Begin typing your search above and press return to search.

విజయవాడకు ఐటీ దూరమేనా?

By:  Tupaki Desk   |   14 Jan 2016 11:29 AM GMT
విజయవాడకు ఐటీ దూరమేనా?
X
నవ్యాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇక విజయవాడ నవ్యాంధ్రకు రాజధాని. ఇటువంటి పరిస్థితుల్లో విజయవాడకు ఐటీ కంపెనీలు వేలాదిగా తరలి వస్తాయని ప్రతి ఒక్కరూ భావించారు. విదేశాల్లోని ఐటీ ప్రముఖుల్లోనూ విజయవాడకు చెందినవారే ఎక్కువగా ఉండడంతో కంపెనీల వరద ఉంటుందని, ఉద్యోగాలు వెల్లువెత్తుతాయని భావించారు. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ఉన్న పరిశ్రమలు కూడా తరలిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.

నవ్యాంధ్రలో ఐటీకి కేంద్రంగా విశాఖపట్నం రూపుదిద్దుకుంటోంది. చంద్రబాబు కూడా ఐటీకి కేంద్రంగా విశాఖపట్నాన్నే ప్రమోట్ చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన కార్యకలాపాలన్నీ అక్కడే నిర్వహించారు. దాంతో ఐటీ కంపెనీలన్నీ విశాఖ బాట పడుతున్నాయి. అదే సమయంలో, రాష్ట్ర విభజనకు ముందే విజయవాడలో మేథా టవర్స్ ను ఏర్పాటు చేశారు. ఇది ఆంద్రాలో ఐటీ కేంద్రంగా మారుతుందని భావించారు. కానీ నవ్యాంధ్ర ఏర్పడినా మేథా టవర్స్ కు ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. సరికదా.. ఇప్పుడు మేథా టవర్స్ను సెజ్ నుంచి తప్పించారు. దానిని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసుకునే భవనం చేసేశారు. దాంతో ఇప్పటికే అక్కడ ఉన్న ఐటీ కార్యాలయాలు తరలిపోయాయి. మేథా టవర్స్ కు బదులుగా కేసరపల్లిలో హైటెక్ సిటీని నిర్మిస్తారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు అది కూడా వెనక్కిపోయింది. వీరపనేని గూడెంలో ఐటీ పార్కు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు దాని మాటే ఎత్తడం లేదు.

ప్రభుత్వం కూడా ఐటీకి సంబంధించి విజయవాడ వైపు మొగ్గు చూపకపోవడంతో కంపెనీలూ ఆసక్తి చూపడం లేదు. దాంతో విజయవాడ పరిసరాల్లోని గ్రాడ్యుయేట్లు ఆందోలన చెందుతున్నారు. కనీసం స్టార్టప్ లకు అయినా విజయవాడలో అవకాశం కల్పించాలని, దాంతో తమకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని డిమాండ్ చేస్తున్నారు.