‌మైపోయారు. ఎలా ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారంటే... స్వ‌యంగా కాదు... త‌న న్యాయ‌వాది ద్వారా ఆయ‌న ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. ఈ కేసును కొట్టివేయాల‌ని త‌న‌దైన శైలి డిమాండ్‌ ను వినిపించిన అశోక్‌.. ఈ మేర‌కు హైకోర్టులో క్వాష్ పిటిష‌న్‌ ను దాఖ‌లు చేశారు. అశోక్ త‌ర‌ఫున ఆయ‌న న్యాయ‌వాదులు ఈ పిటిష‌న్‌ను హైకోర్టులో దాఖ‌లు చేశారు. అయితే అశోక్ పిటిష‌న్ ప‌ట్ల హైకోర్టు ఎలా స్పందిస్తుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారిపోయింది. హైకోర్టులో పిటిష‌న్ వేసిన అశోక్‌.. తాను ఎక్క‌డున్న విష‌యాన్ని మాత్రం బ‌య‌ట‌పెట్ట‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.