Begin typing your search above and press return to search.

ఐటీ గ్రిడ్ అశోక్ కు మూడినట్టే.?

By:  Tupaki Desk   |   26 May 2019 4:07 PM IST
ఐటీ గ్రిడ్ అశోక్ కు మూడినట్టే.?
X
ఏపీ ప్రజల ఆధార్, వ్యక్తిగత డేటాను తస్కరించి టీడీపీకి మేలు చేసేలా వ్యవహరించిన ఐటీ గ్రిడ్స్ సంస్థ నిర్వాహకుడు దాకవరపు అశోక్ కు ఇక నూకలు చెల్లినట్టే కనిపిస్తోంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఉంటూ ఏపీ ప్రజల డేటాతో టీడీపీకి లబ్ధి చేకూరేలా చేశారని ఈయనపై వైసీపీ - భారతీయ ఆధార్ సంస్థ ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. సేవామిత్ర యాప్ పేరుతో తెలుగుదేశం పార్టీ కోసం యాప్ సృష్టించి వ్యక్తుల సమాచారాన్ని టీడీపీకి అందించారని పోలీసులు అభియోగాలు మోపారు. దాదాపు 7.8 కోట్ల ఆంధ్రా - తెలంగాణ రాష్ట్ర పౌరుల ఆధార్ డేటాను సంస్థ టీడీపీకి అందజేసిందని సమాచారం. దీనిపై తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్)ను కూడా ఏర్పాటు చేసింది.

అయితే చంద్రబాబు మొన్నటివరకు సీఎంగా ఉండడంతో తెలంగాణ పోలీసులకు దొరకకుండా ఈయన ఏపీలోనే తలదాచుకున్నాడన్న గుసగుసలు వినిపించాయి. సిట్ నోటీసులు పంపినా కూడా విచారణకు హాజరు కాకుండా ఏపీలోనే చంద్రబాబు మద్దతుతో ఉన్నాడని ప్రచారం జరిగింది.

అయితే తాజాగా ఈయనను కాపాడిన చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోవడం.. ఏపీ సీఎంగా జగన్ ఎన్నిక కావడంతో ఇక తనకు ఏపీ సేఫ్ కాదని భావించి పోలీసులు ఎప్పుడైనా అరెస్ట్ చేయవచ్చనే భయంతో ఐటీ గ్రిడ్ అశోక్ అమెరికా పారిపోయాడని తెలుస్తోంది. ఇన్నాల్లు అమరావతి చుట్టుపక్కలే ఐటీ గ్రిడ్ అశోక్ ఉండేవారని బాబు ఓడిపోయాక ఏపీ పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడన్న చర్చ సాగుతోంది.