Begin typing your search above and press return to search.

దేశంలో ఇక ఏడాదిన్న‌ర‌పాటు ఎన్నిక‌లే ఎన్నిక‌లు!

By:  Tupaki Desk   |   15 Oct 2022 6:31 AM GMT
దేశంలో ఇక ఏడాదిన్న‌ర‌పాటు ఎన్నిక‌లే ఎన్నిక‌లు!
X
ప్ర‌స్తుతం వ‌ర్షాకాలం ప్ర‌జ‌ల‌ను ముంచెత్తుతుండ‌గా.. ఇక ఎన్నిక‌లు దేశాన్ని ముంచెత్త‌నున్నాయి. వ‌చ్చే న‌వంబ‌ర్ నుంచి 2024 వ‌ర‌కు అంటే ఏడాదిన్న‌ర కాలం దేశంలో వివిధ రాష్ట్రాల అసెంబ్లీల‌కు, దేశ పార్ల‌మెంటుకు ఎన్నిక‌లు జ‌ర‌గనున్నాయి. దీంతో దేశ‌మంతా ఎన్నిక‌ల కోలాహ‌లం నెల‌కొంటోంది.

ఈ ఏడాది నవంబ‌ర్ నుంచి 2024 ఏప్రిల్ వ‌ర‌కు మొత్తం 11 రాష్ట్రాల‌కు అసెంబ్లీల‌కు, పార్ల‌మెంటుకు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌టం విశేషం. అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగే రాష్ట్రాల్లో... హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, గుజ‌రాత్‌, మేఘాల‌య‌, త్రిపుర‌, మిజోరాం, నాగాలాండ్‌, రాజ‌స్థాన్, క‌ర్ణాట‌క‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ తెలంగాణ‌ ఉన్నాయి.

తాజాగా ఉత్త‌రాది రాష్ట్రంలో హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ ఏడాది న‌వంబ‌ర్ 12న ఒకే విడ‌త‌లో హిమాచల్ ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. 68 స్థానాలు ఉన్న హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ప్ర‌స్తుతం బీజేపీ అధికారంలో ఉంది. ఈసారి అధికారం ద‌క్కించుకోవ‌డానికి కాంగ్రెస్ పార్టీ ఇక్క‌డ పోటీ ప‌డుతోంది.

ఇక ఈ ఏడాది న‌వంబ‌ర్ నెల‌లోనే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ అమిత్ షాల సొంత రాష్ట్ర‌మైన గుజ‌రాత్ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇక్క‌డ బీజేపీకి కాంగ్రెస్‌తోపాటు ఆమ్ ఆద్మీ పార్టీలు గ‌ట్టి పోటీ ఇస్తున్నాయి. గుజరాత్‌లో మ‌రోమారు విజ‌యం సాధించ‌డం బీజేపీకి కీల‌కం. లేదంటే ప్ర‌ధాని మోడీ ప్ర‌తిష్ట మ‌స‌క‌బార‌డం ఖాయం.

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత ఈశాన్య రాష్ట్రాలైన మేఘాల‌యా, త్రిపుర‌, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీల‌కు 2023 జ‌న‌వ‌రిలో ఎన్నిక‌లు జ‌రుగుతాయి. అలాగే 2023లోనే మార్చిలో ప్ర‌స్తుతం బీజేపీ అధికారంలో ఉన్న క‌ర్ణాట‌క అసెంబ్లీకి ఎన్నిక‌లు నిర్వ‌హిస్తారు. 2023 చివ‌ర‌లో తెలంగాణ అసెంబ్లీకి, మిజోరాం అసెంబ్లీకి, మ‌ధ్య‌ప్ర‌దేశ్ అసెంబ్లీకి, ఛ‌త్తీస్‌గ‌ఢ్ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ఇక 2024 జ‌న‌వ‌రిలో ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజ‌స్థాన్‌లో ఎన్నిక‌లు జ‌రుగుతాయి. అదే ఏడాది ఏప్రిల్‌లో దేశ పార్ల‌మెంటుకు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తారు. ఆ స‌మ‌యంలోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ‌కు కూడా ఎన్నిక‌లు నిర్వ‌హించే చాన్సు ఉంది.

కాగా లోక్‌స‌భ ఎన్నిక‌లకు ముందు ఎన్నిక‌లు జ‌రిగే 11 రాష్ట్రాల్లో... గుజ‌రాత్‌, క‌ర్ణాట‌క‌, రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, తెలంగాణ కీల‌కం. ఈ రాష్ట్రాలు మిన‌హా త్రిపుర‌, మిజోరాం, నాగాలాండ్‌, మేఘాల‌యా రాష్ట్రాలు చాలా చిన్న‌వి. ఈ రాష్ట్రాల్లో ఒక‌టి, రెండు మిన‌హాయించి ఎంపీ సీట్లు లేవు. ఈ నేప‌థ్యంలో పెద్ద రాష్ట్రాలైన గుజ‌రాత్‌, క‌ర్ణాట‌క‌, రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, తెలంగాణ కీల‌కం. వీటిలో గుజ‌రాత్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క‌ల్లో ప్ర‌స్తుతం బీజేపీనే అధికారంలో ఉంది. రాజ‌స్థాన్‌లో కాంగ్రెస్‌, తెలంగాణ‌లో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నాయి. పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో మెరుగైన స్థానాలు సాధించాలంటే ముందు ఆయా పార్టీలు ఈ రాష్ట్రాల్లో అధికారంలోకి రావ‌డం కూడా ముఖ్యం. ఈ నేప‌థ్యంలో ఆయా రాష్ట్రాల్లో ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు అధికారం ద‌క్కించుకుంటాయా? లేదా అనేది వేచిచూడాల్సిందే!

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.