Begin typing your search above and press return to search.

పెద్ద నోట్ల రద్దుకు ఆరేళ్లు పూర్తి.. తాజా విచారణలో సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది?

By:  Tupaki Desk   |   9 Nov 2022 7:03 AM GMT
పెద్ద నోట్ల రద్దుకు ఆరేళ్లు పూర్తి.. తాజా విచారణలో సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది?
X
2016 నవంబర్‌ 8 ఉన్నట్టుండి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కేంద్ర ప్రభుత్వం దేశంలో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి పారేసిన సంగతి తెలిసిందే. ఎవరికీ చెప్పకుండా.. గుట్టుచప్పుడు కాకుండా పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం డీమానిటైజేషన్‌ (నోట్ల రద్దు) చేపట్టింది. ప్రధానంగా నల్ల ధనాన్ని అరికట్టడానికి, ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, నోట్ల రద్దు వల్ల ప్రయోజనాలు కంటే నష్టాలే ఎక్కువ వచ్చాయని తెలియడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. నోట్ల రద్దు చేసి నవంబర్‌ 8 నాటికి ఆరేళ్లు పూర్తయ్యాయి.

నోట్ల రద్దు రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ అడ్వొకేట్‌ వివేక్‌ నారాయణ్‌ శర్మ 2016 నవంబర్‌ 9న సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే నోట్ల రద్దుపై దేశవ్యాప్తంగా పలు హైకోర్టుల్లోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని పిటిషనర్లు కోరారు.

మరోవైపు వివేక్‌ నారాయణ్‌ శర్మ పిటిషన్‌పై అప్పటి సుప్రీంకోర్టు సీజే జస్టిస్‌ ఠాకూర్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పందించింది. ఇదే సమయంలో వివిధ రాష్ట్రాల హైకోర్టుల్లోని పిటిషన్ల విచారణపై 2016లోస్టే విధించింది. వాటన్నింటినీ సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని ఆదేశించింది. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన అన్ని పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగిస్తూ నాటి సీజే ఠాకూర్‌ నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పుడు మరోసారి పెద్ద నోట్ల రద్దు వ్యవహారాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నవంబర్‌ 9న విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో అఫిడవిట్లు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు గత అక్టోబర్‌ నెలలోనే కేంద్రానికి, రిజర్వ్‌ బ్యాంక్‌కు ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు నోట్ల రద్దు వల్ల కరెన్సీ చెలామణి చాలావరకు తగ్గిపోతుందని, డిజిటల్‌ లావాదేవీలు పెరుగుతాయని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం చెప్పినదానికి పూర్తి విరుద్ధంగా ప్రస్తుత పరిస్థితి ఉండటం గమనార్హం.

కేంద్ర ప్రభుత్వ నోట్ల రద్దుతో అత్యధికంగా ఇబ్బందులు పడిందని సామాన్య ప్రజలే కావడం గమనార్హం. అప్పటిదాకా చెలామణిలో ఉన్న నోట్లు రద్దు కావడంతో సాధారణ ప్రజలంతా తీవ్ర ఆందోళన చెందారు. వాటిని మార్చుకోవడానికి జనం బ్యాంకుల ముందు క్యూకట్టారు. బ్యాంకులు కిటకిటలాడాయి. నోట్ల రద్దు కోసం క్యూలో నిల్చొని 115 మంది మృతి చెందినట్టు కూడా వార్తలు వచ్చాయి.

2016 నవంబర్‌ 4న దేశంలో చెలామణిలో ఉన్న నగదు రూ.17.97 లక్షల కోట్లు. కాగా, 2022 అక్టోబర్‌ 21 నాటికి ఈ మొత్తం రూ.30.88 లక్షల కోట్లకు చేరుకోవడం గమనార్హం. అదేవిధంగా ఫోన్‌ పే, గూగుల్‌ పే, పేటీఎం, ఎయిర్‌టెల్‌ మనీ, జియో మనీ, వాట్సాప్‌ పే, అమెజాన్‌ పే వంటివాటి ద్వారా డిజిటల్‌ లావాదేవీలు పెరిగినప్పటికీ 2016తో పోలిస్తే 2022లో నగదు చెలామణి 72 శాతం పెరిగిందని నిపుణలు చెబుతున్నారు.

దేశంలో ఇప్పటికీ 15 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు లేవని.. దీంతో అనివార్యంగా నగదు లావాదేవీలపైనే ఆధారపడాల్సి వస్తోందని అంటున్నారు. ఇక నోట్ల రద్దు వల్ల వ్యాపారాలు దారుణంగా దెబ్బతిన్నాయి.

ఇదే సమయంలో ధనవంతులపై నోట్ల రద్దు ప్రభావం ఇసుమంత కూడా కనిపించలేదు. వారి వద్ద భారీ నగదు మొత్తాలను బ్యాంకులే మార్చి పెట్టాయనే విమర్శలు వ్యక్తమయ్యాయి.

నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి మందగించి జీడీపీ వృద్ధి రేటు 1.5 శాతం పడిపోయింది. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం వెంటనే కొత్తగా రూ.2,000, రూ.500 నోట్లను తీసుకొచ్చింది. నోట్ల రద్దుతో ఎంతమేరకు నల్లధనం అంతమైపోయిందో కేంద్రం ఇప్పటికీ లెక్కలు చెప్పకపోవడం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.