Begin typing your search above and press return to search.

అంతా రెడ్లే.. కాంగ్రెస్, టీఆర్ ఎస్ ఛాయిస్ వాళ్లే!

By:  Tupaki Desk   |   13 May 2019 8:52 AM GMT
అంతా రెడ్లే.. కాంగ్రెస్, టీఆర్ ఎస్ ఛాయిస్ వాళ్లే!
X
'రెడ్డి రాజ్యం' ముగిసింది అనే వారు ఎవరైనా ఉంటే వాళ్లు ఆ స్టేట్ మెంట్ విషయంలో పునరాలోచించుకోవాలి. తెలంగాణలో రెడ్డి రాజ్యం నడుస్తున్నట్టుగా ఉంది. ముఖ్యమంత్రి పీఠంలో రెడ్డి లేడు కానీ.. మిగతా పదవుల్లో మాత్రం రెడ్లు ఒక వెలుగు వెలుగుతూ ఉన్నారు.

ఈ క్రమంలో తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల జాబితాను గమనిస్తే అందుకు కొనసాగింపులా కనిపిస్తూ ఉంది. రెండు ప్రధాన పార్టీలు కూడా తమ తమ అభ్యర్థులు రెడ్డి కుల నేతలనే ప్రకటించడం విశేషం.

ముందుగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే.. రంగారెడ్డి జిల్లా నుంచి మాజీ మంత్రి పట్నం మహేంద్రరెడ్డి, నల్లగొండ నుంచి తేరా చిన్నపరెడ్డి, వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.. అభ్యర్థులు అయినట్టే. ఇలా ముగ్గురూ రెడ్లే పోటీ చేస్తూ ఉన్నారు.

ఈ విషయంలో కాంగ్రెస్ కూడా తీసిపోనని అంటోంది. నల్లొండ నుంచి కోమటిరెడ్డి లక్ష్మి పోటీ చేయవచ్చని తెలుస్తోంది. ఇక రంగారెడ్డి జిల్లా నుంచి ఉద‌య‌మోహ‌న్ రెడ్డి పోటీ చేయవచ్చని అంటున్నారు. వరంగల్ నుంచి కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇనుగుల వెంక‌ట్రామిరెడ్డి పోటీ చేసే అవకాశాలున్నాయి.

ఇలా ఇరు పార్టీల తరపు నుంచి కూడా పోటీదారులు, పోటీలో ఉండబోయే వారు రెడ్లే అవుతుండటం గమనార్హం. ఇదంతా కొనసాగుతున్న రెడ్డి రాజ్యానికి నిదర్శనం అని పరిశీలకులు అంటున్నారు.